Criminal or Devil Movie Review In Telugu: 'ది కేరళ ఫైల్స్' తర్వాత అదా శర్మను ప్రేక్షకుల చూసే తీరు మారింది. అంతకు ముందు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసిన ఆమె సీరియస్ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేశారు. 'బస్తర్'ను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొంత విరామం తర్వాత 'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్' సినిమాతో అదా శర్మ తెలుగు తెరపైకి ముందుకు వచ్చారు. విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకుడు. హారర్ అండ్ సస్పెన్స్ జానర్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే?


కథ (Criminal Or Devil Movie Story): సిద్ధూ (విశ్వంత్ దుడ్డుంపూడి)కి భయం ఎక్కువ. తల్లిదండ్రులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. భయానికి తోడు 'డెవిల్' అనే హారర్ సినిమా చూస్తాడు. అప్పట్నుంచి అందులో దెయ్యం తనను చంపేస్తుందని భ్రమలో భయపడుతూ ఉంటారు. ఆ భయానికి తోడు అదే సమయంలో సిటీలో భయానక వాతావరణం నెలకొంటుంది. కొందరు అమ్మాయిలు వరుసగా మిస్ అవుతారు. ఆ మిస్సింగుల వెనుక రక్ష (అదా శర్మ) ప్రమేయం ఉందనే అనుమానం మొదలు అవుతుంది. పోలీసులు ఆమె కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ సమయంలో సిద్ధూ ఇంటికి వస్తుంది రక్ష. 


అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? సిద్ధూ ఇంటికి రక్ష ఎందుకు వచ్చింది? ఆమె రాకతో సిద్ధూ భయం పోయిందా? పెరిగిందా? సమాజంలో నెలకొన్న అలజడికి అసలైన సైకో ఎవరు? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ (CD Criminal Or Devil Review): కరోనా తర్వాత దర్శక రచయితల్లో మార్పు మొదలైంది. ఓటీటీల్లో వరల్డ్ సినిమా చూడటం మొదలు పెట్టిన తెలుగు ప్రేక్షకులకు కొంచెం కొత్త అనుభూతి ఇవ్వాలనే ప్రయత్నం కొందరిలో అయినా కనబడుతోంది. 'సీడీ - క్రిమినల్ ఆర్ డెవిల్'కి కథ, మాటలు రాసిన ముద్దు కృష్ణతో పాటు దర్శకత్వం వహించిన కృష్ణ అన్నంలో ఆ ప్రయత్నం కనిపించింది. అందుకు వాళ్లిద్దర్నీ మెచ్చుకోవచ్చు. హాలీవుడ్ మూవీస్ ఇన్స్పిరేషన్‌తో ట్విస్టులతో కూడిన కథతో సినిమా తీశారు. మరి, ఇది ఎలా ఉంది? అంటే...


'క్రిమినల్ ఆర్ డెవిల్' మొదలయ్యాక అదా శర్మ కొన్నాళ్ల క్రితం చేసిన సినిమా అని డౌట్ కొడుతుంది. ప్రజెంట్ లుక్స్, మూవీలో లుక్స్ మ్యాచ్ కాలేదు. లుక్స్ పక్కన పెడితే... యాక్టింగ్ పరంగా ఆవిడ పూర్తి న్యాయం చేసింది. ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చే వరకు దర్శక రచయితలు కొన్ని సిల్లీ, రొటీన్ హారర్ సీన్లు రాసినా... కాస్తయినా ఆసక్తిగా చూడగలిగామంటే అదా శర్మ నటన ప్రధాన కారణం. కథలో అసలు విషయాన్ని సెకండాఫ్ కోసం దాచడంతో ఫస్టాఫ్ సోసోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ తర్వాత వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌ను సేవ్ చేశారు. క్లైమాక్స్ అయితే షాక్ & సర్‌ప్రైజ్ థ్రిల్ ఇస్తుంది.


'క్రిమినల్ ఆర్ డెవిల్'లో మెజారిటీ సీన్లు ఒకే ఇంటిలో జరుగుతాయి. కొన్నిసార్లు ఆ ఫీలింగ్ వస్తుంది. దాంతో సీన్లు కూడా రొటీన్ అనిపిస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. హారర్ సీన్లలో కెమెరా వర్క్ బావుంది. మ్యూజిక్, ఎడిటింగ్ హారర్ సినిమాలకు తగ్గట్టు ఉంది. అయితే, రోహిణి కామెడీ అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. దర్శక రచయితలు ఉన్నంతలో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.


Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?


అదా శర్మ యాక్టింగ్ 'క్రిమినల్ ఆర్ డెవిల్'కు అసలైన బలం. కేవలం కళ్లతో కొన్ని సీన్లలో భయపెడుతుంది. ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. అదా పెర్ఫార్మన్స్ ముందు తన పాత్ర తేలిపోకుండా విశ్వంత్ చక్కగా నటించారు. క్యారెక్టర్ పరంగా వేరియేషన్స్ చూపించాడు. అదా శర్మ, విశ్వంత్‌ మధ్య సీన్లు డిఫరెంట్‌గా ఉన్నాయి. హారర్‌తో పాటు రొమాంటిక్‌ మూమెంట్స్ కుదిరాయి. సిద్ధూ ఇంటిలో పనిమనిషిగా 'జబర్దస్త్' రోహిణి చేసే కామెడీ మాస్ బి, సి సెంటర్ ఆడియన్స్‌ను నవ్విస్తుంది ఏమో గానీ... ఈ జానర్ టార్గెట్ ఆడియన్స్‌ను అయితే నవ్వించదు. భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా తదితరుల నటన ఓకే.


హారర్ టచ్ ఇస్తూ తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'క్రిమినల్ ఆర్ డెవిల్'. రొటీన్ ఫస్టాఫ్, ట్విస్టులతో సర్‌ప్రైజ్ చేసే సెకండాఫ్... హీరోయిన్ అదా శర్మ ఫ్లాలెస్ యాక్టింగ్... విశ్వంత్ క్యారెక్టర్, అతడి నటన... ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. డీసెంట్ హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ తరహా ఎండింగ్ ట్విస్టుతో తెలుగులో అరుదుగా సినిమాలు వచ్చాయి.


Also Readవిద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జోడీ చేసిన రొమాన్స్ ఎలా ఉందంటే?