Bengaluru Students Extorts Gold: బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తోటి స్టూడెంట్‌ని బ్లాక్ మెయిల్ చేసి రూ.35 లక్షల విలువైన బంగారాన్ని కాజేశారు. 700 గ్రాముల బంగారు నగల్ని చోరీ చేశారు. ఈ ఇద్దరు విద్యార్థులతో పాటు వాళ్లకి సహకరించిన మరో నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అరెస్ట్ అయిన ఇద్దరు విద్యార్థులనూ జ్యువైనల్ ఫెసిలిటీలో ఉంచారు. మిగతా నలుగురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నిందితులు ఓ సివిల్ కాంట్రాక్టర్ కొడుకుని దాదాపు ఆరు నెలలుగా బెదిరిస్తున్నారు. రెండు వారాల క్రితమే బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కి బాగా అలవాటుపడిపోయాడని,ఇదే అదనుగా చూసుకుని తోటి విద్యార్థులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పాడు.


ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ అంతా తెలుసని, పేరెంట్స్‌కి చెప్పేస్తామని బెదిరించారు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే బంగారం తీసుకొచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో తెలిస్తే గొడవ అయిపోతుందని భయపడిన ఆ విద్యార్థి బంగారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. గోల్డ్‌తో పాటు మరి కొన్ని విలువైన వస్తువుల్నీ వాళ్లకు అప్పగించాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న బంగారం కనిపించకుండా పోయిందని గుర్తించారు. ఆ తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా కూపీ లాగితే...ఈ విషయం బయటపడింది. ఈ బంగారాన్ని మరో వ్యక్తికి అమ్మాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో ఈ డ్రామాకి తెరపడింది.