AP Elections 2024: కేవలం కొన్ని గంటలే... ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోనుంది. మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ రహస్యాన్ని బహిర్గతం కానుంది. ఏ గట్టున ఎవరో మంగళవారం తెలిసిపోనుంది. ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు... అధికారాన్ని స్థాపించేది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల క్రతువు ఒక ఎత్తు అయితే మంగళవారం జరిగే ప్రక్రియ మరో ఎత్తు. ఇది చాలా కీలకం అందుకే ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కనురెప్ప వేయకుండా పహారా కాస్తోంది. ఇప్పటికే పోలంగ్ తర్వాత రోజు ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి. దీంతో మరింత అప్రమత్తమైంది. అసలు అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
నిఘా నీడలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అడుగడుగడునా బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. ఖాకీలు దర్శనమిస్తున్నాయి. పది మంది కలిసి తిరుగుతున్నా ప్రశ్నిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మరింత సెక్యూరిటీ కల్పించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను పెట్టారు. అధికారిక అనుమతి లేని వ్యక్తులను ఆ పరిసరాల్లోకి రానివ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం 144 సెక్షన్ విధించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా సలహా ఇస్తున్నారు. పార్టీలను కూడా రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అనవసరమైన రచ్చ చేస్తే బాగోదని చెబుతున్నారు. పార్టీలు, పార్టీల నాయకులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడటం ఒక్క టాస్క్ అయితే... కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో పరిస్థితి చేయిదాటిపోకుండా చూడటం కూడా పోలీసులకు, అధికారులకు బిగ్ టాస్క్, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌పై వివాదం నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకొని కచ్చితంగా నిలదీస్తామంటూ అధికారి పార్టీ ప్రకటించేసింది. చిన్న మిస్టేక్ జరిగినా వదిలేయొద్దని తమ పార్టీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది.
ఈసారి కౌంటింగ్ కేంద్రంలో భారీగా ఏజెంట్లు ఉండబోతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లతోపాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉంటారు. ఒక్కో అభ్యర్థి తరఫున ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటు ఉంటారు. ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో భారీగా ఏజెంట్లు గుర్తింపు పొందిన పార్టీ నుంచి హాజరవుతారు. అదే టైంలో స్వతంత్ర అభ్యర్థి తరఫున కూడా ఏజెంట్లు లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారు.
ఇలా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్ల సంఖ్య భారీగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి భారీగా ఏజెంట్ పాస్‌లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే మూడు వేలకుపైగా పాస్‌లు జారీ చేశారని తెలుస్తోంది. కౌంటింగ్ ఏజెంట్లతోపాటు అక్కడ విధులు కోసం వచ్చిన ఉద్యోగుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అందుకే ప్రతి కౌంటింగ్ కేంద్రం కూడా జాతరను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎక్కువ మంది కౌంటింగ్ కేంద్రాల్లో ఉండటం వల్ల గొడవలకు ఆస్కారం ఉందని అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి తోడు కొందరు స్వతంత్రుల తరఫున అధికార, ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు ఏజెంట్లుగా వెళ్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఇది కూడా వివాదానికి కారణమయ్యే ఛాన్స్ ఉందని.... అక్కడ ఏదైనా ఘర్షణపూరిత వాతావరణం జరిగితే వాళ్లంతా ఆయా పార్టీల నేతలు సపోర్ట్ చేసి గొందరగోళం సృష్టించేందుకు ఆస్కారం ఉంది. ఇలాంటివి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
కౌటింగ్ కేంద్రం బయటే కాదు... లోపల కూడా ఎలాంటి గొడవలు జరక్కుండా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించింది. చాలా కౌటింగ్ కేంద్రాల్లో రాష్ట్ర పోలీసులను ఉంచడం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసులపై అధికార ప్రతిపక్షాలు ఫిర్యాదుల చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యాత్మంగా ఉన్న ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.
కౌంటింగ్ కేంద్రం లోపలే కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో మూడు అంచెల భద్రత మరికొన్ని ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు భద్రతాబలగాలు మోహరించారు. బయట వాహనాలను అనుమతివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. హైవేలు ఉంటే తప్ప నార్మల్ రోడ్లు ఉంటే మాత్రం వాహనాలను వేరే మార్గాల్లో పంపిస్తున్నారు.
అనుమతి లేని వ్యక్తులు, రౌడీ మూకలు ఆ ప్రాంతాలకు వస్తే గుర్తించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నేషన్ కెమెరాలు అన్ని కేంద్రాల్లో అమర్చారు. ప్రతి బ్లాక్‌కు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి వివాదం తలెత్తిన వెంటనే బలగాలు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి.
ఆ గ్రామాలపై నిఘా
ప్రతి నియోజకవ్గంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను అప్రమత్తం చేశారు. జనాలు గుంపుగుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకున్నారు. ర్యాలీలు, ఊరేగింపులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. బాణసంచా కాల్పులపై కూడా ఆంక్షలు పెట్టారు. ప్రజలు, రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.