Gold Smuggling in Ladakh: చైనా నుంచి అక్రమంగా బంగారం తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల్ని లద్దాఖ్‌లో అరెస్ట్ చేశారు. లేహ్ జిల్లాలోని న్యోమా సెక్టార్ వద్ద ఇద్దరూ పట్టుబడ్డారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) నిందితుల్ని అరెస్ట్ చేసింది. జులై 9వ తేదీన వీళ్లిద్దరినీ పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. లాంగ్ రేంజ్ ప్యాట్రోలింగ్ చేశారు. లద్దాఖ్‌లో సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ఈ ప్యాట్రోలింగ్‌ని చేపడుతున్నారు. అలా ITBP గస్తీ కాస్తుండగా బార్డర్‌కి సరిగ్గా కిలోమీటర్ దూరంలో నిందితులను పట్టుకున్నారు. ఔషధ మొక్కల్ని తీసుకెళ్లడానికి వచ్చామని, తమకేమీ తెలియదని బుకాయించారు నిందితులు. వాళ్లుండే ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు కాసేపటికే పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించారు. 108 కిలోల గోల్డ్‌ని స్వాధీనం చేసుకున్నారు.





గోల్డ్‌తో పాటు మరి కొన్ని వస్తువులనూ గుర్తించి సీజ్ చేశారు. రెండు మొబైల్స్‌, బైనాక్యులర్, కత్తులు, టార్చ్, సుత్తి సహా మరి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ ఇద్దరినీ కొయుల్‌లోని హెడ్‌క్వార్టర్స్‌కి తరలించారు. కేంద్రహోం మంత్రిత్వ శాఖ ITBPకి పూర్తి అధికారాలు ఇచ్చింది. సరిహద్దు ప్రాంతంలో ఏ చిన్న అలికిడి అయినా వెంటనే అప్రమత్తమవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీజ్ చేసిన వస్తువుల్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తరవాత వాళ్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 


Also Read: Trainee IAS: ట్రైనింగ్‌లో ఉండగానే IAS ఆఫీసర్‌ హుకుం, VIP ట్రీట్‌మెంట్ కావాలంటూ డిమాండ్‌ - బదిలీ వేటు వేసిన అధికారులు