Intersting Facts About Manmohan Singh: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో (Delhi AIIMS) చికిత్స పొందుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు దేశంపై ఉన్న అంకిత భావాన్ని ఓ సంఘటన వెల్లడిస్తుంది. ప్రధానిగా ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయం సంబంధిత సర్జరీ చేసుకున్న అనంతరం ఆయన పలికిన పలుకులే దీనికి నిదర్శనమని.. వైద్యులు వెల్లడించారు. 10 గంటల సర్జరీ తర్వాత ఆయన తొలి ప్రశ్న దేశం గురించే అడిగారని సర్జరీ చేసిన వైద్యుల్లో ఒకరైన రమాకాంత్ పాండా వెల్లడించారు. '2009లో మన్మోహన్ సింగ్‌కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హార్ట్ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన కాస్త కోలుకున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడానికి వీలుగా అమర్చిన ఒక పైప్ తొలగించాం. ఆ వెంటనే మన్మోహన్ దేశం గురించే అడిగారు. నా దేశం ఎలా ఉంది?. కశ్మీర్ ఎలా ఉంది.? సర్జరీ గురించి నాకు ఎలాంటి బెంగా లేదు. నా ఆలోచనంతా నా దేశం గురించే' అని అన్నట్లు వైద్యుడు వెల్లడించారు. కాగా, ఎయిమ్స్ ఢిల్లీలోనే ఈ సర్జరీ జరిగింది.
ఆ కారంటేనే ఆయనకు ఇష్టం!
మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 2004 నుంచి 2014 వరకూ దేశాన్ని నడిపించారు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గానూ వ్యవహరించారు. కీలక బాధ్యతల్లో పలు లగ్జరీ కార్లలో ప్రయాణించిన ఆయనకు ఇవేవీ నచ్చేవి కావట. మన్మోహన్ తన సొంత 'మారుతి 800' కారు అంటేనే ఎంతో ఇష్టపడేవారని తెలుస్తోంది. ఆయన హయాంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చీఫ్‌గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ అసిమ్ (Arun Asim) ఈ విషయాన్ని వెల్లడించారు. 2004 నుంచి 2007 వరకూ మన్మోహన్ భద్రత బృందం ఎస్‌పీజీకి అరుణ్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూపీలోని (UP) కన్నౌజ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్.. మన్మోహన్ వద్ద పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
'మన్మోహన్‌కు ఒకే ఒక్క సొంతకారు ఉంది. అదే మారుతి 800. దాన్ని ప్రధాని నివాసంలో బీఎండబ్ల్యూ వెనుక పార్క్ చేసేవాళ్లం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన సొంతంగా కొనుగోలు చేసిన కారుకు ఎంతో విలువిచ్చేవారు. ఇది నా కారు అంటూ ఆ వాహనం గురించి తరచూ చెప్పేవారు. దాన్ని చూస్తే సామాన్యులకు నేను చేయాల్సిన పని గుర్తుకువస్తుంది. అయితే, బీఎండబ్ల్యూ లగ్జరీ కోసం కాదని.. భద్రత కోసం ఆ కారు వినియోగించాలని మేం ఆయన్ను కోరేవాళ్లం. అప్పుడు ఆయన 'కోట్లు విలువ చేసే ఆ కారు ప్రధానిది. కానీ నా కారు మాత్రం మారుతినే' అని చెప్పేవారు.' అంటూ అలనాటి జ్ఞాపకాలను అరుణ్ గుర్తు చేసుకున్నారు.