Trainee IAS in Pune: మహారాష్ట్రలో ఓ మహిళా IAS ట్రైనీ ఆఫీసర్‌ చేసిన రచ్చ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రైనీ అన్న సంగతి కూడా మర్చిపోయి రకరకాల డిమాండ్‌లు చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఓ ప్రైవేట్ ఆడీ కార్‌కి గవర్నమెంట్‌ స్టికర్‌లు అంటించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆమెపై బదిలీ వేటు వేసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ట్రైనీ ఆఫీసర్ పేరు డాక్టర్ పూజా ఖేడ్కర్ (Dr Pooja Khedkar). పుణేకి చెందిన ఈమెపై కొద్ది రోజులుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ గమనించిన పుణే కలెక్టర్ వెంటనే సీఎస్‌కి లేఖ రాశారు. 2023 IAS బ్యాచ్‌కి చెందిన పూజా ఖేడ్కర్‌ను అక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు వెంటనే ఆమెని ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రొబేషన్‌ పీరియడ్‌లో ఉన్నప్పుడు ట్రైనీ ఆఫీసర్‌కి ఎలాంటి అధికారాలు ఉండవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఉండదు. కానీ అదేమీ పట్టించుకోకుండా పదేపదే తన పదవిని దుర్వినియోగం చేసింది. ప్రైవేట్ ఆడీ కార్‌కి రెడ్ బ్లూ లైట్‌ని పెట్టించింది. అంతే కాదు. VIP నంబర్ ప్లేట్ కూడా తగిలించింది. "మహారాష్ట్ర ప్రభుత్వం" అనే  బోర్డ్‌నీ పెట్టుకుంది. ఓ ప్రైవేట్‌ కార్‌కి ఇవన్నీ పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవి చాలదని మరి కొన్ని గొంతెమ్మ కోరికలన్నీ కోరింది. ప్రత్యేకంగా బస కావాలని, పైగా ఓ కానిస్టేబుల్‌ని సెక్యూరిటీగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 


రూల్స్ ప్రకారం ఓ ట్రైనీ అధికారికి ఈ సౌకర్యాలన్నీ ఉండవు. గెజిటెడ్ ఆఫీసర్‌గా అపాయింట్ అయిన తరవాతే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇదంతా చెప్పినా ఆమె అర్థం చేసుకోకపోగా అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌నే ఆక్రమించేసింది. ఆయన పేరు తీసేసి తన పేరు పెట్టుకుంది. ఇంకా వివాదాస్పదమైన విషయం ఏంటంటే అడిషనల్ కలెక్టర్‌కి సంబంధించిన ఫైల్స్, సోఫాలు అన్నీ తొలగించింది. పూర్తిగా తన ఛాంబర్‌గా మార్చేసుకుంది. విజిటింగ్ కార్డ్‌లు, లెటర్‌ హెడ్‌ తెప్పించుకుంది. రిటైర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయిన ఖేడ్కర్ తండ్రి కూడా జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. తన కూతురు చెప్పినట్టుగా చేయాలని అడిగాడు. ఇక ఆమె రిక్రూట్‌మెంట్‌ జరిగిన తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఆమె OBC కేటగిరీ కింద ఆమె IAS ఆఫీసర్ అయింది. అయితే..ఆమె తండ్రి ఆస్తి విలువ రూ.40కోట్లుగా ఉందని RTI యాక్టివిస్ట్ ఆరోపించాడు. అంత ఆదాయం వచ్చే వాళ్లు నాన్ క్రీమీ లేయర్‌ కిందకు ఎలా వస్తారని ప్రశ్నించాడు. మానసికంగా, శారీరకంగా పలు సమస్యలు ఎదుర్కొన్న ఆమె ట్రీట్‌మెంట్ కూడా తీసుకుందని, అయినా మెడికల్ టెస్ట్‌లనూ తప్పించుకుందని ఆరోపించాడు. అసలు ఆమె IAS ఎలా క్వాలిఫై అయిందో కూడా అర్థం కావడం లేదని అన్నాడు. మొత్తంగా ఈమె వ్యవహారం దేశమంతా అలజడి సృష్టిస్తోంది. 


Also Read: Viral News: ప్యాంట్‌లో 100 ప్యాములు, స్మగ్లింగ్‌ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు