Varun Sandesh's Nindha Review In Telugu: 'నింద' ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. 'కాండ్రకోట మిస్టరీ' క్యాప్షన్ అందుకు కొంత కారణమైంది. హీరో వరుణ్ సందేశ్ సైతం తప్పకుండా ఈ సినిమాతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరి, రాజేష్ జగన్నాథం స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ సందేశ్ (Varun Sandesh) కెరీర్‌కు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది చూడండి.
కథ (Nindha Movie Story): బాలరాజు ('ఛత్రపతి' శేఖర్)ది కాండ్రకోట. అతనికి కుమార్తె సుధా (యాని) అంటే పంచప్రాణాలు. అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వెనుకే ఫాలో అవుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఒక రోజు సుధా స్నేహితురాలు మంజు (క్యూ మధు) దారుణ హత్యకు గురి అవుతుంది. ఆ రేప్ అండ్ మర్డర్ కేసులో బాలరాజుకు న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తుంది. ఆ కేసుతో సంబంధం ఉన్న లాయర్, డాక్టర్, కానిస్టేబుల్, ఎస్సైతో పాటు సాక్ష్యం చెప్పిన ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు వివేక్ (వరుణ్ సందేశ్).
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)లో వివేక్ అధికారి. హత్యాచార కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? బాలరాజు కేసులో వివేక్ తండ్రి సత్యానంద్ (తనికెళ్ళ భరణి) తీర్పు ఇస్తాడు. తండ్రి తీర్పు ఇచ్చిన కేసును వివేక్ ఎందుకు టచ్ చేశాడు? జాన్వీ (శ్రేయా రాణి రెడ్డి) సాయాన్ని వివేక్ ఎందుకు కోరాడు? ఆమె ఏం చేసింది? అసలు కాండ్రకోట గ్రామంలో ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (Nindha Movie Review): ఏపీలోని కాండ్రకోటలో దెయ్యాలు ఉన్నాయని, ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆ మధ్య విపరీతంగా ప్రచారం జరిగింది. ఊరి మధ్యలోని పొలంలో న్యాయదేవత విగ్రహం, ఆ చీకటిలో వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. అయితే... ఆ మిస్టరీకి, ఈ సినిమాకు సంబంధం లేదు. ఈ కథను కాండ్రకోట కాదు, ఏ ఊరి నేపథ్యంలో తీసినా ఒక్కటే! అసలు, సినిమా ఎలా ఉంది? అనే విషయానికి వస్తే...
రేప్ అండ్ మర్డర్ కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్త కాదు. అటువంటి కేసుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.ఆ చిత్రాలకు, 'నింద'కు తేడా ఏమిటి? అంటే... స్క్రీన్ ప్లే! నూతన దర్శకుడు రాజేష్ జగన్నాథం స్క్రీన్ ప్లేతో కొత్తగా సినిమాను ప్రజెంట్ చేశారు. రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్టైన వ్యక్తి మీద సాధారణంగా ప్రేక్షకుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకున్నారేమో... కిడ్నాపులతో కథను ప్రారంభించారు.
ఎవరో ముసుగు వ్యక్తి అందర్నీ ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? అని స్క్రీన్ ముందు ఉన్న ఆడియన్స్‌లో కాస్త క్యూరియాసిటీ మొదలయ్యేలా చేశారు దర్శకుడు రాజేష్ జగన్నాథం. ఆ తర్వాత ముసుగు రివీల్ చేయడం, కేసులో ఒక్కో చిక్కుముడి విప్పుతూ ముందుకు వెళ్లడం బావుంది. పతాక సన్నివేశాలు రాసిన తీరు, తీసిన విధానం చక్కగా ఉంది. తండ్రీ కూతుళ్ళ బంధంతో పాటు భావోద్వేగాలు సైతం హర్షించేలా ఉన్నాయి.
రచయితగా, దర్శకుడిగా రాజేష్ జగన్నాథం తీసుకున్న కథ, తెరకెక్కించిన తీరు ఓకే. కానీ, ఆయనలో నిర్మాత మాత్రం దర్శకుడు ఊహలకు అడ్డుకట్ట వేశాడు. ఈ సినిమాలో నిర్మాణ పరంగా పరిమితులు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. బడ్జెట్ ఇంకాస్త పెట్టి ఉంటే సాంకేతిక పరంగా, నటీనటుల పరంగా సినిమా బాగా వచ్చేది. పూర్ డైలాగ్స్ సినిమాలో ఇంపాక్ట్ తగ్గించాయని చెప్పాలి. బలమైన మాటలు తోడు అయితే దర్శకుడు అనుకున్న ఎమోషన్ ఇంకా ఎలివేట్ అయ్యేది. ఎమోషనల్, ఎఫెక్టివ్ డైలాగ్స్ మిస్ అయ్యాయి. సంతు ఓంకార్ అందించిన బాణీలు ఓకే. రీ రికార్డింగ్ కూడా పర్వాలేదు.
Also Read: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?
హీరోగా వరుణ్ సందేశ్ (Varun Sandesh Ninda Movie Review)కు ఈ సినిమా కొత్త డోర్స్ ఓపెన్ చేస్తుందని చెప్పవచ్చు.తన రెగ్యులర్ స్టైల్ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఫస్టాఫ్ అంతా స్క్రీన్ మీద ఆయన కనిపించేది తక్కువ. ఇంటర్వెల్ తర్వాత కూడా హీరోయిజం కంటే క్యారెక్టర్ పరిధి మేరకు చేశారు. పెర్ఫార్మన్స్ పరంగా మెప్పిస్తారు. హీరో తండ్రిగా తనికెళ్ల భరణి కనిపించారు. ఆయన వల్ల ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. తండ్రిగా, కాస్త పొగరుబోతుగా 'ఛత్రపతి' శేఖర్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న రోల్ చేశారు. యాని పాత్ర తొలుత సాధారణంగా ఉంటుంది. చివర్లో ట్విస్ట్ ఇస్తుంది. 'క్యూ' మధు కీలక పాత్ర చేశారు. ఆమె నటన ఓకే. శ్రేయా రాణి రెడ్డిని హీరోయిన్ అనలేం. హీరోకి సాయం చేసే పాత్రలో కనిపించారు. కానీ, ఆ క్యారెక్టర్ పెద్దగా స్కోప్ ఉన్నది కాదు.
కథ, స్క్రీన్ ప్లే పరంగా... 'నింద' డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh)ను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తుంది. దర్శకుడిగా తొలి సినిమా రాజేష్ జగన్నాథం నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకున్నారు. కానీ, నిర్మాతగా రాజీ పడటంతో ఎగ్జిక్యూషన్ పరంగా ఆశించినట్టు సినిమా రాలేదు.
Also Read: యేవమ్ రివ్యూ: అపరిచితుడు క్రిమినల్ అయితే? చాందిని చౌదరి సినిమా హిట్టా? ఫట్టా?