సినిమా రివ్యూ : సప్త సాగరాలు దాటి 
రేటింగ్ : 3.25/5
నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితస్వా, అవినాష్, చైతన్య కుమార్ తదితరులు
ఛాయాగ్రహణం : అద్వైత గుర్తుమూర్తి 
సంగీతం : చరణ్ రాజ్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి
రచన, దర్శకత్వం : హేమంత్ ఎం రావు
విడుదల తేదీ: సెప్టెంబర్ 22, 2023


కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. 'అతడే శ్రీమన్నారాయణ', 'చార్లీ' చిత్రాలు తెలుగులోనూ కొంత మందిని ఆకట్టుకున్నాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో'. సెప్టెంబర్ 1న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు. 


కథ (Saptha Sagaralu Dhaati Story) : శంకర్ గౌడ (అవినాష్) పెద్ద వ్యాపారవేత్త. ఆయన దగ్గర పని చేసే డ్రైవర్లలో మను (రక్షిత్ శెట్టి) ఒకరు. భవిష్యత్తులో ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. ప్రియా (రుక్మిణీ వసంత్) సింగర్. కాలేజీ చదువు పూర్తి కాలేదు. మను, ప్రియా ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని ఆశ పడతాడు. అయితే... మను తీసుకున్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని తల్లకిందులు చేస్తుంది. డబ్బు ఆశ చూపడంతో శంకర్ గౌడ కుమారుడు చేసిన యాక్సిడెంట్ తనే చేశానని జైలుకు వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? 


శంకర్ గౌడ ఆరు నెలల్లో బెయిల్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసినప్పటికీ... బెయిల్ ఎందుకు రాలేదు? జైలులో మనుకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ప్రియా కుటుంబ నేపథ్యం ఏమిటి? ఆమె ఇంట్లో పరిస్థితి ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Saptha Sagaralu Dhaati Review) : 'నాలుగు గోడల మధ్య ఉండటం శిక్ష కాదు మను... మనం చేసిన తప్పుల్ని తలచుకుని ఉండటం శిక్ష' - 'సప్త సాగరాలు దాటి' పతాక సన్నివేశంలో రక్షిత్ శెట్టితో శరత్ లోహితస్వా చెప్పే మాట! తప్పులు మాత్రమే కాదు... గత జీవితంలో సంతోష క్షణాలు సైతం మనల్ని విడిచిపెట్టవు. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనతోనే ఉంటాయని 'తొలిప్రేమ'లో వరుణ్ తేజ్ చెప్పినట్లు ఎప్పటికీ గుర్తుంటాయి. 'సప్త సాగరాలు దాటి' సందేశాత్మక సినిమా కాదు. కానీ, జీవితంలో వేసే ఒకే ఒక్క తప్పటడుగు, ఓ తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా తల్లకిందులు చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పే సినిమా.


'సప్త సాగరాలు దాటి'లో సందేశం కంటే హీరో హీరోయిన్లు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మధ్య కళ్ళతో జరిగిన సంభాషణలు మన మనసులో బలంగా ముద్ర వేసుకుంటాయి. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని మొదటి పదిహేను నిమిషాల్లో ప్రేక్షకులు నమ్మడానికి కారణం చరణ్ రాజ్ సంగీతం కూడా! సినిమాలో హీరో హీరోయిన్ల నటనను, సంగీతాన్ని వేరు చేసి చూడలేం. పాటలు మనల్ని తెరపై ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సూపర్బ్!


సముద్రమంత భావాల్ని రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే. ఆ విషయంలో దర్శకుడు హేమంత్ రావును మెచ్చుకోవాలి. అయితే... అలల శబ్దాన్ని, మనల్ని తాకే గాలుల్ని ఆశ్వాదించ లేనప్పుడు సముద్రంలో ఎంత దూరం ప్రయాణించినా సరే ఒకేలా ఉంటుంది! ఈ సినిమా కూడా అంతే! తెరపై పాత్రలతో ప్రయాణం చేయలేనప్పుడు మరీ సాగదీతలా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం... హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను, పాత్రల సంఘర్షణను ఆవిష్కరించడానికి పలు సన్నివేశాల్లో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. 


'మనిషిగా పుట్టలేదు. మనిషిగా మారడం కోసం పుట్టాం', 'నిజమైన ప్రేమ కనిపించేది అమ్మాయి కళ్లల్లో' వంటి సంభాషణలు ఆయా సన్నివేశాల్లో బలమైన ప్రభావం చూపించాయి. కొన్ని సన్నివేశాలను క్లుప్తంగా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ఫ్యామిలీ నేపథ్యం, విలనిజం వంటివి అంతర్లీనంగా చెప్పారు. ప్రియాకు బ్లూ కలర్ అంటే ఇష్టం. జైలుకు వెళ్లిన హీరో మగ్గం వర్క్ చేసేటప్పుడు బ్లూ కలర్ నేత వేయడం అందుకు చక్కటి ఉదాహరణ. 


హేమంత్ ఎం రావు దర్శకత్వ శైలిలో మణిరత్నం, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఛాయలు కనిపించాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. పాటలు కూడా వినసొంపుగా రాశారు.


కథగా చూస్తే 'సప్త సాగరాలు దాటి'లో కొత్తదనం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు ప్రేమికులు అనుభవించిన మనో వేదనకు రూపమే ఈ సినిమా. స్పాయిలర్ అవుతుంది కాబట్టి పూర్తిగా చెప్పడం లేదు... పతాక సన్నివేశాల్లో ఓ దృశ్యం ఈ మధ్య తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమా ముగింపును గుర్తు చేస్తుంది.


నటీనటులు ఎలా చేశారంటే : సినిమాలో రక్షిత్ శెట్టి ఎక్కడా కనిపించలేదు. మను మాత్రమే కనిపించారు. సినిమా ప్రారంభం నుంచి చివరకు వచ్చే సరికి ఆ పాత్రలో మార్పులను నటనలో చూపించారు. రక్షిత్ శెట్టి నటనలో ఇంటెన్సిటీ ఉంది. చాలా నార్మల్ డ్రస్సింగ్, సింపుల్ లుక్... పాత్రకు ఏం కావాలో అది చేశారు. జైలులో శంఖాన్ని చెవిలో పెట్టుకుని సముద్రపు హోరు వింటూ కన్నీరు పెడుతుంటే... మనమూ ఫీల్ అవుతాం. 


రుక్మిణీ వసంత్ కళ్లతో మాయ చేశారు. ఆమె కళ్లు చాలా పవర్ ఫుల్! కేవలం ఆ కళ్లతో నటించిన సన్నివేశాలు ఎన్నో! అందంగా ఉన్న కథానాయికలు ఉన్నారు. అద్భుతంగా నటించారని పేరు తెచ్చుకున్న వారూ ఉన్నారు. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న కథానాయికలు కొంత మంది మాత్రమే ఉన్నారు. ఆ జాబితాలో రుక్మిణీ వసంత్ పేరు చేరుతుంది. క్లోజప్ షాట్స్‌లో రుక్మిణి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం. 


రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంట బావుంది. నిజంగా ప్రేమికులు అన్నట్టు ఇద్దరూ నటించారు. భర్త మరణించిన తర్వాత ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లిగా డీ-గ్లామర్ పాత్రలో పవిత్రా లోకేష్ నటించారు. తెలుగులో డబ్బింగ్ కూడా ఆవిడ చెప్పుకొన్నారు. అచ్యుత్ కుమార్, అవినాష్, శరత్ లోహితస్వా తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్


చివరగా చెప్పేది ఏంటంటే : హృదయానికి హత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరో హీరోయిన్ల నటన, తెరపై ప్రపంచంలోకి తీసుకువెళ్లే సన్నివేశాల కలబోత 'సప్త సాగరాలు దాటి' సినిమా. తెరపై పాత్రలతో మనమూ ప్రయాణించేలా దర్శకుడు సినిమా తీశారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ భావోద్వేగాలు మనల్ని వెంటాడతాయి. అయితే... ఎమోషన్స్ ఇన్ డెప్త్ చూపించడంతో కొందరికి చాలా  నిదానంగా సాగుతున్న ఫీలింగ్ కలగవచ్చు. 


'సప్త సాగరాలు దాటి'లో మనం చూసింది సగం సినిమాయే. అక్టోబర్ 27న మిగతా సగం చూడాలి. ఈ సినిమా చివరలో చూపించిన రెండు మూడు నిమిషాల దృశ్యాలు మిగతా సగంపై అంచనాలను విపరీతంగా పెంచుతుంది. అందులో మరో సందేహం లేదు. 


Also Read బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial