Liquor Shops Closed On Counting Day: ఏపీలో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఎన్నికల కౌంటింగ్‌ (AP Election Counting)కు మరికొద్ది గంటల సమయం ఉండడంతో ఎవరు గెలుస్తారోననే ఆసక్తి అధికార, ప్రతిపక్షాలు, నేతలు, కార్యకర్తలు, ప్రజల్లో ఏర్పడింది. మంగవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా భారీ స్థాయిలో అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జూన్ 4ను ఈసీ డ్రై డే (Dry Day)గా ప్రకటించింది. కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని 4వ తేదీ మంగళవారం మద్యం దుకాణాలు (Liquor Shops) మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ (AP Excise Department)ను ఎన్నికల సంఘం ఆదేశించింది. 


మూడు రోజుల పాటు మద్యం బంద్
అయితే స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతల రీత్యా 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు అధికారులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చారు. ఇటీవల జరిగిన కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలనలోను రాష్ట్ర డీజీపీ ఇదే విషయాన్ని వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం అమ్మకాలు నిషేధించినట్లు చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ, జిల్లా ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు.


అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. భారీగా స్థాయిలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రోఅబ్జర్వర్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నారు. బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నారు.