Aadhar Cards For Street Dogs: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకూ ఆధార్ కార్డ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే 100 కుక్కలకు ఈ కార్డ్‌లు జారీ చేశారు అధికారులు. కుక్కలేంటి..? ఆధార్‌ కార్డ్‌లేంటి..? అనిపిస్తుంది కదా. దీని వెనక ఓ చిన్న కథ ఉంది. ఈ మధ్య వీధి కుక్కలు రోడ్లపై వచ్చి పోయే వాళ్లపై దాడులు చేస్తున్నాయి. ఈ బాధ భరించలేక చాలా మంది వాటిపై దాడి చేస్తున్నారు. కొందరైతే వాటిని చంపేస్తున్నారు కూడా. ఈ ముప్పు నుంచి తప్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ఐడియా ఇచ్చింది. వీధి కుక్కలకూ ఆధార్‌ కార్డ్‌లు (Aadhaar Cards for Dogs) ఇచ్చి వాటిని మెడలో వేసింది. ఆ కార్డ్‌ల ద్వారా అవి ఎక్కడికి వెళ్లినా ట్రేస్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ అవి కనిపించకుండా పోయినా ఎక్కడున్నాయో కనిపెట్టొచ్చు. అక్కడి మీడియా చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 100 వీధి కుక్కలకు ఆధార్‌ కార్డ్‌లు జారీ చేసింది ఈ స్వచ్ఛంద సంస్థ. ఢిల్లీ టర్మినల్ ఎయిర్‌పోర్ట్, ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఈ కార్డ్‌లు మెడలో వేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించింది. తెల్లవారు జామున వాటిని పట్టుకుని మెడలో ఈ కార్డ్‌లు వేసినట్టు అధికారులు వెల్లడించారు. యానిమల్ యాక్టివిస్ట్ మానవి రవి ఈ Doggy Aadhaar Cards డ్రైవ్‌ని దగ్గరుండి చూసుకుంటున్నారు. వీధి కుక్కలకు ఇదో లైఫ్‌లైన్ అని చెబుతున్నారామె. ఆ ట్యాగ్స్‌పై QR Codes కూడా ఉన్నాయి.


ఈ కార్డ్‌లు ఎలా పని చేస్తాయి..?


ఈ కుక్కల మెడలో ఉండే ఆధార్ కార్డ్‌లపై క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. Pawfriend.in అనే NGO వీటిని తయారు చేయించింది. ఈ సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం..వీధి కుక్కల సంరక్షణకు ఇదో మంచి పరిష్కారం. ఇందులో మైక్రోచిప్స్ ఉంటాయి. ఈ ట్యాగ్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌పై ఎవరైనా స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది. ఎప్పుడైనా అవి ప్రమాదంలో ఉన్నప్పుడో, గాయపడ్డప్పుడో, తప్పి పోయినప్పుడో ఈ కోడ్‌ని స్కాన్ చేసి ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు. ఇక పెంపుడు కుక్కలు తప్పిపోయినా వాటినీ ట్రాక్ చేసేందుకు ఈ ఆధార్ కార్డ్‌లు పనికొస్తాయని చెబుతున్నారు అధికారులు. కొద్ది రోజులుగా ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. పెంపుడు కుక్కలు కూడా ఇదే విధంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌లలో పిట్‌బుల్ డాగ్స్‌ దాడులు చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి స్థానిక అధికారులు ఈ జాతి కుక్కలపై నిఘా పెట్టారు. ఇకపై ఎవరూ పిట్‌బుల్‌ కుక్కలు పెంచుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు మరి కొన్ని జాతి కుక్కలనూ నిషేధించారు. ఇక్కడి వాతావరణానికి అవి ఉండలేవని తేల్చి చెప్పారు. 


Also Read: Bengaluru News: రూ.కోట్ల ఆస్తిని కాదని 11 ఏళ్ల వయసులో సన్యాసం, తల్లి కూడా అదే బాటలో