తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో ఈ స్టార్ హీరో వ్యవహరించిన తీరు సామాజిక మాధ్యమాల్లో పలు విమర్శలకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


వైసీపీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఏమిటి?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. వైసీపీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా తమ తమ పార్టీ కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చాయి. శక్తులు అన్నిటినీ ఏకం చేశాయి.
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూటమిలో ఉండటంతో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు అందరూ సహజంగా మద్దతు పలికారు. అల్లు అర్జున్ సైతం పవన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అయితే... ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలియజేస్తూ ఆయన ఇంటికి వెళ్లారు. 


జనసేనకు ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం ఏమిటని మెగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన బన్నీ ముందు ఉంచగా... ఆయన స్పందించారు.



''అఫీషియల్‌గా నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. అన్ని పార్టీల విషయంలోనూ నేను తటస్థంగా ఉంటాను. 'నా' అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా... పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను మద్దతు ఇస్తాను. పవన్ కల్యాణ్ గారిని నా లవ్, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయి. లేదంటే నా ఫ్రెండ్, నంద్యాలలో పోటీ చేస్తున్న రవి గారు అవ్వొచ్చు, లేదంటే మా మావయ్య చంద్రశేఖర్ గారు అవ్వొచ్చు, లేదంటే రేపు మా 'బన్నీ' వాసు కావచ్చు... పార్టీలతో సంబంధం లేకుండా సపోర్ట్ ఇస్తాను'' అని బన్నీ చెప్పారు. 



నంద్యాల ఎందుకు వెళ్ళానంటే?
నంద్యాల ఎందుకు వెళ్లిందీ అల్లు అర్జున్ వివరించారు. ''శిల్పా రవి గారు నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం. ఎప్పటి నుంచో ఆయనతో నేను ఒక్క మాట చెబుతూ ఉండేవాడిని. 'బ్రదర్! మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా మీ ఊరు వచ్చి నేను సపోర్ట్ చేస్తా' అని మాట ఇచ్చాను. 2019లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు నంద్యాల వెళ్లలేకపోయా. మాటిచ్చాను కాబట్టి నేనే ఆయన ఫోన్ చేసి వస్తానని చెప్పా. నేను, నా భార్య స్నేహారెడ్డి వెళ్లి కలిసి వచ్చాం'' అని అల్లు అర్జున్ తెలిపారు


Also Read: చిరు, మోహన్ బాబు, జక్కన్న to ఎన్టీఆర్, బన్నీ... బాధ్యతగా ఓటేసిన ప్రముఖులను ఫోటోల్లో చూడండి!



భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? అని ప్రశ్నిస్తే... ''లేదు'' అని అల్లు అర్జున్ నవ్వేశారు. ఆయన నంద్యాల వెళ్లిన రోజే, బన్నీ తండ్రి & మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు. మేనల్లుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ & చెల్లెలు సురేఖతో కలిసి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలిశారు.


Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం