Nikhil Siddhartha's Appudo Ippudo Eppudo Review: యువ కథానాయకుడు నిఖిల్ - ట్యాలెంటెడ్ టెక్నీషియన్ సుధీర్ వర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు చేశారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'తో హ్యాట్రిక్ హిట్ కోసం ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. ఈ సినిమా ఎప్పుడు తీశారు? అనేది చాలా మంది ప్రేక్షకుల్లో ఉన్న సందేహం. అది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమా చూసేలా ఉందా? 'సప్త సాగరాలు దాటి'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న రుక్మిణీ వసంత్ స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. ఆమెకు తెలుగులో మంచి డెబ్యూ లభించిందా? లేదా? అంటే... 


కథ (Appudo Ippudo Eppudo Story): హైదరాబాదీ యువకుడు రిషి (నిఖిల్)కు రేసర్ కావాలని కోరిక. తార (రుక్మిణీ వసంత్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుని లండన్ వెళతాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్లకు మళ్లీ తార కనపడుతుంది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని తెలుస్తుంది. దాంతో దగ్గర అవుతాడు. తార ప్రపోజ్ చేసే సమయానికి తులసి (దివ్యాంశ కౌశిక్) వస్తుంది. రిషిని హగ్ చేసుకుంటుంది. దాంతో తార ప్రపోజ్ చేయకుండా వెళ్లిపోతుంది.


తార వెళ్లిన తర్వాత లండన్ సిటీలో లోకల్ డాన్ బద్రి నారాయణ (జాన్ విజయ్) మనుషులు వచ్చి రిషి, అతని స్నేహితుడు యాజీ అలియాస్ బాలాజీ (హర్ష చెముడు) వచ్చి ఎందుకు కిడ్నాప్ చేశారు? రిషి ఇంట్లో హత్యకు గురైన అమ్మాయి ఎవరు? రిషి, బాలాజీ తమ ప్రాణాలు ఎలా కాపాడుకున్నారు? రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మున్నా (అజయ్) ఎవరు? చుంబన ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Appudo Ippudo Eppudo Review Telugu): ప్రతి కథ / సినిమాకు స్టార్టింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ చాలా ముఖ్యం. అందులోనూ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలకు ఇంకా ఇంకా ఇంపార్టెంట్. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని టెన్షన్ బిల్డ్ చేయాలి. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చూస్తున్నంత సేపూ క్యూరియాసిటీ గానీ, టెన్షన్ గానీ అసలు కలగవు.


థ్రిల్లర్ సినిమాగా మొదలైన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'... ఆ తర్వాత ప్రేమ కథగా టర్న్ తీసుకుని, కాసేపు ముక్కోణపు ప్రేమ కథ అనే చిన్న ట్విస్ట్ ఇచ్చి, అక్కడ నుంచి క్రైమ్ డ్రామాగా ముగిసింది. కానీ, స్టార్టింగ్ టు ఇంటర్వెల్ చాలా సాదాసీదాగా, పరమ రొటీన్‌గా సాగుతుంది. రుక్మిణీ వసంత్, నిఖిల్ మధ్య ప్రేమ కథ మరీ మరీ రొటీన్. అయితే... మధ్య మధ్యలో వచ్చే పాటలు కాస్త బావున్నాయి. రుక్మిణీ వసంత్ అందం కొంతమంది ప్రేక్షకులను అయినా ఆకట్టుకుంటుంది. సుధీర్ వర్మ ట్యాలెంటెడ్ టెక్నీషియన్. ఆయన సినిమాల్లో మేకింగ్ బావుంటుంది. మరీ ముఖ్యంగా యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్సులు బాగా తీస్తారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలోనూ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించింది. కానీ, అది అక్కడ అక్కడ మాత్రమే ఉంటుంది. 


దర్శకుడిగా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడంలో సక్సెస్ అయిన సుధీర్ వర్మ... కథకుడిగా ఫెయిల్ అయ్యారు. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే కుదరలేదు. సుధీర్ వర్మ సినిమాల్లో విలన్ క్యారెక్టరైజేషన్లు చాలా టిపికల్‌గా ఉంటాయి. 'దోచేయ్' ఫెయిల్ అయినా సరే... అందులో పోసాని, హర్ష మధ్య సీన్లు నవ్విస్తాయి. ఎండింగ్ కోర్టు రూమ్ సీన్ కూడా! అటువంటి సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో పడలేదు. జాన్ విజయ్ రోల్ విలనిజం పండించలేదు. అలాగని, నవ్వించలేదు. 


సింగర్ కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకే. కానీ, సన్నీ ఎంఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఖర్చుకు వెనుకాడలేదు. లండన్ సిటీలో ప్రైమ్ లొకేషన్లలో ఛేజ్ సీక్వెన్స్ తీశారు. యూకేని చూపించినందుకు ఆ డబ్బుల్లో చాలా వరకూ వెనక్కి వస్తాయనుకోండి.


నిఖిల్ (Nikhil's Appudo Ippudo Eppudo Review)కు ఇటువంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అలవోకగా చేసేశారు. కానీ, ఆయన కృషికి తగ్గ కథనం లేదు. ఎంత తన భుజాల మీద సినిమా మోయాలని చూసినా అందుకు తగ్గ సన్నివేశాలు కుదరలేదు. రుక్మిణీ వసంత్ తన పాత్ర వరకు న్యాయం చేశారు. అందంగా కనిపించింది. దివ్యాంశ కౌశిక్ అయితే లిప్ సింక్ లేకుండా డైలాగ్స్ చెప్పారు. ఆవిడ నటన అంతంత మాత్రమే. కానీ, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బావుంది.


Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?



నిఖిల్ స్నేహితుడిగా హర్ష చెముడు కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. 'ఇడియట్' కథతో అలీ సన్నివేశాలకు సంబంధం ఉండదు. కానీ, ఆ సీన్లు నవ్విస్తాయి. ఈ సినిమాలో సుదర్శన్, సత్య సన్నివేశాలతో అసలు కథకు సంబంధం ఉండదు. ఆ సీన్లు తీసేసినా సినిమాకు వచ్చే నష్టం లేదు. కేవలం కథను నేరేట్ చేయడానికి ఆ ఇద్దరి పాత్రలు వాడుకున్నారు. చివర్లో చిన్న లింక్ ఇచ్చారంతే! జాన్ విజయ్, అజయ్ క్యారెక్టర్లు రొటీన్. 


'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'... ఇది ఎప్పుడో తీసిన సినిమా అని నిఖిల్ లుక్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు అయితే చూసేలా లేదు. క్రైమ్ డ్రామా సీన్స్ ఎగ్జైట్ చేయలేదు. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేదు. సుధీర్ వర్మ, నిఖిల్ కాంబో అభిమానులను, ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేస్తుంది. ఇదీ కథ అని క్లారిటీ రావడానికి సెకండాఫ్ సగం అయ్యేవరకూ వెయిట్ చేయాలి. అక్కడ వచ్చే ట్విస్టులు చూస్తే చిన్న పిల్లాడు కూడా చెప్పేసేలా ఉంటాయి. అవాయిడ్ చేయడం మంచిది.


Also Readబాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్