26 Year Old EY Pune Employee Dies Due to Work Stress : కార్పొరేట్ కంపెనీల్లో ఉండే వర్క్ ప్రెజర్‌కు యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఓ ఘటన పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ఆఫీసులో చోటు చేసుకుంది. ఈ ఇరవై ఆరేళ్ల యువ చార్టెడ్ అకౌంటెంట్ యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. కనీసం పర్సనల్ బ్రేక్స్ కూడా లేకుండా అదే పనిగా ఒత్తిడితో కూడిన పని చేయించడంతో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ పోయింది. చివరికి ఆమె చనిపోయింది. ఈ ఘటనపై ఆ యువతి తల్లి .. కార్పొరేట్ ఆఫీసు బాసులకు భావోద్వేగమైన లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేఖను ఉద్దవ్ ధాకరే శివసేన పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చదుర్వేది బయట పెట్టారు.
కార్పొరేట్ బాసులు యువ ఉద్యోగుల విషయంలో మానవత్వంతో ఉండాలని.. వారు బాగుండేలా మరింత దృష్టి పెట్టాలని చనిపోయిన ఉద్యోగిని తల్లి ఆ లేఖలో కోరారు. తన కుమార్తె గత నవంబర్‌లోనే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసి.. మార్చి 19వ తేదీన యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో చేరారన్నారు. పూణె ఆఫీసులో పని చేస్తూ జూలై ఇరవయ్యో తేదీన చనిపోయారు. ఈ మధ్య కాలంలో ఆమె ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నారని.. వర్క్ ప్లేస్‌లో పర్సనల్ టైమ్ కు కూడా బ్రేక్స్ ఇవ్వలేదన్నారు. ఇలాంటి వర్క్ ప్రెషర్ కారణంగా ఆ టీమ్ లో అనేక మంది సభ్యులు అప్పటికే మానేసారని తెలిసిందన్నారు. ఇంతటి విషపూరితమైన వర్క్ ఎట్మాస్పియర్ లో పని చేయడం మానసిక ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తుందన్నరు.
ఈ లేఖను విడుదల చేసిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కార్పొరేట్ కంపెనీలు తమ హెచ్ పాలసీలను మార్చుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు . తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసర ంకంపెనలపై ఉందన్నారు. ముఖ్యంగా కొత్తగా చేరే ఉద్యోగుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. యువ ఉద్యోగులకు సహకారం అందేలా ఆఫీసు వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఒత్తిడిని తగ్గించేలా చూడాలన్నారు. పని ఒత్తిడితో చనిపోయిన ఆ యువతి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇతర ఉద్యోగులు ఎవరూ హాజరు కాకపోవడం ఈ విషాద ఘటనలో మరో కోణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కల్చర్ లో ఉద్యోగుల సంక్షేమం చూసుకునేందుకు ఎక్కువ ఫోకస్ చేయాలని కోరారు.
దేశంలో అనేక కార్పొరేట్ కంపెనీల్లో ప్రొఫెషనల్స్ ఉద్యోగాల్లో చేరుతూంటారు. అయితే ప్రారంభంలో వారికి సరైన ప్రోత్సాహం, గైడెన్స్ లేకపోవడం వల్ల అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. మానసికంగా కూడా ఇబ్బంది పడుతూంటారు. ఇలాంటి వారికి సాయం చేసేలా కార్పొరేట్ హెచ్ ఆర్ పాలసీలు మారాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.