Lightning Strikes: యూపీలో భారీ వర్షాలు సతమతం చేస్తున్నాయి. ఇప్పటికే వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే చేపట్టి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే..ఇప్పటికే వర్షాలతో ప్రాణనష్టం నమోదవుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఒక్క రోజులోనే పిడుగులు పడిన కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతాప్‌గఢ్‌లోనే 11 మంది మృతి చెందారు. ఆ తరవాత సుల్తాన్‌పుర్, మణిపురి, ప్రయాగ్‌రాజ్ సహా మరి కొన్ని ప్రాంతాల్లో మరణాలు నమోదయ్యాయి. ప్రతాప్‌గఢ్‌లో మొత్తం 5 చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో చనిపోయిన 11 మంది మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. చండౌలి ప్రాంతంలో పిడుగుపాటు కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వాళ్లని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగులు పడ్డాయి.
బాధితుల్లో ఎక్కువ మంది 13-15 ఏళ్ల వాళ్లే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పొలంలో పని చేస్తుండగా కొందరు, చేపలు పడుతూ మరి కొందరు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. సుల్తాన్‌పుర్‌లో చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు చిన్నారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మామిడి కాయలు కోస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. వర్షం పడుతోందని చెట్టు కిందకు వెళ్లగా ఓ మహిళపై పిడుగు పడి చనిపోయింది. ఓ 14 ఏళ్ల బాలుడు వర్షంలో తడుస్తున్నానని పరిగెత్తి ఓ చెట్టు కింద నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో పిడుగు పడి చనిపోయాడు. మరో చోట ఐదేళ్ల బాలిక ఇలాగే చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొలంలో పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇలా పలు చోట్ల ఈ విషాదాలు చోటు చేసుకున్నాయి. మరో 5 రోజుల పాటు యూపీలో ఇవే పరిస్థితులు ఉంటాయని IMD అంచనా వేసింది. భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు యోగి సర్కార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. వరదల్ని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నదులన్నీ ఉప్పొంగుతుండడం వల్ల ఈ స్థాయిలో వరదలు వచ్చాయని చెప్పారు. 12 జిల్లాల్లో దాదాపు 17 లక్షల మంది వరదలకు బాధితులయ్యారని వివరించారు. NDRF, SDRFతో సహా మరి కొన్ని టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
Also Read: Viral News: టేకాఫ్ అవుతుండగా పేలిన ఫ్లైట్ టైర్, ఒక్కసారిగా మంటలు - వీడియో వైరల్