సినిమా రివ్యూ : రామన్న యూత్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అభయ్ బేతిగంటి, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, 'జబర్దస్త్' రోహిణి, యాదమ్మ రాజు, 'టాక్సీవాలా' విష్ణు తదితరులు
ఛాయాగ్రహణం : ఫహాద్ అబ్దుల్ మజీద్
సంగీతం : కమ్రాన్
నిర్మాణం : 'ఫైర్ ఫ్లై ఆర్ట్స్' రజినీ
రచన, దర్శకత్వం : అభయ్ నవీన్ (అభయ్ బేతిగంటి)
విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2023


'పెళ్లి చూపులు', 'జార్జ్ రెడ్డి' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభయ్ బేతిగంటి (Abhay Bethiganti). ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'రామన్న యూత్' (Ramanna Youth). తెలంగాణ పల్లెల్లో యువకుల జీవితాలు, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉంది (Ramanna Youth Review)?


కథ (Ramanna Youth Story) : రాజు (అభయ్ బేతిగంటి)ది తెలంగాణలోని ఓ పల్లె అంక్షాపూర్. పని పాట ఏమీ చేయకుండా రాజకీయాల్లో తిరుగుతుంటాడు. ఊరిలో నాయకుడు అనిల్ ('తాగుబోతు' రమేష్) అనుచరుల్లో రాజు & ఫ్రెండ్స్ ఉంటారు. ఎమ్మెల్యే రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) మీటింగులకు అనిల్ వెళ్లకపోయినా రాజు, అతని స్నేహితులు తప్పకుండా వెళతారు. ఎమ్మెల్యే పేరు పెట్టి పిలిచేసరికి సంతోషంతో పొంగిపోతాడు. యూత్ లీడర్ కావాలని అతడు కలలు కంటాడు. ఊరిలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఎమ్మెల్యేను కలవాలని వెళతాడు. అతని ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? లేదా? ఆ ప్రయాణంలో ఎన్ని కష్టనష్టాలు పడ్డారు? అనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ (Thurum Khanlu Review) : సాధారణ పల్లెటూరు, రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సందేశాత్మక సినిమా 'రామన్న యూత్'. దర్శకుడిగా తొలి సినిమాలో పల్లె ప్రజలకు బలమైన సందేశం చెప్పాలని అభయ్ నవీన్ చక్కటి పాయింట్ రాసుకున్నారు. ఆ కథను వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నించారు. వినోదం వర్కవుట్ అయ్యింది. కానీ, సందేశాన్ని బలంగా చెప్పడంలో కాస్త తడబాటుకు గురి అయ్యారు. 


'రామన్న యూత్' చూస్తుంటే ఓ సినిమా చూసిన ఫీలింగ్ కంటే... మన పల్లెలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అంత సహజంగా సన్నివేశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరో, అతని స్నేహితుల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. తెలంగాణ పల్లె యువత ఆలోచనలు, వ్యవహార శైలిని చక్కగా చూపించారు. డ్రామా విషయంలో వెనకడుగు పడింది. కథలో విషయం చిన్నది అయినప్పుడు బలమైన డ్రామా ఉండాలి. నాన్ స్టాప్ కామెడీ అయినా ఉండాలి. 


హీరోతో పాటు అతని స్నేహితుల క్యారెక్టరైజేషన్లు ఎస్టాబ్లిష్ చేశాక ఎంతసేపటికీ కథ ముందుకు కదలదు. హీరో హీరోయిన్ల ప్రేమకథను సైతం సరిగా చూపించలేదు. ఈ సినిమాలో పాటలు సోసోగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు విపరీతంగా నవ్వించాయి. అలాగే, వాటిలో డ్రామా ఎక్కువ ఉంది. డ్రామా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఇంకా కామెడీ ఎక్కువ ఉంటే... ఆ సినిమాల సరసన 'రామన్న యూత్' నిలబడేది.   


నటీనటులు ఎలా చేశారంటే : హీరోగా కంటే రాజు పాత్రలో అభయ్ నటించాడని చెప్పాలి. కథలో పాత్రగా ఉంది తప్ప హీరోయిజం చూపించే సన్నివేశాలు లేవు. ఆ విధంగా క్యారెక్టర్ డిజైన్ చేసినందుకు అతడిని అభినందించాలి. రాజు పాత్రలో ఒదిగిపోయారు. 'మై విలేజ్ షో' అనిల్, ఇంకా హీరో స్నేహితులుగా నటించిన ఆర్టిస్టులు బాగా చేశారు. అందరి మధ్య సింక్ కుదరడంతో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. కన్నింగ్ విలన్ తరహా పాత్రలో 'టాక్సీవాలా' విష్ణు ఆకట్టుకుంటారు. ఇంకా 'తాగుబోతు' రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పల్లెటూరి భార్య పాత్రలో 'జబర్దస్త్' రోహిణి నవ్వించారు. 


Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే : యువతకు రాజకీయాల విషయంలో మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నించిన సినిమా 'రామన్న యూత్'. సందేశం కంటే వినోదం ఎక్కువ ఆకట్టుకుంటుంది. తెలంగాణ నేపథ్యంలో వినోదం, పల్లె వాతావరణం ఇష్టపడే వాళ్ళను ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాలకు నచ్చే, అందరూ మెచ్చే సినిమా అయితే కాదు.  


Also Read 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial