Sarkaaru Noukari Review: ఫేమస్ సింగర్ సునీత (Singer Sunitha) కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) హీరోగా పరిచయమైన సినిమా 'సర్కారు నౌకరి'. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాత కావడం, 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఎయిడ్స్ / హెచ్ఐవి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది?


కథ: గోపాల్ (ఆకాష్ గోపరాజు) అనాథ. తల్లిదండ్రులు చిన్నప్పుడు మరణిస్తారు. అప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కష్టపడి మరీ సర్కారు నౌకరి (ప్రభుత్వ ఉద్యోగం) సంపాదిస్తాడు. సొంతూరైన కొల్లాపూర్ మండలంలో పెద్ద రోగం (ఎయిడ్స్ / హెచ్ఐవి) వ్యాప్తి అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడం అతని పని. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతను చేసే పని ఏంటనేది అడగకుండా సత్య (భావనా వళపందల్) పెళ్లి చేసుకుంటుంది. సర్కారు నౌకరి ఉన్న వ్యక్తికి భార్య అని ఊరంతా ఆమెను గౌరవిస్తుంది. తనకు లభిస్తున్న గౌరవ మర్యాదలు చూసి సంతోషిస్తుంది సత్య.


పెద్ద రోగంపై అవగాహన కల్పించడంలో భాగంగా గోపాల్ కండోమ్స్ పంచుతాడు. ఆ విషయం తెలిసి ప్రజలు... గోపాల్, సత్యను అంటరానివారిగా చూడటం మొదలు పెడతారు. దాంతో భర్తను ఉద్యోగం మానేయమని సత్య కోరుతుంది. స్నేహితుడు సైతం ఉద్యోగం మానేయమని చెబుతాడు. గోపాల్ మాత్రం ఎవరి మాట వినడు. దాంతో భార్య పుట్టింటికి వెళుతుంది. స్నేహితుడు మాట్లాడటం మానేస్తాడు. ఊరు ప్రజలందరూ అవమానిస్తారు. ఎన్ని సమస్యలు ఎదురైనా గోపాల్ ఉద్యోగం ఎందుకు మానలేదు? ఎయిడ్స్ నియంత్రించేందుకు ఏం చేశాడు? అతని గతం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.



విశ్లేషణ: ప్రతి కథ / సినిమాకు ప్రారంభం, ముగింపు చాలా ముఖ్యం. ప్రారంభం కాస్త అటు ఇటుగా ఉన్నా సరే ముగింపులో మెరుపులు ఉన్నప్పుడు ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. ముగింపు మనకు ముందు అర్థమైనప్పుడు థియేటర్లో చివరి వరకు కూర్చోవాలంటే కథనం, సన్నివేశాలు ఆసక్తిగా ఉండాలి. అటువంటివి లేనప్పుడు సహనానికి పరీక్ష తప్పదు.


'సర్కారు నౌకరి' ప్రారంభం ఆసక్తిగా ఉంటుంది. కొల్లాపూర్ వాతావరణం, పల్లెటూరి యువకుడిగా ఆకాష్ గోపరాజు పరిచయం, పెళ్లి, కండోమ్స్ గురించి అవగాహన లేని చిన్నారులు వాటితో ఆటలు ఆడుకోవడం నవ్విస్తాయి. ఆ తర్వాత నుంచి కథలో మలుపులు, కథనం ఏమాత్రం ఆసక్తిగా ముందుకు సాగలేదు. ముగింపు ముందుగా ఊహించేలా ఉంటుంది. హీరో గతం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.


'సర్కారు నౌకరి' కథలో బరువైన భావోద్వేగాలు ఉన్నాయి. కానీ, అవేవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేవు. కరోనా నేపథ్యం అయితే కాంటెంపరరీ, ఎయిడ్స్ / హెచ్ఐవి ఈ తరం ప్రేక్షకులు ఎంత మందికి తెలుసు? పాఠ్య పుస్తకాలు, వార్తల్లో చూడటం తప్ప. కథను 1996లో జరిగినట్టుగా చూపించారు. ఆ కాలంలో సినిమా తరహాలో గంగనమోని శేఖర్ రచన, దర్శకత్వం, ఛాయాగ్రహణం ఉన్నాయి. రెండు గంటల గవర్నమెంట్ యాడ్ తీసినట్లు ఉందీ సినిమా. సహజత్వానికి దగ్గరగా తీయాలని అనుకోవడం తప్పు కాదు. కమర్షియల్ విలువలు అవసరం లేదు, కనీస ఆసక్తి  కలిగించేలా ఉండాలి కదా. సినిమాలో అటువంటి అంశాలు లేవు. తనికెళ్ళ భరణి, త్రినాథ్ మధ్య కామెడీ ట్రాక్ అసలు నవ్వించలేదు.


Also Read: ఆ ఓటీటీకి సునీత కుమారుడు ఆకాష్ సినిమా 'సర్కారు నౌకరి'... డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?


శాండిల్య అందించిన స్వరాల్లో హీరో హీరోయిన్లకు పెళ్ళైన తర్వాత వచ్చే పాట వినసొంపుగా, కనువిందుగా ఉంది. మిగతా పాటలు ఏవీ గురించుకునేలా లేవు. రాఘవేంద్రరావు నిర్మాత కావడంతో ఆయన శైలి హీరో స్నేహితుడిగా నటించిన మహాదేవ్, ఆయన మరదలుగా నటించిన మధులతపై ఓ పాట తీశారు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ బాలేదు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం పర్వాలేదు.


Also Read: డైరెక్షన్ చేయడానికి రెడీ అవుతున్న కాస్ట్యూమ్ డిజైనర్ - 'సర్కారు నౌకరి' రితీష ఇంటర్వ్యూ


హీరో ఆకాష్ గోపరాజులో కెమెరా ఫియర్ కనిపించలేదు. తొలి సినిమా అయినప్పటికీ ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించారు. హీరోయిన్ భావనా వళపందల్ తన పాత్రకు తగ్గట్లు నటించారు. హీరో హీరోయిన్ల లిప్ లాక్ సీన్లు కథలో భాగంగా ఉన్నాయి. ఇక, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ వంటి నటులను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు.


ఆకాష్ గోపరాజులో నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సినిమా కాదిది. అతని నటన ప్రేక్షకులకు తెలియడానికి, విజయం కోసం మరొక సినిమా చేయక తప్పదు. 'సర్కారు నౌకరి'కి వెళ్ళడం అంటే రెండు గంటల గవర్నమెంట్ యాడ్ థియేటర్లలో చూడటానికి వెళ్ళడమే.


Also Readబబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?