కెసిఆర్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ మూడోసారి ముఖ్యమంత్రిని కాకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అదే టైంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అనేది కూడా ఉండకూడదన్నది టార్గెట్‌. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగానే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోంది కమల దళం. ఆయా పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ఏ చిన్న లీడర్‌ను కూడా వదలకుండా పార్టీ కండువా కప్పేస్తుంది. ఆ స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్‌ని తీవ్రం చేస్తోంది కాషాయ పార్టీ. 


చేరికలకు 21న ముహూర్తం


ఆపరేషన్‌ ఆకర్ష్‌లో ఇప్పటికే పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కమలంగూటికి చేరారు. మరికొందరు బీజేపీలో అధికారికంగా చేరడానికి ఈనెల 21న ముహూర్తం పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వీడిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా త్వరలోనే బీజేపీ చెంతకు చేరనున్నారని తెలుస్తోంది. పార్టీకి దూరంగా ఉన్న నేతలు సైతం కాషాయం కప్పుబోతున్నారట. 


ఎర్రబెల్లి సోదరుడు ఒక్కరే


టీఆర్‌ఎస్‌ నుంచి కీలకనేతలు ఇప్పట్లో రాకపోయినా కొందరు చిన్నస్థాయినేతలు కాషాయం కప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని టాక్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీ లీడర్లు మాత్రం పెద్ద పెద్ద లీడర్లే తమవైపు వస్తున్నారని తెగ ప్రచారం చేస్తుంది కానీ ఆ స్థాయి లీడర్లలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మొన్నటికి మొన్న మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌ రెడ్డి ఒక్కరే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నమాట. 


21, 26న పార్టీలో చేరాలని సందేశాలు


ఇలా పార్టీకి రాజీనామా చేసిన నేతలందరూ బీజేపీ అగ్రనేత అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుబోతున్నారట. ఈనెల 21న మునుగోడు, 26న వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభల్లో చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది. అందుకే పార్టీలో చేరాలనుకునేవారంతా ముందస్తుగానే రాష్ట్రనేతలను సంప్రదించి ఆ రోజుల్లో కమలం గూటికి రావచ్చని ఆహ్వాన సందేశాలు పంపుతున్నారట.


ఆగస్టు 21, 26 తేదీలను బీజేపీ చరిత్రలో నిలిచిపోయే రోజులుగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర నేతలు దృఢనిశ్చయంతో ఉన్నారట. అందుకే ప్రజాగోసలో ప్రజాప్రతినిధుల గోస కూడ వింటూ వారికి వెల్‌కమ్‌ చెబుతోందట. ఇలా వలస నేతలతో పార్టీని బలోపేతం చేయాలన్న రాష్ట్రనేతల గురి ఏ మేరకు నెరవేరుతుందో చూడాలని అటు అధికార, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి.


ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు టిక్కెట్ కన్ఫాం 


బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఏరి అని మొన్నటివరకు ఎగతాళి చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఖాలీ చేసే పనిలో పడింది బీజేపీ. రోజురోజుకు అసెంబ్లీ సీట్లు ఫిల్ చేసుకుంటూ వెళ్తోందా పార్టీ. రేపు 26న వరంగల్ బహిరంగసభలో జాయిన్ అవుతున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు వరంగల్ అసెంబ్లీ టిక్కెట్ కన్ఫాం అని తెలుస్తోంది. 


కాంగ్రెస్ సరే... టీఆర్ఎస్ సంగతేంది? 


ఆపరేషన్‌ ఆకర్ష్‌లో కాంగ్రెస్‌ నేతలు పడిపోతున్నారు కానీ ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ నేతలెవరూ కమలం వైపు చూస్తు దాఖలాలు లేవు. అధికార పార్టీకి చెందిన నేతలు ఆకర్షితులు కాకపోవడంతో బీజేపీ నేతలు మరికాస్తంత సీరియస్‌గా దృష్టిపెట్టారట. మునుగోడు ఉపఎన్నికలో గెలిచి దమ్ము చూపిస్తే కానీ కారులో కంగారు మొదలుకాదని భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్‌లోని కీలకనేతలను ముందుగా ఆకర్షించి దానికి సినీగ్లామర్‌ని జోడించి ఉపఎన్నికలో గెలవాలని ప్లాన్‌ చేస్తోందట ఆ పార్టీ. 


మునుగోడుని తిరిగి గెలుచుకోవడమే కాదు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ హస్తానిదే అని కాంగ్రెస్ ఆపార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అందుకే ఈ బైపోల్‌ని సెమీఫైనల్‌గా భావిస్తున్నామని సవాల్‌ కూడా విసిరారు. ఇంకోవైపు టీఆర్‌ ఎస్‌ సైలెంట్‌గా వ్యూహాన్ని అమలు చేసి కాంగ్రెస్‌ బీజేపీ రెండింటికి చెక్‌ పెట్టాలన్న ఆలోచలో ఉంది. మరి ఎవరి వ్యూహం నెగ్గుతుంది. ఎవరి ఆకర్షణ ఫలిస్తుంది అన్నది తెలియడానికి కాస్తంత టైమ్‌ పడుతుంది.