Arvind Kejriwal:
నేషనల్ కౌన్సిల్..
ఢిల్లీలో ఆప్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. పంజాబ్, గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల తరవాత నిర్వహించిన కీలక సమావేశంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్భంలో బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని అన్నారు. ఢిల్లీలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉందని చెప్పారు. నిజాయతీగా ఉంటున్న
వ్యక్తులపైనే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండి పడ్డారు. "దేశంలో ప్రతి ఒక్కరినీ ధనికులుగా మార్చడమే నా లక్ష్యం" అని వెల్లడించారు. అంతే కాదు. దేశంలోని సమస్యల్ని తీర్చాలనే ఉద్దేశంతోనే దేవుడు భూమి మీదకు పంపాడని అన్నారు. "దేశాన్ని సరైన మార్గంలో నడిపే పనిని దేవుడే ఆమ్‌ఆద్మీకి అప్పగించాడు" అని చెప్పారు. ఆమ్‌ఆద్మీ పార్టీని విస్తృతం చేయాలనే ఆలోచన తనకు లేదని, దేశానికి ఏం చేయొచ్చనే దృష్టితోనే ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. "మతం పేరుతో హింస జరగకూడదు. 130 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా బతకాలి" అని వెల్లడించారు. దేశమంతా ఓ కుటుంబం అని...అందరూ కలిసికట్టుగా పని చేయకపోతే...దేశాభివృద్ధి జరగదని అన్నారు. బీజేపీ దేశాన్ని విభజిస్తోందని విమర్శించారు. ఢిల్లీలోని పాఠశాలలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తోందని, దేశమంతా ఇదే విధానం అమల్లోకి రావాలని కోరారు. పేదరికాన్ని నిర్మూలించడమే కాదు...దేశ పౌరులందరినీ ధనికులుగా మార్చాలన్నదే తన లక్ష్యం అని స్పష్టం చేశారు.
ఎన్నికలే లక్ష్యంగా..
"టార్గెట్ 2024" ఎజెండాతో ముందుకు సాగనుంది ఆప్. పది మంది రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవలే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల బీజేపీ అధికారానికి స్వస్తి పలికి... అధికారంలోకి వచ్చింది ఆప్. ఇది కూడా ఆ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. పంజాబ్‌లోనూ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ వరుస ఎన్నికల తరవాత నిర్వహించుకుంటున్న కీలక సమావేశమిది. అందుకే...పార్టీ నేతలందరూ చాలా ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్‌తో సహా కీలక నేతలందరూ ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రాష్ట్రాల రాజకీయ వాతావరణం ఎలా ఉందన్న అంశంపైనా చర్చించనున్నారు. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు
జరగనున్న రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది ఆప్. పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సందీప్ పఠక్‌ను ఇటీవలే నేషనల్ సెక్రటరీగా నియమించారు కేజ్రీవాల్. ఆయన నేతృత్వంలోనే కీలక సమావేశాలన్నీ జరగనున్నాయి.
Also Read: Mamata Banerjee: అమిత్‌షా సమక్షంలో భద్రతా బలగాలతో మమతా వాగ్వాదం, అధికారాల విషయంలో అభ్యంతరాలు