Payal Rajput's Rakshana 2024 Movie Review: పాయల్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా రక్షణ. ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రానికి దర్శక నిర్మాత. థియేటర్లలో ఇవాళ సినిమా విడుదలైంది. టీజర్, ట్రైలర్ కంటే దర్శక నిర్మాతపై హీరోయిన్ ఆరోపణలు చేయడం... ప్రచారానికి రాకుండా పాయల్ తమను ఇబ్బంది పెట్టిందని ప్రణదీప్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం వంటివి సినిమాకు చాలా ప్రచారం తెచ్చింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.


కథ (Rakshana 2024 Movie Story): కిరణ్ (పాయల్) కళ్ల ముందే తన స్నేహితురాలు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆత్మహత్యకు పాల్పడేలా ఎవరో ప్రేరేపించారని... స్నేహితురాలి పార్థీవ దేహం దగ్గర అజ్ఞాత వ్యక్తి నోటిలో లాలీపాప్ పెట్టుకుని అనుమానాస్పదంగా కనిపించాడని చెబుతుంది. కానీ... పోలీసులు పట్టించుకోరు. అదొక సూసైడ్ కేసు అని క్లోజ్ చేస్తారు. కిరణ్ ఏసీపీ అయ్యాక వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేట్ చేయడం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.


ఒక ఈవ్ టీజింగ్ కేసులో అరుణ్ (మానస్ నాగులపల్లి)ని కిరణ్ మందలిస్తుంది. అయితే... ఆమెపై ఆగ్రహం పెంచుకున్న అరుణ్... ఆమె ఫోటో, ఫోన్ నంబర్ కాల్ గర్ల్ పోర్టల్ లో పెడతాడు. దాంతో అతడిపై నిఘా పెడుతుంది. అనూహ్యంగా అరుణ్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు కిరణ్ మీద సస్పెండ్ వేటు వేస్తారు. ఆ తర్వాత కిరణ్ ఏం చేసింది? జీవితంలో సక్సెస్ ఫుల్ అమ్మాయిలను ఎవరో సైకో, సిక్ మైండెడ్ పర్సన్ టార్గెట్ చేస్తున్నాడని సందేహం వ్యక్తం చేస్తుంది. అటువంటి వ్యక్తి ఎవరూ లేరని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. కిరణ్ భ్రమల్లో బతుకుతుందని చెబుతుంది. ఎవరు చెప్పేది నిజం? నిజంగా ఆ ఆత్మహత్యల వెనుక ఎవరైనా ఉన్నారా? లేదా? చివరకు ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Rakshana 2024 Movie Review): పోలీస్ బేస్డ్ సైకో థ్రిల్లర్ సినిమాలు గమనిస్తే... అన్నిటిలో ఓ కామన్ టెంప్లేట్ ఉంటుంది. కంటికి కనిపించని నేరస్తుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది కోర్ పాయింట్ అవుతుంది. ఒకరు సైకో కావడం వెనుక కారణాలు ఏమిటి? ఆ సైకో వేటలో పోలీసులు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు? అనేది ఎంత ఉత్కంఠ కలిగిస్తే... ఆ సైకో సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. మరి, దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ 'రక్షణ'ను ఎలా తీశారు? అనేది చూస్తే...


కంటెంట్ పరంగా 'రక్షణ'లో పాయింట్ బాగుంది. ప్రజెంట్ మన సొసైటీలో లేడీస్ ఎదుర్కొంటున్న సమస్యను దర్శకుడు డీల్ చేశారు. మహిళలకు సమస్యలు అంటే ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటివి చూపించడం కామన్. ఆ రెండు కాకుండా మహిళలపై కొందరు మగాళ్లలో ఉన్న ఫీలింగ్ చూపించారు. అయితే... సినిమా స్టార్టింగ్ రెగ్యులర్ రొటీన్ మహిళల సమస్యతో స్టార్ట్ చేశారు. అందువల్ల, ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోలేదు. దానికి తోడు బడ్జెట్ పరమైన పరిమితులు తెరపై స్పష్టంగా కనిపించాయి. సెకండాఫ్‌లో సినిమా సరైన ట్రాక్ ఎక్కింది. సైకోగా మారడం వెనుక కథ, అతడికి హీరోయిన్ చిక్కడం వంటివి ఆసక్తిగా సాగాయి. సినిమాకు చివరి అరగంట బలంగా నిలిచింది. అయితే... మూవీలో స్ట్రాంగ్‌ వావ్‌ ఫ్యాక్టర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అయ్యాయి. హీరోయిన్ అండ్ విలన్ మధ్య సన్నివేశాలు ఉత్కంఠ కలిగించాయి.


టెక్నికల్ విషయాలకు వస్తే... పైన చెప్పినట్టు బడ్జెట్ లిమిటేషన్స్ క్వాలిటీ అంత కనిపించలేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ వంటివి సోసోగా ఉన్నాయి. డబ్బింగ్ లిప్ సింక్ కొన్ని సన్నివేశాల్లో కుదరలేదు. మ్యూజిక్ జస్ట్ ఓకే.


Also Read: మనమే రివ్యూ: ఓవర్సీస్‌లో నెగెటివ్ టాక్, మూవీ అంత బ్యాడా? శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?


పోలీస్ పాత్రకు అవసరమైన డ్రసింగ్, యాక్టింగ్ విషయంలో పాయల్ రాజ్‌పుత్ కేర్ తీసుకున్నారు. స్క్రీన్ మీద తన గ్లామర్ ఇమేజ్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఆమెది సీరియల్ రోల్ అని ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యారు. నటన విషయానికి వస్తే... ఓకే. 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా పాపులరైన యువ హీరో మానస్ నాగులపల్లి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాడు. రామ్ పాత్రలో రోషన్ ఓకే. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆనంద చక్రపాణి మరోసారి కనిపించారు. ఆయన నటన హుందాగా ఉంది. శివన్నారాయణతో పాటు మిగతా నటీనటులు ఓకే.


మహిళల సక్సెస్ చూసి ఈర్ష్య, అసూయ పడకూడదని అంతర్లీనంగా ఓ సందేశం ఇచ్చే సినిమా 'రక్షణ'. పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. రెగ్యులర్ థ్రిల్లర్స్ తరహాలో మొదలైనా... ఇంటర్వెల్ తర్వాత, ఆ కథలో ఒరిజినల్ సైకో రివీల్ అయ్యాక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చివరి అరగంట సినిమాకు బలంగా నిలిచింది. ఇదొక డీసెంట్ థ్రిల్లర్. ఆ జానర్ ప్రేక్షకులు అంచనాలు లేకుండా వెళితే థ్రిల్ అవుతారు.


Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా