Rakesh Varre's Jithender Reddy Review In Telugu: 'బాహుబలి'లో కనిపించేది కాసేపే అయినప్పటికీ... తల నరికే సన్నివేశం వల్ల రాకేష్ వర్రే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు 'మిర్చి'లో నటుడిగా, తర్వాత 'ఎవ్వరికీ చెప్పొద్దు'తో హీరోగా విజయాలు అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన బయోపిక్ 'జితేందర్ రెడ్డి'. 'ఉయ్యాలా జంపాలా', 'మజ్ను' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించారు. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? జితేందర్ రెడ్డి ఎవరు? ఆయన ఏం చేశారు? అనేది చూస్తే...


కథ (Jithender Reddy Story): తెలంగాణలో నక్సలైట్ / మావోయిస్టుల వల్ల కొన్ని కుటుంబాలకు జరిగిన అన్యాయం చూసి జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) మనసు చలించిపోతుంది. తండ్రి రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు కావడంతో బాల్యం నుంచి అతనిపై సనాతన ధర్మ ప్రభావం ఎక్కువ. కాలేజీలో చేరిన తర్వాత కమ్యూనిస్టు, లెఫ్టిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతాడు. దాంతో అతను మావోయిస్టులకు, అప్పట్లో అధికారంలో ఉన్న (ఎన్టీఆర్ తెలుగుదేశం) పార్టీలోని ఓ మంత్రికి విరోధి అవుతాడు. 


జితేందర్ రెడ్డి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు? అతని మీద గోపన్న (సుబ్బరాజ్) ప్రభావం ఎంత? సనాతన ధర్మ రక్షణ కోసం అతను ఏం చేశాడు?  జితేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరెవరు పావులు కదిపారు? అతడిని ఎవరు చంపారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Jithender Reddy Review Telugu): బయోపిక్ తీయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ రాజకీయ నాయకులు, మావోయిస్టులతో ముడి పడిన కథను తెరకెక్కించడం ఇంకా కష్టం. 'ఉయ్యాలా జంపాలా', 'మజ్ను' వంటి ప్రేమ కథలు తీసిన విరించి వర్మ ఈ 'జితేందర్ రెడ్డి'ని ఎలా తీశారు? అని చాలా మంది ఇండస్ట్రీ జనాల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి, డైరెక్షన్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...


అటల్ బీహార్ వాజపేయిని అతుల్ విహార్ రాజపేయి, వరవర రావును నరహర రావు అని, ఆర్ఎస్ఎస్‌ను ఆర్‌హెచ్‌ఎస్ అని పేర్లు మార్చారు. అయితే... ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది గుర్తు పట్టడం కష్టం కాదు. పేర్లతో పాటు కొన్ని సన్నివేశాలకు సైతం కత్తెర పడింది. దాంతో ఉన్నట్టుండి ఒక సీన్ నుంచి మరొక సన్నివేశానికి జంప్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఉండే టెంపో మిస్ అయ్యింది. వాస్తవ ఘటనలు, నిజజీవిత కథలను తెరకెక్కించేటప్పుడు ఆయా వ్యక్తులను గ్లోరిఫై చేయడం సాధారణంగా జరిగే విషయమే. దాంతో వ్యక్తి పూజ ఎక్కువ అవుతుంది. 'మహానటి' మాత్రమే అందుకు అతీతం అని చెప్పాలి. 'జితేందర్ రెడ్డి' గొప్పతనం తప్ప అతని తప్పులు లేకపోవడం వల్ల మరీ ఎక్కువ చెబుతున్నారా? అనే సందేహం కలుగుతుంది.


Jithender Reddy Telugu Review: కథగా, సినిమాగా చూస్తే... 'జితేందర్ రెడ్డి'లో కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. గోపీ సుందర్ పాటలు, నేపథ్య సంగీతం కథ, సన్నివేశాలకు బలం చేకూర్చాయి. హీరోయిజాన్ని ఆర్ఆర్ ఎలివేట్ చేసింది. ఆ తర్వాత జ్ఞానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ. కెమెరా వర్క్ సహజంగా ఉంది. అప్పటి తెలంగాణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంతో పాటు సినిమాకు జ్ఞానశేఖర్ ఫ్రేమింగ్, లైటింగ్ ఒక టోన్ సెట్ చేశాయి. జితేందర్ రెడ్డి తమ్ముడు ముదుగంటి రవీందర్ రెడ్డి కథ, మాటలు రాయడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సొంత అన్న కథ కావడం, పైగా పీరియాడిక్ టచ్ ఉండటంతో రాజీ పడకుండా నిర్మించారు.


'జితేందర్ రెడ్డి' క్లైమాక్స్ చూస్తే విరించి వర్మ దర్శకత్వంలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యం వేస్తుంది. వంద గుళ్ళు ఒక్కసారిగా అల్లూరి శరీరంలోకి దిగిన సన్నివేశాలకు ఏమాత్రం తక్కువ కాకుండా 'జితేందర్ రెడ్డి' ముగింపులో ఎమోషన్ వర్కవుట్ చేశారు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సీరియస్ టోన్ సినిమా చేశారు. అయితే... జంప్ కట్స్ లేకుండా, మరింత ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకుని సినిమా తీయాల్సింది. సంభాషణల్లో కొన్ని పదునైన మాటలు పడ్డాయి.


Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?



'జితేందర్ రెడ్డి' పాత్రకు రాకేష్ వర్రే ప్రాణం పోశారు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగే తీరు, మార్పును స్పష్టంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ నుంచి నటన వరకు ప్రతి విషయంలో తనవైపు నుంచి లోపం లేకుండా చూసుకున్నారు. గోపన్నగా సుబ్బరాజ్, మావోయిస్టుగా 'ఛత్రపతి' శేఖర్ చక్కగా నటించారు. రియా సుమన్, వైశాలి పాత్రల పరిధి తక్కువ. ఉన్నంతలో ఓకే. 


సనాతన ధర్మ రక్షణ కోసం పోరాటం చేసిన నాయకుడు 'జితేందర్ రెడ్డి' అని ఈ తరం ప్రేక్షకులకు తెలియని నిజ జీవిత కథను నిజాయతీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పతాక సన్నివేశాలు చూస్తే తెలంగాణ అల్లూరిగా 'జితేందర్ రెడ్డి' కనిపిస్తారు. అయితే... ఈ నాయకుని ప్రయాణం అందరూ హర్షిస్తారని చెప్పలేం. ముఖ్యంగా కమ్యూనిస్టులకు, మావోయిస్టు సానుభూతిపరులకు నచ్చే అవకాశం తక్కువ.


Also Read'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' రివ్యూ: నిఖిల్ ఎప్పుడో చేసిన సినిమా - ఇప్పుడు చూసేలా ఉందా?