Abdul Rehman Makki: నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో నిందితుల్లో ఒకరైన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించినట్లు ప్రముఖ వార్తా సంస్థ PTI తెలిపింది. దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న మక్కీ.. లాహోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డయాబెటిస్‌కు చికిత్స పొందుతున్నాడని నిషేధిత సంస్థ ధృవీకరించింది. "ఈ రోజు తెల్లవారుజామున మక్కీ గుండెపోటుకు గురయ్యాడ. అతను ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచాడు" అని జేడీ అధికారి తెలిపారు.
గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించిన ఐక్యరాజ్య సమితి
2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుకు సంబంధించి మక్కీకి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాతే పాకిస్థాన్ ముతాహిదా ముస్లిం లీగ్ (PMML) మక్కీ పాకిస్థాన్ భావజాలానికి వాది అని ఒక ప్రకటన విడుదల చేసింది. 2023లో ఐక్యరాజ్యసమితి అతనిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అతని ఆస్తులు స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించింది.
ముంబై దాడుల సూత్రధారి
ముంబై నగరాన్ని స్తంభింపజేసిన భయంకరమైన దాడులకు సూత్రధారుల్లో ఒకరు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ. గత నెలలోనే ఈ దాడి జరిగి 16 సంవత్సరాలకు (నవంబర్ 26) చేరుకుంది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం డిసెంబర్ 26, 2008న పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం గుండా ముంబైకి వచ్చి నగరాన్ని ముట్టడించడంతో వంద మందికి పైగా మరణించారు. ఎంతో మంది సెక్యూరిటీ గార్డులు, విదేశీయులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌లో, ఈ పేలుళ్లకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరిలో ఒక వార్తా సమావేశంలో, పాకిస్థాన్ ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల హత్యలలో భారత ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపించింది. దీన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది, ప్రచారంగా పేర్కొంది.
ఇకపోతే ముంబై ఉగ్రదాడి సమయంలో ఎన్ఎస్‌జీ కమాండోస్ (NSG), ముంబై పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ టెర్రరిస్టులను హతమార్చారు. ఇందులో కసాబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ టెర్రరిస్టును నాలుగేళ్ల పాటు హై సెక్యూరిటీతో జైలులో ఉంచారు. బాంబే కోర్టు ఇతడికి ఉరిశిక్ష విధించగా.. సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఇక 2012, నవంబర్ 21న కసబ్‌ను ఉరి తీశారు.