India's Policy and Decisions: 


విధానపరంగా ఎన్నో సంస్కరణలు..


స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో విధానపరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సంస్కరణలు దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేశాయి. ఎంతో మేధోమథనం తరవాత తీసుకున్న నిర్ణయాలు అందుకు తగ్గట్టుగానే ఫలితాలు అందించాయి. భారత్‌ను ప్రత్యేకంగా నిలిపిన ఆ కీలక విధానాలేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం. 


1.ఆధార్: 


ప్రపంచంలోని అతి పెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్‌ "ఆధార్". వరల్డ్‌ బ్యాంక్‌లోని చీఫ్ ఎకనామిస్ట్ పాల్ రోమర్ ఆధార్‌ను "ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్ ID ప్రోగ్రామ్‌" అని అభివర్ణించారు. ఆధార్‌ను భారత్‌లో "ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్"గా పరిగణిస్తున్నారు. ఆధార్‌లో 12 అంకెల యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఉంటుంది. 2009 నుంచే ప్లానింగ్ కమిషన్‌కు అనుబంధగా పని చేస్తోంది..యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI.2016 మార్చ్ 3వ తేదీన ఆధార్ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. మార్చ్‌ 11న లోక్‌సభ ఈ చట్టాన్ని ఆమోదించింది. సంక్షేమ పథకాలను కచ్చితత్వంతో లబ్ధిదారులకు చేరవేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఒకే వ్యక్తి ఎన్నో ప్రదేశాల్లో రేషన్ తీసుకోవడం, అవసరమైన వారికి సరైన విధంగా సరుకులు అందకపోవలటం లాంటి సమస్యలు తీర్చింది ఆధార్. మొబైల్ నంబర్లకు, బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించటం ద్వారా అక్రమాలకు తావు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఆధార్‌ను ప్రవేశపెట్టారు. 


2. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం:


"పని చేసే హక్కు" కల్పించటమే ఈ ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్ MGNREGAని 2005లో తీసుకొచ్చారు. 2009లో ఈ పేరుని నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్‌గా మార్చారు. సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2005లో మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని ఆమోదించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది మొదలైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో ఓ వ్యక్తికి కనీసం 100 రోజుల పాటు వేతనంతో కూడిన పని లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడింది. 


3. కనీస వేతన చట్టం: 
 
1948లోనే భారత్‌లో కనీస వేతన చట్టం (Minimum Wages Act)ను తీసుకొచ్చారు. నైపుణ్యం ఉన్న వారితో పాటు, లేని వారికీ ఈ చట్టం వర్తించేలా రూపొందించారు. "బతకటానికి అవసరమైన కనీస వేతనం" అవసరం అని భారత రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆత్మగౌరవంతో బతకాలన్నా, చదువులు సహా ఇతరత్రా అనుకోని ఖర్చులను భరించాలన్నా, కనీస వేతనాలు అవసరమే. ఎంప్లాయ్‌మెంట్ లెవెల్స్‌ను పెంచుకునేందుకు, పరిశ్రమల పే స్కేల్‌ను పెంచేందుకు కనీస వేతనాలు ఇవ్వటం అత్యంత అవసరమనీ అంటోంది కనీస వేతన చట్టం. అయితే ఇందులోని కొన్ని లొసుగులను ఉపయోగించుకుని కొన్ని సంస్థలు ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. 


4.కన్‌జ్యూమర్ కోర్టులు 


వినియోగదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కన్‌జ్యూమర్ కోర్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగ దారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించటం, వాటిని పరిష్కరించటం ఈ కోర్టుల పని. సరైన ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భాల్లో వినియోగదారులకు న్యాయం చేస్తాయి..ఈ న్యాయస్థానాలు. ఆధారాలు సమర్పించటంలో ఫెయిల్ అయితే మాత్రం...న్యాయం అంత సులువుగా జరగదు. వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యతనిస్తూ తీర్పుని వెలువరిస్తాయి ఈ కోర్టులు. సుదీర్ఘకాలం పాటు కేసులను సాగదీయకుండా...త్వరితగతిన సమస్యలకు చెక్ పెట్టాలనే లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నాయి. 


5. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 


2002లో ఎన్‌డీయే ప్రభుత్వం ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌ను PMLA ప్రవేశపెట్టింది. 2005 జులై1వ తేదీన PMLA నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా తమ క్లైంట్‌ల వివరాలను రికార్డ్‌ చేసి ఉంచాలి. ఫినాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్-ఇండియా (FIU-IND)కు ఈ వివరాలు తప్పనిసరిగా ఓ ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టంలో 2005, 2009, 2012లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అయితే ఈ చట్టంలో..నేరం రుజువై అరెస్ట్ అయిన వాళ్లకు మూడేళ్ల వరకూ బెయిల్ లభించదనే నిబంధనను చేర్చారు. ఈ నిబంధన అమలు చేయటం అన్ని సందర్భాల్లో అసాధ్యం అవుతోంది.


Also Read: Varghese Kurian: పాల ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చి, దేశం గర్వించేలా చేసిన మహనీయుడు వర్గీస్ కురియన్


Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు