Severe Earthquake In Japan: జపాన్‌లోని (Japan) ఇషికావా ప్రిఫెక్చర్‌లో నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు నోటో ద్వీపకల్ప ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. మరో 10 నిమిషాల తర్వాత నానో, అనామిజు నగరాలతో పాటు నీగాటా ప్రిఫెక్చర్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో మరోసారి భూకంఫం సంభవించింది. నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చాయని పేర్కొంది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో జనవరి 1న సంభవించిన భూకంపంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని స్పష్టం చేశారు. అటు, భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని రెండు అణువిద్యుత్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితి లేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్‌కు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. కాగా, భద్రతా తనిఖీల నిమిత్తం షింకన్ సెన్ సూపర్ - ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.
Also Read: Rafah News: పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం