తదుపరి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎవరు... ఇదే ఇప్పుడు తెలంగాణ పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్న అంశం. ప్రస్తుతం ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో కొత్త డీజీపీ రాబోతున్నారు. అయితే ఆ స్థానంలో ఎవరు వస్తారు, ప్రస్తుతం రేసులో ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసు వర్గాలు అంచనాలు వేస్కుంటున్నాయి. ప్రస్తుతం అనుభవం ప్రకారం చూసుకుంటే రాష్ట్ర పోలీసు శాఖలో ఐపీఎస్ 1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్‌ షరాఫ్, 1990 బ్యాచ్ కు చెందిన గోవింద్ సింగ్, అంజనీ కుమార్, డైరెక్టర్ జనరల్ రవి గుప్తా.. అదే ర్యాంకు ప్రకారం చూస్కుంటే 1991వ బ్యాచ్  కు చెందిన రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ఇద్దరూ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. 


మరో డీజీపీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించే అవకాశం..


ఇందులో సీనియర్ అయిన ఉమేష్ షరాఫ్ 2023 జూన్‌లో రిటైర్ కాబోతుండగా.. ఆయనకు డీజీపీ పోస్టు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్ ఈ ఏడాది నవంబర్‌లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలోకి రాజీవ్ రతన్ పదోన్నతి పొందుతారు. ఇదే బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్, రవి గుప్తా ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. ఒకే బ్యాచ్ కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఎక్స్ కేడర్ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్ కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి వెళ్లనున్న లిస్టు..


ఈ లెక్కన అంజనీ కుమార్, రవిగుప్తాలతో పాటు రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ కూడా డీజీపీ రేసులో ఉండే అవకాశం ఉంటుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరును, డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్ కు చెందిన అదనపు డీజీపీ జితేందర్ పేరు నియామక ప్యానల్ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర జీఏడీ విభాగం డీజీపీ నియమాకానికి సంబంధించి ప్యానల్ లిస్టును డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి పంపనుంది ప్రభుత్వం. ఈ జాబితాలో ఉమేష్ షరాఫ్, రవిగుప్తా, అంజనీ కుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్‌లో ఉమేష్ షరాఫ్ రిటైర్ కాబోతున్నప్పటికీ ఆయన పేరును పరిగణలోకి తీసుకోకున్నారు. డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 


ఎవరరి కుర్చీ దక్కేనో..


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ, రెండో డీజీపీగా మహేందర్ రెడ్డి పదవులు చేపట్టారు. ఈ ఇద్దరు కూడా హైదరాబాద్ కమిషనర్ గా పని చేసి డీజీపీగా నియమితులైనవారే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చాలా మంది డీజీపీలు హైదరాబాద్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్లే. ప్రస్తుతం ఆ రేసులో ఉన్న అంజనీ కుమార్ కూడా హైదరాబాద్ సీపీగా చేసిన వారే. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కొనసాగుతున్నారు.