Snakes Smuggling in China: గోల్డ్ స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. కానీ ఈ మధ్య అరుదైన పాములనూ అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ స్మగ్లింగ్ జరుగుతోంది. ఇటీవలే ఓ నిందితుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. కస్టమ్స్ అధికారులకే షాక్ ఇచ్చాడు. హాంగ్‌కాంగ్ నుంచి చైనాలోకి ఎంటర్ అవుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకుని చెక్ చేశారు. అసలేమీ తెలియనట్టుగా నిందితుడు నటించాడు. కానీ అంతా చెక్ చేసిన అధికారులు ఆ వ్యక్తి ప్యాంట్ జేబులో క్యారీబ్యాగ్‌లను గుర్తించారు. రెండు వైపులా పాకెట్స్‌కి ఆరు క్యారీ బ్యాగ్‌లు తగిలించుకున్నాడు. మొత్తం 100 పాముల్ని ఆ బ్యాగ్‌లలో కుక్కి టేప్ వేశాడు. ఎవరికీ దొరక్కుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కానీ చివరకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ బ్యాగ్‌లు ఏంటని నిలదీస్తే ఏమీ లేదని సమాధానమిచ్చాడు నిందితుడు. అనుమానం వచ్చి వాటిని తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వాటిని తెరిచి చూడగానే పాములు గుట్టలుగుట్టలుగా కనిపించాయి. అన్నీ బతికున్నవే. రకరకాల సైజ్‌లు, కలర్లలో ఉన్నాయవి. స్థానికంగా కనిపించే పాములు కావని, వాటిని వేరే చోట నుంచి అక్రమంగా తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణిస్తున్నారు. రెడ్, పింక్, వైట్ కలర్ పాములను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా చైనాలో యానిమల్ ట్రాఫికింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కొంత వరకూ నిఘా పెట్టి అడ్డుకోగలిగినప్పటికీ అక్కడక్కడా ఇంకా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఇలా స్మగ్లింగ్‌కి పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు.