జయలలిత గురించి సినిమా చేస్తున్నారంటే.. అది పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె సాదాసీదా నాయకురాలు కాదు. తమిళ ప్రజలు ఆరాధించే దైవం. అంత ఇమేజ్ ఉన్న గొప్ప వ్యక్తి గురించి సినిమా వస్తుందంటే.. ప్రజలు కూడా భారీ అంచనాలతో ఉంటారు. అందుకే ‘తలైవి’ చిత్రం ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. సాధారణ సినిమాలైతే ఎన్ని మలుపులైనా తిప్పుకోవచ్చు. ఎలాగైనా చూపించవచ్చు. కానీ, ఇది మహా నాయకురాలి చిత్రం. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఒక తరం ప్రజలు దాదాపు అవగాహన ఉంది. నేటితరానికి ఆమె గురించి చెబుతున్నప్పుడు వాస్తవ సంఘటనలను యథావిధిగా చూపించాలి. లేకపోతే అభిమానులు ఒప్పుకోరు. పైగా జయలలిత పాత్రకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఎంచుకున్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి తలైవి చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? ‘అమ్మ’ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడా? 


కథ: వాస్తవానికి ఇది కథ కాదు జీవితం. ప్రజలకు తెలిసిన మహానాయకురాలి జీవితం. కాబట్టి.. ఈ సినిమా జయలలిత 16 ఏళ్ల జీవితం నుంచి ప్రారంభమవుతుంది. చిన్న వయస్సులోనే జయలలిత(కంగనా రనౌత్) కథానాయిక పాత్రల్లో నటించడం నుంచి కథ మొదలవుతుంది. ఈ సందర్భంగా సంపన్న కుటుంబానికి చెందిన పేదరికంలో కూరుకుపోవడం. జయలలిత తల్లి ఎంతో కష్టపడి ఆమెను పెంచుతుంది. ఈ సందర్భంగా జయలలిత ఇష్టం లేకుండానే సీని రంగం వైపు అడుగు వేస్తుంది. 16 ఏళ్ల వయస్సులో ఆమె హీరోయిన్ అవుతుంది. అయితే అప్పటికే తమిళ సినీరంగంలో పేరుగాంచిన ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) పక్కనే నటించే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. ఇద్దరు కలిసి ఎన్నో చిత్రాల్లో నటిస్తారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? ఆమె రాజకీయాల్లో వచ్చేందుకు ప్రేరేపించిన అంశాలేమిటీ? అనేది తెరపైనే చూడాలి. అయితే.. ఈ సినిమాలో కేవలం జయలలిత షీఎం అయ్యేవరకు మాత్రమే చూపించారు. 


విశ్లేషణ: జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషిస్తుందని తెలియగానే.. న్యాయం చేస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే, కంగనా ఆ పాత్రలో జీవించిందనే చెప్పుకోవాలి. ఆమె చాలా సహజంగా హవభావాలు పలికించింది. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి మెప్పిస్తాడు. ఎంజీఆర్ అనుచురుడు విరప్పన్‌గా సముద్రఖని, కరుణానిధి పాత్రలో నాజర్ ఇమిడిపోయారు. దీన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించడంతో బాలీవుడ్ నటులకు కూడా ప్రాధాన్యమిచ్చారు.  జయలలిత తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటించింది. ఎంజీఆర్ భార్యగా మధుబాల, శశికళగా పూర్ణ నటించింది. ఈ సినిమాలో తొలి భాగమంతా జయలలిత సినిమా జీవితాన్ని చూపించారు. రెండో భాగంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, రాజకీయ జీవితాన్ని చూపించారు. మొత్తానికి దర్శకుడు ఏఎల్ విజయ్ ఎంత శ్రద్ధగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  


విడుదల తేదీ: సెప్టెంబరు 10, 2021