Flight Tyre Burst: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఫ్లైట్‌ టేకాఫ్‌ అవుతుండగా అనూహ్య ఘటన జరిగింది. ఉన్నట్టుండి విమానం టైర్‌ పేలిపోయింది. మంటలు వచ్చాయి. ఫీనిక్స్‌కి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదంతో రన్‌వే పైనే ఫ్లైట్ నిలిచిపోయింది. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఫ్లైట్‌ టేకాఫ్‌కి సిద్ధమవుతుండగా కుడివైపున ఉన్న టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ తరవాత మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుంది. రన్‌వేపై కొంత దూరం వరకూ వెళ్లిన ఫ్లైట్‌ అక్కడే ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ వెహికిల్స్‌ని ఘటనా స్థలానికి పంపించారు.





ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్‌లో 174 మంది ప్రయాణికులున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. వెంటనే విమానాన్ని టర్మినల్‌కి పంపించారు. ప్రయాణికులందరినీ మరో ఫ్లైట్‌లోకి తరలించారు. రన్‌వేపై నుంచి విమానాన్ని తొలగించడం వల్ల మిగతా విమానాల సర్వీస్‌లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మెకానికల్ ఇష్యూ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ల్యాండ్ అయ్యే టైమ్‌కి ఈ ప్రమాదం జరిగి ఉంటే నష్టం భారీగా ఉండేదని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.