Bhool Bhulaiyaa 3 Review in Telugu: 1993లో వచ్చిన మలయాళ సినిమా ‘మణిచిత్రతాళు’ హార్రర్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్. 2005లో తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఈ సినిమాని ‘చంద్రముఖి’గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో 2007లో అక్షయ్ కుమార్‌తో ‘భూల్ భులయ్యా’ పేరుతో రీమేక్ చేయగా... అది కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీక్ ఆర్యన్‌ని హీరోగా పెట్టి 2022లో ‘భూల్ భులయ్యా 2’ని రిలీజ్ చేశారు హిందీ మేకర్స్. అది కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో మూడో పార్ట్‌గా ‘భూల్ భులయ్యా 3’ని కూడా తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది?


కథ: రుహాన్ అలియాస్ రూహీ బాబా (కార్తీక్ ఆర్యన్) ఒక దొంగ స్వామీజీ. దెయ్యాలు వదిలిస్తానని ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. దీనికి అతని మరుగుజ్జు స్నేహితుడు టిల్లు (అరున్ కుష్వా) సహకరిస్తూ ఉంటాడు. రుహాన్ దొంగ స్వామీజీ అని గుర్తించిన మీరా (త్రిప్తి దిమ్రి) అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆ తతంగం మొత్తం వీడియో తీస్తుంది. తాను చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి రుహాన్ నకిలీ బాబా అని అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరిస్తుంది. కానీ తాను చెప్పినట్లు చేస్తే ఆ వీడియోను డిలీట్ చేయడంతో పాటు రూ.కోటి ఇస్తానని చెప్తుంది. తనతో పాటు రుహాన్‌ని రక్త ఘాట్‌కు తీసుకువెళ్తుంది.


అక్కడ ఉన్న ఊళ్లో అందరూ రుహాన్‌ని వింతగా చూస్తూ ఉంటారు. రక్తఘాట్ కోటలో మంజులిక ఆత్మ ఉందని, దాన్ని బయటకు పంపితే కోటను మంచి రేట్‌కు అమ్మవచ్చని, ఆ తర్వాత నీకు డబ్బులు ఇస్తామని రుహాన్‌కు చెప్తారు. పాడుబడిన కోటను రీస్టోర్ చేయడానికి మల్లిక (విద్యాబాలన్) అక్కడికి వస్తుంది. ఆ కోటను కొనడానికి మందిర (మాధురీ దీక్షిత్) వస్తుంది. వీరు వచ్చిన దగ్గర నుంచి కోటలో వింత సంఘటనలు జరుగుతాయి. అసలు ఊళ్లో అందరూ రుహాన్‌ను వింతగా చూడటానికి కారణం ఏంటి? మల్లిక, మందిరల్లో మంజులిక ఎవరు? ఆఖరికి ఏం అయింది? అన్నది తెలుసుకోవాలంటే ‘భూల్ భులయ్యా 3’ చూడాల్సిందే.


విశ్లేషణ: ‘భూల్ భులయ్యా’ సిరీస్‌ సినిమాల్లో ఆడియన్స్‌ను చివరి దాకా కట్టిపడేసేది అసలు దెయ్యం ఎవరు? అనే విషయంలో వచ్చే ట్విస్ట్. ఆ విషయంలో ‘భూల్ భులయ్యా 3’ కూడా సక్సెస్ అయింది. చివర్లో వచ్చే ట్విస్ట్ గెస్ చేయడం అయితే ఎవరి వల్లా కాదు. కానీ ఇది మంచి సినిమా అనిపించడానికి ఒక ట్విస్ట్ సరిపోతుందా?


‘భూల్ భులయ్యా 3’ చాలా సరదాగా స్టార్ట్ అవుతుంది. రూహీ బాబాగా కార్తీక్ ఆర్యన్ చేసే మోసాలు ఆకట్టుకుంటాయి. కథ ఎప్పుడైతే రక్తఘాట్ కోటకు షిఫ్ట్ అవుతుందో అప్పట్నుంచి హార్రర్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. కొన్ని జంప్ స్కేర్ సీన్లు భయపెడతాయి. కానీ కథలో ముందుకు వెళ్లేకొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్టు మొదట షాక్ ఇచ్చినా సెకండాఫ్‌లో కన్ఫ్యూజన్‌ను బాగా పెంచుతుంది.


సినిమా కొన్ని డ్రీమ్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటి వల్ల కథ ముందుకు ప్రోగ్రెస్ అయ్యేది ఏమీ ఉండదు. హార్రర్‌ను కథలో నుంచి జనరేట్ చేయలేక ఇలా అవసరం లేని ఎపిసోడ్లతో క్రియేట్ చేశారని క్లియర్‌గానే కనిపిస్తూ ఉంటుంది. కామెడీ మాత్రం కొన్ని చోట్ల బాగా పేలింది. స్క్రీన్‌పై మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ఉండటంతో కామెడీ బాగా పండింది. చివర్లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్టు చూస్తే తెలుగులో ఇటీవలే రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ అయిన ఒక హార్రర్ కామెడీ గుర్తొస్తుంది.



Also Readబఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?


పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వినడానికి అంత బాగా లేవు. అలాగే సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా చాలా వరస్ట్‌గా ఉంది. సందీప్ శిరోద్కర్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కాస్త భయపెట్టాడు. సినిమాలో ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. కోట సెట్ బాగా వేశారు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... కార్తీక్ ఆర్యన్ రూహీ బాబాగా ఆకట్టుకుంటాడు. తనలో సహజంగా ఉండే కామెడీ టైమింగ్, ఈజ్... ఈ రోల్‌కు మరింత ప్లస్ అయింది. త్రిప్తి దిమ్రి పోషించిన హీరోయిన్ పాత్ర గ్లామర్ షోకు మాత్రమే పరిమితం. విద్యా బాలన్, మాధురి దీక్షిత్ లాంటి ప్రతిభావంతమైన నటులు ఉన్నప్పటికీ వారికి భయపెట్టడం తప్ప ఇంకే ఎమోషన్ చూపించడానికి అవసరమైన స్కోప్ లేకుండా చేశారు. మిగతా పాత్రధారులందరూ ఓకే.


ఓవరాల్‌గా చెప్పాలంటే... బాలీవుడ్ హార్రర్ కామెడీ అనగానే ‘స్త్రీ 2’ రేంజ్‌లో ఉంటుందనుకుని వెళ్లే మాత్రం దొరికిపోతారు. వీకెండ్‌లో కాస్త నవ్వించే ఒక సరదా టైమ్ పాస్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ‘భూల్ భులయ్యా 3’ చూడవచ్చు.



Also Readఅమరన్ రివ్యూ: నటనతో ఏడిపించిన సాయి పల్లవి... ఆర్మీ అధికారిగా శివకార్తికేయన్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉందంటే?