ETV Win movie Wife Off review in Telugu: 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్, 'మై డియర్ దొంగ' సినిమాలో నటించిన యువ నటుడు నిఖిల్ గాజుల. ఆయన ఓ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'వైఫ్ ఆఫ్'. దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ ఇతర ప్రధాన తారాగణం. సాయి శ్వేతా కీలక పాత్ర చేశారు. భాను ఎరుబండి దర్శకత్వంలో సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. ఈటీవీ విన్ యాప్ (ETV Win OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూడండి.
కథ (Wife Off Movie Story): నటన అంటే ఆసక్తి ఉన్న అమ్మాయి అవని (దివ్య శ్రీ). దర్శకుడు కావాలని ప్రయత్నాలు చేస్తున్న యువకుడు అభి (అభినవ్ మణికంఠ). ఇద్దరూ కలిసి షార్ట్ (డెమో) ఫిల్మ్ చేస్తారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. అభి ప్రేమను వ్యక్తం చేసే రోజు అవనీ షాక్ ఇస్తుంది. వెడ్డింగ్ కార్డు చేతిలో పెడుతుంది. మావయ్య కొడుకు రామ్ (నిఖిల్ గాజుల)ను పెళ్లి చేసుకుంటుంది.
పెళ్ళైన తర్వాత అవని ఎందుకు కన్నీరు పెట్టింది? రామ్ కోసం ప్రతి రోజూ రాత్రి వాళ్లింటికి వచ్చే అమ్మాయి ప్రీతి (సాయి శ్వేతా) ఎవరు? అది తెలిసి అవని ఏం చేసింది? ఎందుకు వేశ్యగా మారింది? రాత్రి వేళల్లో రోడ్డు మీద ఎందుకు తిరిగింది? గంజాయికి ఎందుకు బానిసగా మారింది? అవనీకి పెళ్ళైన తర్వాత అభి ఏం చేశాడు? మూడు హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Wife Off Review Telugu): స్క్రీన్ ప్లేను నమ్ముకుని తీసిన సినిమా 'వైఫ్ ఆఫ్'. సినిమాలో ప్రేమ ఉంది. ప్రతీకారం ఉంది. చివరకు 'ప్రేమంటే మనం ప్రేమించిన మనిషి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకోవడం, ఆ సంతోషాన్ని దూరం చేసి దగ్గర అవ్వాలనుకోవడం కాదు' అని ఓ సందేశం కూడా ఉంది. సస్పెన్స్, డ్రామాకు అవసరమైన కథ, క్యారెక్టర్లు 'వైఫ్ ఆఫ్'లో కుదిరాయి. మరి, సినిమా?
దర్శకుడు భాను ఎరుబండి స్క్రీన్ ప్లేలో ప్రతిభ చూపించారు. కానీ, రచయితగా సక్సెస్ కాలేదు. ట్విస్టులు చక్కగా రాసుకున్నారు. ఒక్క కథను మూడు అధ్యాయాలుగా చెప్పాలనుకున్న ఆలోచన బావుంది. అలా చెప్పడం వల్ల కథపై ఉత్కంఠ పెరిగింది. అయితే ట్విస్టులు ఇచ్చినంత 'హై'... ముందు, వెనుక వచ్చిన సన్నివేశాలు ఇవ్వలేదు. రొటీన్ కథ, రొటీన్ సన్నివేశాలకు ట్విస్టులు యాడ్ అయితే చాలు అని అనుకోవడంతో 'వైఫ్ ఆఫ్'కు అసలు సమస్య వచ్చింది. మెయిన్ క్యారెక్టర్ అవనితో ఆడియన్ ట్రావెల్ అయ్యేలా సీన్లు కుదరలేదు. ఎమోషన్ క్యారీ కాలేదు. దాంతో సాదాసీదాగా ముందుకు వెళ్ళింది.
మంచి ట్విస్ట్ తర్వాత రేసీగా ముందుకు వెళితే బావుంటుందనుకున్న సినిమా రొటీన్ సీన్స్, డ్రామాతో నిండిపోవడంతో నిదానంగా ముందుకు సాగింది. ఆ ట్విస్టుల్లో చూపించిన వైవిధ్యం ముందు, వెనుక వచ్చిన సన్నివేశాల్లో చూపించలేదు. ఆయా సీన్లు ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు ఉంటాయి. కథలో బలం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక సింపుల్ రివేంజ్ స్టోరీ. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక 'ఓస్ ఇంతేనా' అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ, ఓటీటీకి తక్కువ అన్నట్టుంది.
సంభాషణల్లో 'మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా... లేనిదాని కోసం ఆరాటపడే తీరిక లేదు, ఉన్నదానితో సర్దుకుపోయే ఓపిక లేదు' వంటి మంచి మాటలు స్పేస్ తీసుకుని మరీ రాశారు దర్శకుడు భాను. సీన్స్ కూడా కొత్తగా తీసి ఉంటే బావుండేది. రొటీన్ సీన్స్ తీసి 'మమ' అనిపించారు. మాంటేజ్ బిట్ సాంగ్స్‌లో మెలోడీ బావుంది. ప్రణీత్ పాటలు బావున్నాయి. కానీ, నేపథ్య సంగీతం సరిగా కుదరలేదు. సస్పెన్స్ ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ ప్లజెంట్‌గా ఉంది. సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. కథకు అవసరమైన మేరకు ఖర్చు చేశారు.
Also Read: బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
అవని పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. దివ్యశ్రీ ఎమోషనల్ సీన్స్ చక్కగా చేశారు. అయితే, ఆ క్యారెక్టర్ వెయిటేజ్ క్యారీ చేయడానికి అవసరమైన బలం ఆవిడ నటనలో లేదు. గంజాయి కోసం తిరిగే సీన్స్, వేశ్యగా రోడ్డు మీద నిలబడి చేసే సీన్స్ చేయడంలో ఇంకాస్త పరిణితి అవసరం. ఇంతకు ముందు చూసిన నిఖిల్ గాజుల వేరు, ఇందులో నిఖిల్ గాజుల వేరు. రగ్గడ్ లుక్, గడ్డంతో కాస్త కొత్తగా కనిపించారు. కోపం, ఆ విలనీ షేడ్ బాగా చూపించారు. పాత్రకు తగ్గట్టు అభినవ్ మణికంఠ నటించారు. షార్ట్ ఫిలిమ్స్‌లో అతడిని చూసిన ఆడియన్స్‌కు కొత్తగా ఏమీ అనిపించదు. సాయి శ్వేతా స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు ఓకే.
వైఫ్ ఆఫ్... రన్ టైమ్ (80 నిమిషాలు) తక్కువ కావడం ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సింపుల్ రివేంజ్ స్టోరీని ట్విస్టులతో చెప్పాలనుకున్న ఆలోచన బాగుంది. అయితే, ట్విస్టులు ఇచ్చే ఫీల్ / వైబ్ సన్నివేశాలు ఇవ్వలేదు. 'వైఫ్ ఆఫ్' థ్రిల్ ఇవ్వలేదు, అందులో సన్నివేశాలు ఎంగేజ్ చేయలేదు. ఫ్రీగా ఉంటే ఒకసారి లుక్ వేయండి. లేదంటే లైట్ తీసుకోండి. ట్విస్టులు ఒక్కటే కాదుగా, సన్నివేశాలు కూడా బావుండాలి కదా!
Also Read: 'రైఫిల్ క్లబ్' రివ్యూ: వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటించిన మలయాళ సినిమా... ఎందుకంత స్పెషల్?