మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ హీరో, హీరోయిన్లుగా.. డిఫరెంట్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు చాలా రోజుల తర్వాత ఒక హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామా చూడబోతున్నామనే ఫీలింగ్‌ను కలిగించాయి. మరి దేవా కట్టా ఆ అంచనాలను అందుకున్నాడా? సాయిధరమ్ తేజ్ హిట్టు కొట్టాడా?


కథ: ఐఐటీలో చదివి.. అమెరికాలోని ఎంఐటీలో సీటు వచ్చినా వెళ్లకుండా.. వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు ప్రిపేరయ్యే పంజా అభిరాం(సాయి ధరమ్ తేజ్), తప్పిపోయిన అన్నయ్య కోసం ఇండియా వచ్చి వెతికే ఎన్నారై మైరా హాన్సన్(ఐశ్వర్య రాజేష్), తన కొడుకు ఈ వ్యవస్థలో ఉండటం ఇష్టం లేని తండ్రి దశరథ్(జగపతి బాబు), ఒకప్పుడు వ్యవస్థని మార్చాలి అనుకుని.. తర్వాత జరిగిన సంఘటనలతో ఆ వ్యవస్థనే గుప్పిట్లో పెట్టుకుని ఆడించే ముఖ్యమంత్రి తల్లి(విశాఖ వాణి).. స్థూలంగా ఈ నలుగురి కథే ఈ రిపబ్లిక్. ఈ నలుగురి జీవితాలు చివరికి ఏ తీరాన్ని చేరుకున్నాయి? తను అనుకున్న లక్ష్యాన్ని అభిరాం సాధించాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఇంత హార్డ్ హిట్టింగ్ డ్రామాని ఎక్కడా డైల్యూట్ చేయకుండా తెరకెక్కించడమే గొప్ప విషయం. తను అనుకున్న విషయాన్ని దేవా కట్టా మాటలు, సన్నివేశాల రూపంలో పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ తర్వాత తేజ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడే సీన్, రమ్యకృష్ణని తేజ్ మొదటి సారి కలిసినప్పుడు వాళ్లిద్దరి మధ్యా జరిగే సీన్లు.. సినిమాకి హైలెట్ అని చెప్పాలి. గోడల నిండా పెయింటింగ్స్ ఉన్న గదిలో ఇద్దరినీ కూర్చోబెట్టి.. వారి ఐడియాలజీలను ఆ పెయింటింగ్స్ ద్వారా వివరించే విధానం హైలెట్ అని చెప్పాలి. అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు అనిపించినా.. ఇది కచ్చితంగా ఆలోచింపజేసే సినిమా. దేవా కట్టా రాసిన డైలాగులు, తీసిన సన్నివేశాలు కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడిని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నట్లు ఉంటాయి. డైనమైట్, హిందీ ప్రస్థానం ఫెయిల్యూర్ల తర్వాత ఇది దేవాకట్టాకు కమ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. రెండు వేర్వేరు ఐడియాలజీలతో ఏర్పడిన పార్టీల మధ్య ఏర్పడిన పొత్తుని శోభనంతో వర్ణించడం వంటి హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు, సీన్లు సినిమాలో చాలా ఉన్నాయి.


హీరో సాయిధరమ్ తేజ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను ఈ సినిమాలో ఇచ్చేశాడు. ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ సినిమాలు చూస్తే.. ఇద్దరు మామయ్యల ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ వంటి తన బలాలను వదిలేసి.. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. సినిమాలో ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్సులు ఉన్నప్పటికీ.. అక్కడ మాస్, ఎలివేషన్ల కంటే ఎమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమ్యాక్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ తరహా ముగింపు కొందరికి నచ్చకపోవచ్చు కానీ.. కథకు జస్టిఫికేషన్ అదే.


హీరో తర్వాత అంత కీలకమైన, బలమైన పాత్ర రమ్యకృష్ణ చేసిన విశాఖ వాణి. బాహుబలిలో శివగామి తర్వాత అన్ని లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ఇదే. కుర్చీలో నుంచి కదలకుండా హీరో ఎత్తులకు పై ఎత్తులు వేసే పాత్రలో రమ్యకృష్ణ జీవించింది. అయితే ఈ ఇద్దరి మధ్య వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లకుండా కేవలం ఐడియాలజీల వరకు మాత్రమే పరిమితం చేయడం దేవా కట్టా బ్రిలియన్స్. సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ ఎప్పుడు ఎదురుపడ్డా.. రమ్యకృష్ణ సొంతకొడుకుని పిలిచినట్లు బాబూ అని పిలుస్తుంది. కానీ ఆట పొలిటికల్ అయినప్పుడు పూర్తిగా ఎదురు నిలుస్తుంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర ఒప్పుకోవడం కూడా కాస్త బోల్డ్ అని చెప్పాలి. అది ఎందుకో మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. జగపతిబాబు, ఎస్పీ పాత్రలో చేసిన శ్రీకాంత్ అయ్యంగార్, మిగతా పాత్రలు చేసిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.


మణిశర్మ అందించిన పాటలు ఇంతవరకు జనంలోకి వెళ్లలేదు. నేపథ్యసంగీతం కూడా అంత ప్రభావం చూపించలేదు. కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నాయి. వాటిని ఎడిటింగ్‌లో తీసేస్తే సరిపోయేది. సినిమాటోగ్రఫీ కూడా సోసోగానే ఉంది.


ఒకసారి సినిమా మొత్తం చూశాక.. అసలు బాధితులు హీరో, హీరోయిన్లే కదా అనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ.. ఈ కథను ఎన్ని రోజులైనా తన కోసం హోల్డ్ చేయమని సాయిధరమ్ తేజ్ అడిగాడని చెప్పాడు. సినిమా క్లైమ్యాక్స్ చూశాక.. ఆయన అలా ఎందుకు అన్నాడో అర్థం అవుతుంది. ఇంత మంచి ఉద్దేశంతో సినిమా తీసినప్పుడు సంగీతం, ఎడిటింగ్ వంటి అంశాల్లో కాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా తయారయ్యేది. సాయిధరమ్ తేజ్ చెప్పే ‘దేనికి భయం’ అనే డైలాగ్ వింటే.. బాహుబలిలో దేవా కట్టానే రాసిన ‘ఏది మరణం’ డైలాగ్ గుర్తుకువస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాల్లో జాగ్రత్త వహించి ఉంటే ఈ సినిమా కల్ట్ క్లాసిక్ స్థాయికి వెళ్లేది. ప్రధానంగా సినిమా క్లైమ్యాక్స్‌ను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనే అంశం మీదనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి