Raju Yadav Movie Review in Telugu: 'గెటప్' శ్రీను హీరోగా నటించిన సినిమా 'రాజు యాదవ్'. టీవీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... 'జబర్దస్త్'తో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఛోటా మోటా క్యారెక్టర్లు నుంచి మొదలు పెడితే 'జాంబీ రెడ్డి', 'హనుమాన్' సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. 'త్రీ మంకీస్' చేశారు. సోలో హీరోగా ఆయన 'రాజు యాదవ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. 


కథ (Raju Yadav Movie Story): రాజు యాదవ్ (గెటప్ శ్రీను)ది మహబూబ్ నగర్. తండ్రి (ఆనంద చక్రపాణి) డ్రైవర్ అయినా సరే కొడుకు గవర్నమెంట్ జాబ్ కొడతాడని కష్టపడి చదివిస్తాడు. డిగ్రీలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో ఖాళీగా తిరుగుతుంటాడు. క్రికెట్ ఆడేటప్పుడు కార్క్ బాల్ తగలడంతో ఆర్ఎంపీ డాక్టర్ తెలిసి తెలియకుండా కుట్లు వేయడంతో ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉంటుంది.


స్నేహితుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని పోలీస్ స్టేషనుకు వెళితే స్వీటీ (అంకితా కరాట్) కనిపిస్తుంది. ఆమెను ప్రేమిస్తాడు. స్వీటీకి హైదరాబాదులో ఉద్యోగం వస్తే రాజు యాదవ్ కూడా సిటీకి షిఫ్ట్ అవుతాడు. తన వెంట పడవద్దని స్వీటీ చెప్పినా వినడు. ఆమె బర్త్ డేకి ప్రపోజ్ చేస్తాడు. రిజక్ట్ చేస్తుంది. తనకు బాయ్ ప్రెండ్ ఉన్నాడని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? రోడ్డు మీద రాజు యాదవ్ ఎవరితో గొడవ పడ్డాడు? దుబాయ్ వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు? తండ్రితో డబ్బుల కోసం ఎందుకు గొడవ పడ్డాడు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Raju Yadav Review): ముఖానికి క్రికెట్ బాల్ తగలడం, కుట్లు వేశాక / సర్జరీ తర్వాత ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండటం... కాన్సెప్ట్ ఐడియా బావుంది. కొన్ని ఐడియాలు విన్నప్పుడు బావుంటాయి. కానీ, కథలు రాసేటప్పుడు ఎక్కడో లైన్ అండ్ లెంత్ తప్పుతాయి. ఫుల్ లెంత్ స్క్రిప్ట్ అయ్యాక రెండు గంటలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టగల బలం తగ్గుతుంది. 'రాజు యాదవ్' కూడా ఆ కేటగిరిలోకి వస్తుంది.


'రాజు యాదవ్' కాన్సెప్ట్ ఓకే. కానీ, ఆ కథలో బలమైన సన్నివేశాలు లేవు. అసలు, ఆ ముఖానికి క్రికెట్ బాల్ తగలడం అనేది పక్కన పెడితే... కథలో కొత్తదనం లేదు. ఈ తరహా ప్రేమ కథలు తెరపై ప్రేక్షకులు చూశారు. 'ఆర్ఎక్స్ 100', 'బేబీ'లో హీరోయిన్ పాత్రలకు, 'రాజు యాదవ్'లో హీరోయిన్ పాత్రకు చాలా పోలికలు కనిపిస్తాయి. సో, లవ్ స్టోరీ ఎండింగ్ ఏమిటనేది ప్రేక్షకులు ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, ఆ ప్రేమ కథ ముగిశాక వచ్చిన సన్నివేశాలు గుండెలను బరువెక్కిస్తాయి.


'రాజు యాదవ్'లో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గానీ, ఆవారాగా తిరిగే హీరో క్యారెక్టర్ గానీ, ఆ ప్రేమ కథ గానీ... కొత్తదనం తక్కువ. ప్రేమ కథలో బలం లేదు. పతాక సన్నివేశాల్లో బరువైన భావోద్వేగాలు చూపించారు. అయితే... అమ్మాయిని హీరోయిన్ ఘాడంగా ప్రేమించాడని చెప్పే సన్నివేశాలు లేవు. అమ్మాయి ప్రేమలో పడితే మూడు లక్షలు తీసుకుని సర్జరీ చేయించుకోవాలని అనుకునే హీరో, ఆమెను సిన్సియర్ గా ఎప్పుడు ప్రేమించాడనేది ప్రేక్షకులకు అంతు చిక్కదు. అందువల్ల, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కాన్సెప్ట్ వల్ల కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు బావున్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు.


Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?


రాజు యాదవ్ పాత్రకు గెటప్ శ్రీను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. నటుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదు. పాత్రకు తగ్గట్టు నోరు తెరిచి ఉండాల్సిన సన్నివేశాల్లో మందు బాటిల్ పైకి ఎత్తి తాగడం వంటి డిటైలింగ్ బాగా చూపించారు. కథగా చూసినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఆకట్టుకుంటుందా? లేదా? అనేది ఒక్కసారి చెక్ చేసుకుని ఉంటే బావుండేది. హీరోయిన్ అంకిత ఖరత్ పాత్రకు తగ్గట్టు చేశారు. హీరో తండ్రిగా ఆనంద చక్రపాణి బాగా చేశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది.


'రాజు యాదవ్' కాన్సెప్ట్ బావుంది. కానీ, కథగా చూసినప్పుడు... అందులో ప్రేమకథ పలు హిట్ సినిమాలను గుర్తు చేసింది. గెటప్ శ్రీను నటన బావుంది. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. కానీ, ఆయన నుంచి ఆశించే కామెడీ లేదు. దాంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతారు. గెటప్ శ్రీను నటన కోసం వెళ్లాలని అనుకుంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్లండి.


Also Readవిద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జోడీ చేసిన రొమాన్స్ ఎలా ఉందంటే?