Swati Maliwal Assaulted at Kejriwal's House: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి జరిగిందని ఆప్ నేత స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ అసిస్టెంట్ దాడి చేశాడని ఆరోపించినట్టు పోలీసులు వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి తమకు వరుస పెట్టి ఫోన్ కాల్స్ వచ్చాయని  చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి కాల్స్ వచ్చినట్టు వివరించారు. ఉదయం 9.30 గంటలకు కాల్ చేసిన స్వాతి మలివాల్..కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న  స్వాతి మలివాల్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ప్రోటోకాల్ లేకుండా ముఖ్యమంత్రి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించేందుకు అధికారం ఉండదు. ఈ ఘటనపై డీసీపీ మనోజ్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. 


"ఉదయం 9.34 నిముషాలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో నుంచి మాకు వరుస పెట్టి ఫోన్ కాల్స్ వచ్చాయి. స్వాతి మలివాల్ మాకు ఫోన్ చేశారు. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన సహాయకుడు తనపై దాడి చేశాడని ఆరోపించారు. కంప్లెయింట్ ఇస్తానని చెప్పారు"


- మనోజ్ మీనా, డీసీపీ నార్త్ ఢిల్లీ






అంతకు ముందు 9.31 గంటలకు స్వాతి మలివాల్ పోలీస్ కంట్రోల్ రూమ్‌ని సంప్రదించారు. 9.10 నిముషాలకు ఆమె కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినట్టు అక్కడి సిబ్బంది వెల్లడించింది. కేజ్రీవాల్‌ని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన సహాయక సిబ్బంది ఆమెని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీస్ సిబ్బంది కేజ్రీవాల్ ఇంటికి వచ్చి స్వాతి మలివాల్‌తో మాట్లాడారు. చాలా సేపటికి ఆమె పోలీసులతో వెళ్లేందుకు అంగీకరించారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన కాసేపటికే స్వాతి మలివాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె లిఖితపూర్వకంగా అయితే ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆమె ఏ రోజూ మాట్లాడలేదని, అసలు ఆ సమయంలో ఆమె ఢిల్లీలోనే లేరని చెప్పారు. చాలా రోజుల తరవాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె కనిపించడంపై అనుమానం వ్యక్తం చేశారు. 









Also Read: Rahul Gandhi Marriage: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ ర్యాలీలో హింట్