Telangana Crime News: ఈ మధ్యకాలంలో మోసం చేసి వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఖిలాడి లేడీలు ఈ తరహా వివాహాలను చేసుకుంటున్న వ్యవహారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలను మోసం చేస్తున్న అబ్బాయిల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నామని చెప్పి భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకుని మోసం చేస్తున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇటువంటి కేసు మరొకటి వెలుగు చూసింది. తానో ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ యువతిని బురిడీ కొట్టించి వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు.. ఆమె వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయడంతోపాటు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ (38) కర్ణాటక ఐఏఎస్ కేడర్ లో ఎంపికైనట్లు 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. తానో ఐఏఎస్ ఆఫీసర్ ను అంటూ ఓ మాట్రిమోనీలో వివరాలు కూడా నమోదు చేశాడు. ఈ వివరాలను చూసిన బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. తమ కుమార్తె గురించి చెప్పడంతో పాటు వివాహాన్ని కుదుర్చుకున్నారు. వివాహ సమయంలో రూ.50 లక్షల రూపాయల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో ఘనంగా వివాహం జరిపించారు. ఆ తర్వాత కాలంలో అతని వ్యవహారం మెల్లగా బయటపడుతూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పిన ఆయన విధులకు వెళ్ళకపోవడంతోపాటు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ శ్రావణ్ కి అనుమానాన్ని కలిగించాడు.
రేడియాలజిస్ట్ గా పని చేయడం ఇష్టం అంటూ మరో మోసం
తాను ఐఏఎస్ ఆఫీసర్ ను కాదన్న విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన సందీప్ కుమార్ మరో కట్టు కథను అల్లాడు. తనకు ఐఏఎస్ అధికారిగా పని చేయడం ఇష్టం లేదని రేడియాలజిస్ట్ గా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్ వ్యాలీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. విధులకు మాత్రమే వెళుతున్న సందీప్ కుమార్ రూపాయి కూడా ఇంటికి ఇవ్వకపోవడంతో భార్య సంపాదనపై ప్రశ్నించింది. సంపాదనంతా ఏదని నిలదీసింది. దీనికి మరో కట్టు కథను అల్లిన సందీప్ కుమార్ వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు ఆర్జించానని, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని చెప్పాడు. అవి రావాలంటే రెండు కోట్ల చెల్లించాలి అని చెప్పడంతో భార్య మిత్రుల ద్వారా రెండు కోట్ల రూపాయలను సమకూర్చింది.
కుటుంబ సభ్యులకు మళ్లించిన సందీప్ కుమార్..
భర్త సంపాదించిన 40 కోట్ల రూపాయలు మొత్తం వస్తుందన్న ఉద్దేశంతో తెలిసిన వారి దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు మొత్తాన్ని సమకూర్చి భర్తకు అందించింది. అయితే, సందీప్ కుమార్ భారీ సమకూర్చిన రెండు కోట్ల రూపాయలను తన తండ్రి విజయకుమార్ (70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతికూరి లక్ష్మీ సాహితి (35) ఖాతాలకు బదిలీ చేశాడు. వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను సందీప్ కుమార్ తల్లి మాలతి (59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా భర్త తన సంపాదించిన డబ్బులు తీసుకురాకపోవడంతోపాటు రకరకాల కథలు చెబుతుండడంతో భార్యకు అనుమానం వచ్చింది. అతడు గురించి వాకబు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతోపాటు రేడియాలజిస్ట్ సర్టిఫికెట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగిన తర్వాత కూడా సందీప్ కుమార్ అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని బుధవారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. మరో నిందితురాలు లక్ష్మీ సాహితీ పరారీలో ఉన్నట్లు సిఐ జే ఉపేందర్ వెల్లడించారు.