HMPV Cases In India : ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇప్పుడు దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ ఈ వైరస్ కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కోల్ కత్తాలో 6నెలల చిన్నారికి ఈ వైరస్ సోకింది. దీంతో భారత్ లో ఇప్పటివరకూ ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. ఈ 6 కేసులు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ నుంచి నమోదయ్యాయి. అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
అంతకుముందు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కర్ణాటకలో ఇద్దరు పిల్లలకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ పాజిటివ్ నిర్థారణ అయిందని వెల్లడించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాలుడు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ప్రజలు భయాందోళన చెందవద్దని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ కోరారు. వైరల్ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసిందని చెప్పారు. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ (HMPV) ఇప్పటికే చెలామణిలో ఉందని, దానితో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధుల కేసులు వివిధ దేశాల్లో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
Also Read : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఇక తాజాగా కోల్ కత్తాలో 6 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. చిన్నారి నవంబర్ 2024లో తన తల్లిదండ్రులతో కలిసి ముంబై నుండి కోల్‌కతాకు వచ్చాడు. కోల్‌కతా చేరుకున్న తర్వాత, పిల్లాడు అనారోగ్యం పాలయ్యాడు. విమానం దిగిన వెంటనే అతని పరిస్థితి క్షీణించింది. చిన్నారికి జ్వరం వచ్చిందని, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ఇతర లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారికి మూడు వారాల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్టు సమాచారం.
డోంట్ పానిక్.. బీ అవేర్
బెంగళూరులో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదవడంతో కర్ణాటకలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 'డోంట్ పానిక్, బీ అవేర్' పేరుతో ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఇన్‌ఫ్లుఎంజా లాంటి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ (SARI) కేసులను తమకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని ఆసుపత్రులకు సూచించింది.
ట్రెండింగ్ లో లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్
చైనాలో పుట్టి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. సరిగ్గా 5ఏళ్ల తర్వాత మళ్లీ చైనాలోనే కొత్త వైరస్ వెలుగులోకి రావడం భయాందోళనలకు గురి చేస్తోంది.ఇక భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న వేళ.. సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ లతో చాలా మంది పోస్టులు పెడుతుండగా ఇప్పుడు ఈ #lockdown ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం