సినిమా రివ్యూ: అన్‌చార్టెడ్
రేటింగ్: 3/5
నటీనటులు: టామ్ హాలండ్, మార్క్ వాల్‌బర్గ్, సోఫియా అలీ తదితరులు
సంగీతం: రమీన్ జవాదీ
నిర్మాత: సోనీ పిక్చర్స్
దర్శకత్వం: రూబెన్ ఫ్లెచర్


స్పైడర్ మ్యాన్ ఫేం టామ్ హాలండ్, మరో యాక్షన్ హీరో మార్క్ వాల్‌బర్గ్ నటించిన సినిమా ‘అన్‌చార్టెడ్’. ఈ వారం ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది.సూపర్ హిట్ అయిన వీడియో గేమ్ ఆధారంగా రూపొందటం, ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్లను హైలెట్ చేయడంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోం’ లాంటి సూపర్ హిట్ తర్వాత టామ్ హాలండ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను అన్‌చార్టెడ్ అందుకుందా?


కథ: నాథన్ డ్రేక్ (టామ్ హాలండ్), శామ్ డ్రేక్ (రూడీ పాంకో) అన్నదమ్ములు. వీరిద్దరూ చిన్నతనంలోనే ఒక నిధికి సంబంధించిన మ్యాప్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తూ అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత శామ్ డ్రేక్ పారిపోగా... నాథన్ డ్రేక్ అనాథాశ్రమంలో పెరుగుతాడు. 15 సంవత్సరాల తర్వాత విక్టర్ సలివాన్ (మార్క్ వాల్‌బర్గ్)... శామ్ గురించిన వివరాలు తనకు తెలుసంటూ నాథన్ దగ్గరకు వస్తాడు. ఒక నిధి వేట సమయంలో శామ్ తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని, ఆ నిధి వైపు వెళ్తే అతన్ని కనిపెట్టవచ్చని చెప్పడంతో నాథన్, విక్టర్‌తో చేతులు కలుపుతాడు. చివరికి ఏం అయింది? వారు నిధిని కనిపెట్టారా? నాథన్... శామ్ దగ్గరకు చేరాడా? వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


విశ్లేషణ: నిధి వేట సినిమాలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అప్పుడెప్పుడో వచ్చిన గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ (1966) నుంచి ఈ మధ్య వచ్చిన జంగిల్ క్రూజ్ (2021) వరకు ఎన్నో ట్రెజర్ హంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో కూడా మోసగాళ్లకు మోసగాడు నుంచి సాహసం వరకు చాలా నిధి వేట సినిమాలు చూశాం. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రెజర్ హంట్ సినిమాల్లో ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవి హై క్వాలిటీ యాక్షన్ ఎపిసోడ్లు. అన్‌చార్టెడ్ ఈ విషయంలో అస్సలు నిరాశ పరచదు. టెంపో డౌన్ అవుతుందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతిసారీ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్లతో మళ్లీ కథలో లీనం చేస్తాడు. అయితే విమానంలో వచ్చే ఒక యాక్షన్ సన్నివేశం మాత్రం మరీ వీడియో గేమ్‌ను తలపిస్తుంది.


ట్రెజర్ హంట్ సినిమా కాబట్టి యాక్షన్ ఎపిసోడ్ల ద్వారానే కథ కూడా ముందుకు సాగిపోతుంది. ఒక అడ్వెంచర్‌లో క్లూ పట్టుకోవడం... అది మరో అడ్వెంచర్‌కు దారి తీయడం ఇలానే స్టోరీ సాగిపోతుంది. అయితే ఇదే సినిమాకు కొంచెం మైనస్ కూడా. సినిమా అంతా యాక్షన్ ఎపిసోడ్లే కదా... ఇందులో కథ ఎక్కడుంది అని కొంతమంది అనుకునే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం రేసీగా సాగుతుంది. జాంబీల్యాండ్ సిరీస్, వెనమ్ (2018) వంటి సినిమాలు తీసిన రూబెన్ ఫ్లెచర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టేకింగ్‌లో తన అనుభవం కనిపిస్తుంది. అలాగే సినిమా ఎండింగ్‌లో సీక్వెల్ కోసం కొన్ని లీడ్స్ అలానే వదిలేశారు.


నిజానికి వీడియో గేమ్‌లో నాథన్ డ్రేక్ క్యారెక్టర్ వయసు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ సినిమాలో నటించిన టామ్ హాలండ్‌కు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంలో టామ్‌ను ఈ పాత్రకు తీసుకుని ఉండవచ్చు. టామ్ కూడా ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. పార్కౌర్ తరహా యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఇక మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. విక్టర్ పాత్రలో నటించిన మార్క్ వాల్‌బర్గ్‌కు నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. మంచితనం, కన్నింగ్‌నెస్ రెండూ కలగలిపిన పాత్రలో తను బాగా నటించాడు.


ఓవరాల్‌గా చూసుకుంటే... మీరు హాలీవుడ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు అయితే ఇది మీకు మస్ట్ వాచ్. మిగతా ఆడియన్స్‌కు కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వీడియో గేమ్ తరహాలో అనిపించవచ్చు.