Dhanush Raayan Review In Telugu: ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఆయన 50వ చిత్రమిది. ఇందులో సందీప్ కిషన్, 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali) జంటగా నటించారు. ఎస్.జె. సూర్య (SJ Suryah) విలన్ రోల్ చేశారు. కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ ప్రధాన తారాగణం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలైన 'రాయన్' ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Raayan Movie Story): రాయన్... కార్తవ రాయన్ (ధనుష్)కు ఇద్దరు తమ్ముళ్లు. అందులో ఒకరు ముత్తు వేల్ (సందీప్ కిషన్), మరొకరు మాణిక్యం (కాళిదాస్ జయరామ్). వీళ్లకు ఓ చెల్లి. ఆమె పేరు దుర్గ (దుషారా విజయన్). ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతాడు రాయన్. చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముళ్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని ఆశ పడతాడు.
రాయన్ ఆశ ఓ విధంగా ఉంటే... విధి మరొక విధంగా ఉంది. తొలుత తమ ఏరియా డాన్ దురై (శరవణన్)ను చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత రాయన్ మీద దురై ప్రత్యర్థి సేతు రామన్ (ఎస్.జె. సూర్య) కన్ను పడుతుంది. తనతో పని చేయమని కోరతాడు. అందుకు రాయన్ అంగీకరించడు. ఆ తర్వాత ఏమైంది?
దురైను రాయన్ ఎందుకు చంపాడు? సేతు రామన్ ఏం చేశాడు? రాయన్, అతని తమ్ముళ్ల మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి? అన్నదమ్ముల గొడవ ఒక వైపు, సేతు రామన్ మరో వైపు... చివరకు ఏమైంది? ఈ కథలను పోలీస్ (ప్రకాష్ రాజ్) ఏ విధమైన మలుపులు తిప్పారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Raayan Review Telugu): 'రాయన్'... పక్కా కమర్షియల్ సినిమా. తెలుగు, తమిళ ప్రేక్షకులు కొన్నేళ్లుగా ఈ తరహా కథలు చూశారు. కుటుంబం కోసం ఎంతటి ధీశాలి - బలశాలిని అయినా సరే ఎదుర్కొనే కథానాయకుడు, అవమానం భరించక అన్నకు ఎదురు తిరిగిన తమ్ముళ్లు... ఇటువంటి కథలు కొత్త కాదు. హీరో పాత్రలో రజనీకాంత్ 'బాషా' ఛాయలు, తమ్ముళ్ల పాత్రల్లో చిరంజీవి 'అన్నయ్య', వెంకటేష్ 'లక్ష్మీ' సినిమా ఛాయలు కొందరికి గుర్తుకు రావచ్చు.
కమర్షియల్ ఫార్మాట్ సినిమాల నుంచి 'రాయన్'ను వేరు చేసింది, కొత్తగా చూపించింది మాత్రం ధనుష్ దర్శకత్వం & ఏఆర్ రెహమాన్ సంగీతం! సగటు కమర్షియల్ సినిమాల పంథాలో 'రాయన్' మొదలైనప్పటికీ, కొత్త కథ లేనప్పటికీ... ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడిగా ధనుష్ సక్సెస్ అయ్యారు. ఆయన ఎమోషనల్ సెన్సిబిలిటీస్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్ టేకింగ్ గూస్ బంప్స్ ఇస్తుంది.
దురై ఇంటికి తమ్ముళ్లతో రాయన్ వెళ్లిన సన్నివేశం గానీ... హాస్పటల్ యాక్షన్ సీన్ వచ్చినప్పుడు గానీ ఏం జరుగుతుంది? అని ఉత్కంఠగా చూసేలా చేశారు. ధనుష్ దర్శకత్వానికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం లేకుండా 'రాయన్'ను ఊహించడం కష్టం. ప్రతి ఫ్రేమ్... ప్రతి సన్నివేశానికి... రెహమాన్ స్వరాలు, నేపథ్య సంగీతం ఫైర్ తీసుకు వచ్చాయి. పాట అంటే కేవలం పాట కోసం మాత్రమే కాదని, నేపథ్యంలో పాట వినిపించడం ద్వారా రోమాలు నిక్కబొడుచుకునేలా చేయవచ్చని మరోసారి చూపించారు రెహమాన్. కొన్ని సన్నివేశాల్లో నిశ్శబ్దాన్ని బాగా వాడారు.
'రాయన్' కథ, కథలో మలుపుల్ని ప్రేక్షకులు ఊహించడం కష్టం కాదు. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం తీసుకున్నారు ధనుష్. ఇంటర్వెల్ తర్వాత కథలో మలుపులు ఊహించేలా ఉన్నా ఆసక్తిగా ముందుకు తీసుకు వెళ్లారు. టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది.
Also Read: బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?
వేటకు ముందు మాటు వేసినప్పుడు సింహం ఎంత ఒప్పిగ్గా ఉంటుందో, క్యారెక్టర్ పరంగా రాయన్ హీరోయిజం వచ్చే వరకు ధనుష్ అంతే ఒప్పిగ్గా ఎదురు చూశారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు జూలు విదిల్చిన సింహంలా చెలరేగిపోయారు. ధనుష్ చెల్లెలుగా నటించిన దుషారా విజయన్ ఆడ పులికి తక్కువ కాదన్నట్టు నటించారు. ముఖ్యంగా హాస్పిటల్ యాక్షన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆమె నటన మర్చిపోవడం కష్టం. అంతకు ముందు సన్నివేశాల్లో చుట్టుపక్కల ఇళ్లల్లో చూసే చెల్లిని గుర్తుకు చేశారు.
సందీప్ కిషన్ (Sundeep Kishan)కి మంచి పాత్ర పడితే ఎంత అద్భుతమైన నటన కనబరుస్తారనేది చెప్పడానికి 'రాయన్' చక్కటి ఉదాహరణ. గొడవ అంటే చాలు... ఓ అడుగు ముందుకు వేసే యువకుడిగా, అన్నకు ఎదురు తిరిగిన తమ్ముడిగా మంచి నటన కనబరిచారు. కాళిదాస్ జయరామ్ సైతం బాగా నటించారు. ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి తక్కువ. ఆయన తనదైన నటనతో ఆ పాత్రను రక్తి కట్టించారు.
ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్... వీళ్లిద్దరి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయా పాత్రల్లో మరొకరిని ఊహించుకోలేం. ముఖ్యంగా ఎస్.జె. సూర్య నటన, ఆ డైలాగ్ డెలివరీ విలనిజం పండించడంతో పాటు నవ్వించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, అపర్ణ బాల మురళి, దివ్యా పిళ్ళై తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులకు మాంచి కమర్షియల్ సినిమా అందించారు ధనుష్ (Dhanush). రాయన్ క్యారెక్టరైజేషన్, అందులో ధనుష్ నటన, రెహమాన్ సంగీతం కోసమైనా సినిమాను తప్పకుండా చూడాలి. కమర్షియల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో 'రాయన్' హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది. జస్ట్ గో అండ్ వాచ్.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?