Rahul Gandhi Marriage: రాయ్‌బరేలి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్‌బరేలీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఓ చిన్నారి "మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు" అని ప్రశ్నించారు. రాహుల్ ఈ ప్రశ్నకి నవ్వుతూ సమాధానమిచ్చారు. "బహుశా ఇదే సరైన సమయం ఏమో. త్వరలోనే చేసుకుంటాను" అని బదులిచ్చారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరించారు. కాంగ్రెస్‌కి ఓటు వేయాలని అభ్యర్థించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలని సుదీర్ఘ చర్చలు జరిపింది హైకమాండ్. దాదాపు 20 ఏళ్ల పాటు ఇక్కడ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాయ్‌బరేలీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగింది. చివరి నిముషం వరకూ ఎటూ తేల్చకుండా సస్పెన్స్‌లో ఉంచిన కాంగ్రెస్...నామినేషన్ గడువుకి కొద్ది గంటల ముందు రాహుల్ గాంధీ పేరుని ప్రకటించింది. అటు అమేథీ నుంచి కాంగ్రెస్ విధేయుడైన కేఎల్ శర్మని బరిలోకి దింపింది.
రాయ్‌బరేలీతో ప్రత్యేక అనుబంధం..
ఈ సమయంలోనే రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ. సోనియా గాంధీతో పాటు ఇందిరా గాంధీ కూడా తనకు అమ్మలాంటిదేనని చెప్పారు. రాయ్‌బరేలీ కర్మభూమి అని వెల్లడించారు. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
"రెండేళ్ల క్రితం నేను మా అమ్మతో కూర్చుని మాట్లాడాను. అప్పుడే మా నాయనమ్మ ఇందిరా గాంధీ గురించి ప్రస్తావన వచ్చింది. నాకు మా అమ్మతో పాటు నాయనమ్మ ఇందిరా గాంధీ కూడా అమ్మలాంటిదే. రాయ్‌బరేలీ కర్మభూమి. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
అమేథీ ఒకప్పటి కంచుకోట..
అమేథీ నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌కి కంచుకోటే. 2004-19 వరకూ రాహుల్ గాంధీ ఇక్కడే ఎంపీగా గెలిచారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. 1999 లో సోనియా గాంధీ కూడా అమేథీ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తరవాత రాహుల్ గాంధీని బరిలోకి దింపారు. రాయ్‌బరేలీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మూడు సార్లు విజయం సాధించారు. ఆమె భర్త ఫెరోజ్ గాంధీ 1952లో ఓ సారి, 1957లో రెండోసారి ఎంపీగా గెలిచారు.
Also Read: Food Labelling: కంటికి కనిపించేదంతా నిజం కాదు, ఫుడ్ లేబుల్స్‌పై ICMR హెచ్చరిక