సినిమా రివ్యూ : వాంటెడ్ పండుగాడ్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : సునీల్, అనసూయ, సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణు ప్రియ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ తదితరులు
సినిమాటోగ్రఫీ : మహి రెడ్డి పండుగుల
సంగీతం : పీఆర్
నిర్మాతలు : సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: జీఆర్ మహర్షి
దర్శకత్వం: శ్రీధర్ సీపాన
విడుదల తేదీ: ఆగస్టు 19, 2022
సునీల్, అనసూయ, సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, విష్ణు ప్రియ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ... ఇలా భారీ స్టార్ కాస్టింగ్‌తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ: పాండు అలియాస్ పండు (సునీల్) జైలు నుంచి పారిపోవడంతో సినిమా ప్రారంభం అవుతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన పండుని పట్టుకున్నవారికి ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటిస్తుంది. ప్రేమించిన అమ్మాయితో (విష్ణు ప్రియ) పెళ్లి చేయడానికి తన తండ్రి రూ.25 లక్షలు అడగంతో అఖిల్ (వెన్నెల కిషోర్) పండుని పట్టుకోవడానికి సిద్ధం అవుతాడు. బోయపాటి బాలయ్య (శ్రీనివాస రెడ్డి), కృతి (వసంతి కృష్ణన్)లది మరో జోడి. కృతి గుండెలో రంథ్రం ఉండటంతో ఆ ఆపరేషన్ కోసం పండుని పట్టుకోవడానికి బాలయ్య బయలుదేరుతాడు. ఎస్సై అయితేనే ప్రేమించిన అమ్మాయి రతిని (నిత్య శెట్టి) ఇచ్చి పెళ్లి చేస్తానని తల్లి (హేమ) కండీషన్ పెట్టడంతో పండుని పట్టుకుని ప్రమోషన్ కొట్టాలని కానిస్టేబుల్ అక్రమ్ రాథోడ్ (సప్తగిరి) డిసైడ్ అవుతాడు. పండు ఇంటర్వ్యూ కోసం మీడియాలో పనిచేసే సుధీర్ (సుడిగాలి సుధీర్), ప్రీతి (దీపిక పిల్లి) ప్రయత్నిస్తూ ఉంటారు? ఇంతకీ పండుని ఎవరు పట్టుకున్నారు? చివరికి ఏమైంది అనేదే కథ.
విశ్లేషణ: ఓపెనింగ్ సీన్‌లో పండు జైలు నుంచి తప్పించుకునే సీన్‌ను చూసి తర్వాత సినిమా ఎలా సాగుతుందో చెప్పేయవచ్చు. ఆ తర్వాత కథలో పాత్రలు, వాటి నేపథ్యాలు సినిమాను మరింత సిల్లీగా మార్చేశాయి. జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ, తనపై రివార్డు, ఆ రివార్డు కోసం ప్రయత్నించే రకరకాల పాత్రలు... నిజానికి ఈ కాన్సెప్ట్ నుంచి బోలెడంత ఫన్ క్రియేట్ చేయవచ్చు. కానీ దర్శకుడు శ్రీధర్ రొటీన్ సన్నివేశాలు, పసలేని పంచ్‌లతో విసిగిస్తారు.
ఒక సీన్‌లో విష్ణుప్రియ ఫొటోని చూస్తూ వెన్నెల కిషోర్ ‘ముక్కేంటి ఫొటోలో నుంచి బయటకు వచ్చేంత ఉంది.’ అంటారు. విష్ణు ప్రియపై ఇలాంటి బాడీ షేమింగ్ జోకులు జబర్దస్త్, మల్లెమాలకు సంబంధించిన ప్రోగ్రాంల్లో ఎన్నో సార్లు చూశాం. బిగ్ స్క్రీన్ మీద అలాంటి డైలాగులే వినిపిస్తే ఏడవలేక నవ్వొస్తుంది. ఈ మధ్య బ్రహ్మానందం తెర మీద కనిపించడం చాలా తక్కువై పోయింది. ఈ సినిమాలో ఆయన పోషించిన డాక్టర్ ఆరోగ్యం పాత్ర చూస్తే అలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆయన మీద జాలేస్తుంది. మధ్యమధ్యలో ఆయన పాత్రకు వేరే వారి గొంతు వినిపించడం పంటి కింద రాయిలా తగులుతుంది.
సినిమాలో టైటిల్ రోల్ సునీల్‌దే అయినా తను సినిమా మొదట్లో, చివర్లో మాత్రమే కనిపిస్తారు. మిగతా సినిమా మొత్తం ఆయనను పట్టుకునే ప్రయత్నాలే జరుగుతాయి. నిజానికి ఈ సినిమాలో టాలెంటెడ్ ఆర్టిస్టులకు కొదవ లేదు. సునీల్, అనసూయ, సుధీర్, దీపిక పిల్లి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, పృథ్వీ, తనికెళ్ల భరణి, ఆమని... ఇలా చెప్పుకుంటూ పోతే కామెడీని అద్భుతంగా పండించగలవారు చాలా మంది. కానీ వారి నుంచి కనీసం అవుట్‌పుట్‌ను రాబట్టే సన్నివేశం ఒక్కటి కూడా లేదు. సుధీర్, దీపికల మధ్య వచ్చే ఒక సన్నివేశం మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఈ సినిమాలో కాస్తో కూస్తో రిలీఫ్ ఏమైనా ఉన్నాయంటే అవి పాటలే. అనసూయపై చిత్రీకరించిన ‘కేక కేక’, మిగతా ప్రముఖ పాత్రధారులపై చిత్రీకరించిన ‘అబ్బ అబ్బ’ సాంగ్‌ల్లో ఈ సినిమాకు సమర్పకులైన కె.రాఘవేంద్రరావు మార్కు కనిపిస్తుంది. సినిమా నిడివి కేవలం గంటా 50 నిమిషాలే కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్.
ఇక నటీనటుల విషయానికి వస్తే... సినిమాలో పెద్దగా పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్న పాత్ర ఎవరికీ దక్కలేదు. అందరూ తమ పాత్ర పరిధుల్లో బాగానే నటించారు. అనసూయ ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పిస్తుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ సినిమాను ఓటీటీలో భరించడం కూడా కష్టమే. సినిమాలో ప్లస్ పాయింట్ పాటలే కాబట్టి వాటిని యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయవచ్చు.