Mammootty's Turbo Review In Telugu: మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా యాక్ట్ చేసిన సినిమా 'టర్బో'. కరోనా తర్వాత వైవిధ్యమైన కథలతో, క్యారెక్టర్లతో కూడిన కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేసిన ఆయన... కమర్షియల్ సినిమా చేశారు. ప్రముఖ కన్నడ హీరో, దర్శకుడు రాజ్ బి శెట్టి విలన్ రోల్ చేయడంతో ఈ 'టర్బో'పై అంచనాలు మరింత పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Turbo Movie Story): జోస్ (మమ్ముట్టి)ది కేరళ. తన స్నేహితుల కోసం ముందు వెనుక ఆలోచించకుండా రంగంలోకి దూకేసాడు. జెర్రీ (శబరీష్ వర్మ) ప్రేమించాడని ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)ను తీసుకొస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఆమె చెన్నై వస్తుంది. ఇందు తల్లిదండ్రులు కేసు పెట్టడంతో జోస్ ఇంటికి పోలీసులు వస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతనూ ఇందును అనుసరిస్తూ చెన్నై వస్తాడు. ఇందు సాయంతో ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరతాడు. అంతా హ్యాపీ. కానీ, జెర్రీతో ఇందు మాట్లాడటం మానేస్తుంది.
ఇందు, జెర్రీ మధ్య ఎందుకు దూరం పెరిగింది? జోస్ ఫ్లాట్‌కు వచ్చిన జెర్రీ ఉరి వేసుకోవడం వెనుక కారణం ఏమిటి? ప్రేయసి దూరం పెట్టిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరొక కారణం ఉందా? ఇందును చంపాలని చెన్నై నగరాన్ని తన కనుసన్నలలో శాసించే అతి కిరాతకుడు వెట్రివేల్ షణ్ముగ సుందరం (రాజ్ బి శెట్టి) మనుషులు ఎందుకు తిరుగుతున్నారు? బ్యాంకుల్లో స్కామ్ ఏమిటి? అసలు కథ ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Turbo Movie Review Telugu): తెలుగులోనూ మంచి విజయం సాధించిన మోహన్ లాల్ 'మన్యంపులి' (మలయాళంలో 'పులి మురుగన్') తెరకెక్కించిన వైశాఖ్ ఈ 'టర్బో'కు దర్శకుడు. ముమ్ముట్టితో ఇంతకు ముందు 'పొక్కిరి రాజా', 'మధుర రాజా' సినిమాలు తీశారు. 'టర్బో' ప్రచార చిత్రాలు చూస్తే పక్కా కమర్షియల్ సినిమా అని అర్థం అవుతుంది. పైగా, ఈ సినిమాను మమ్ముట్టి నిర్మించడంతో అంచనాలు పెరిగాయి.
మమ్ముట్టి నుంచి అభిమానులు ఆశించే మాస్ అంశాలపై దర్శకుడు వైశాఖ్ దృష్టి పెట్టారు. రచయిత మిథున్ మాన్యుల్ థామస్ రాసిన హీరో క్యారెక్టరైజేషన్‌లో ఫన్ వర్కవుట్ అయ్యింది. ఇంటర్వెల్ వరకు కథ ఏమిటనేది పెద్దగా రివీల్ చేయకుండా మమ్ముట్టి మాస్, పంచ్ వర్క్ కావడంతో సినిమా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ 'వాట్ నెక్స్ట్?' అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాతే కథలో, ఆ క్యారెక్టర్లతో అసలు సమస్య మొదలైంది. కథలో మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనేది ఊహించడం కష్టం ఏమీ కాదు. క్లైమాక్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
ఊరిలో మమ్ముట్టి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అక్కడి నుంచి చెన్నై రావడం, డ్రైవరుగా జాయినైన రోజే యజమాని కోసం భారీ ఫైట్ చేయడం... ప్రతిదీ పక్కా కమర్షియల్ ఫార్మటులో వెళ్లింది. అయితే... ఇంటర్వెల్ వరకు అదేమీ సమస్య అనిపించదు. ఆ తర్వాత మెయిన్ ప్లాట్, ట్విస్టులు రివీల్ చేసిన తర్వాత కూడా సేమ్ ఓల్డ్ రొటీన్ కమర్షియల్ ఫార్మటులో సినిమా వెళ్లడం... దర్శక రచయితలు యాక్షన్ సీక్వెన్సుల మీద అతిగా ఆధారపడటంతో బోరింగ్ మూమెంట్స్ మొదలు అవుతాయి. రేసీగా కథను నడపాల్సిన చోట నిదానంగా వెళ్లారు. విలన్ క్యారెక్టరైజేషన్ సైతం అంత బలంగా లేదు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వంటివి కొందరిలో ఏమైనా క్యూరియాసిటీ కలిగిస్తే కలిగించవచ్చు.
Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?
పవర్ ఫుల్ విలన్, సామాన్య హీరో మధ్య ఫైట్ ఎప్పుడూ ఆసక్తి కలిగించాలి. కాస్తైనా థ్రిల్ ఉండాలి. హీరో ఎంత ఫైట్ చేయగలిగినా... శక్తివంతుడిని ఎదుర్కొనేటప్పుడు ఎంత తెలివిగా వ్యవహరిస్తాడో? అనిపించాలి. 'టర్బో' సెకండాఫ్‌లో ప్రేక్షకుడి ఏ దశలోనూ అలా అనిపించదు. ఈ సినిమాకు మేజర్ మైనస్ అది! కెమెరా వర్క్, డైలాగ్స్, మ్యూజిక్... అన్నీ కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నథింగ్ న్యూ, నథింగ్ లెస్! పాటలు లేకపోవడం ప్లస్ పాయింట్.
మాస్ ప్రేక్షకులు, డై హార్డ్ ఫ్యాన్స్ మమ్ముట్టిని ఎలా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా 'టర్బో'లో చూపించారు దర్శకుడు వైశాఖ్. కొన్ని విజిల్ వర్తీ కమర్షియల్ మూమెంట్స్ ఉన్నాయి. రాజ్ బి శెట్టి క్యారెక్టరైజేషన్ బలహీనంగా ఉన్నప్పటికీ... ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో కాస్త పవర్ యాడ్ అయ్యింది. జెర్రీగా శబరీష్ వర్మ, అంజనా జయప్రకాశ్ నటన ఓకే. 'ప్రేమలు' హీరోయిన్ మమితా బైజును గుర్తు చేసేలా ఉంటుంది ఓ అమ్మాయి హెయిర్ కట్. ఆటో బిల్లా పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ కనిపించారు. డాన్ పాత్రలో ఆయన సీరియస్ యాక్టింగ్ చేస్తుంటే... మనకు నవ్వు వస్తుంది.
మమ్ముట్టి... జస్ట్ మమ్ముట్టి మాస్ మూమెంట్స్ చూడటం కోసం 'టర్బో'కి ఆడియన్స్ వెళ్లాలి. ఆయన అభిమానులకు తోడు రాజ్ బి శెట్టి ఫ్యాన్స్ కూడా కథ, కథనాల్లో కొత్త పాయింట్స్ కొంచెం కూడా ఆశించవద్దు! కమర్షియల్ ఫార్మటులో తీసిన యాక్షన్ కామెడీ చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు సునీల్ కామెడీ బోనస్. రీసెంట్ ట్రెండ్ ఫాలో అవుతూ 'టర్బో'కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. డిఫరెంట్ సినిమాల్లో మమ్ముట్టిని చూసి చూసి కమర్షియల్ సినిమా చేయాలని కోరుకున్న అభిమానులకు 'టర్బో' నచ్చుతుంది. మిగతా ప్రేక్షకులకు ఓకే అనిపిస్తుంది.