Kartikeya Gummakonda and Iswarya Menon's Bhaje Vayu Vegam Review: యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ 'బెదురులంక 2012'తో విజయం అందుకున్నారు. దాని తర్వాత ఆయన నటించిన సినిమా 'భజే వాయు వేగం'. యూవీ కాన్సెప్ట్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలకమైన క్యారెక్టర్లు చేశారు. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చదవండి.
కథ (Bhaje Vayu Vegam Story): వెంకట్ (కార్తికేయ గుమ్మకొండ) తల్లిదండ్రులు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు అతని బాధ్యతలు తండ్రి స్నేహితుడు (తనికెళ్ల భరణి) తీసుకుంటారు. కన్న కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో సమానంగా పెంచుతారు. వెంకట్‌ను క్రికెటర్ చేయాలని, రాజును మంచి ఉద్యోగంలో చూడాలని... వాళ్ల కోసం పొలంలో కొంత అమ్మి మరీ హైదరాబాద్ పంపిస్తాడు.
తండ్రితో తాము మంచి స్థాయిలో ఉన్నామని చెబుతూ వెంకట్ క్రికెట్ బెట్టింగ్ ఎందుకు చేస్తున్నాడు? ఫైవ్ స్టార్ హోటల్ వాలెట్ పార్కింగ్ డ్రైవర్‌గా రాజు ఎందుకు పని చేస్తున్నాడు? డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని వెంకట్, రాజు పేర్లు మీడియాలో ఎందుకు వచ్చారు? వాళ్లిద్దరూ మేయర్ జార్జ్ (శరత్ లోహితస్వ) తమ్ముడు డేవిడ్ (రవిశంకర్) కారును ఎందుకు దొంగిలించారు? ఆ కారులో ఏముంది? నిజంగా వెంకట్, రాజు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారా? అసలు నిజం ఏమిటి? చివరకు ఏం తేలింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Bhaje Vayu Vegam Review): జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనం ఉన్న కథలు, వైవిధ్యమైన కథాంశాలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు కార్తికేయ. ఆయన ఫ్లాప్ సినిమాల్లో కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్ అన్నట్టు ఉంటాయి. 'ఆర్ఎక్స్ 100' నుంచి 'బెదురు లంక 2012' వరకు ఆయన ప్రయాణం వైవిధ్యంగా సాగింది. కానీ, ఫస్ట్ టైమ్ ఆయన కమర్షియల్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా 'భజే వాయు వేగం'.
'భజే వాయు వేగం' పక్కా కమర్షియల్ ప్యాకేజ్ సినిమా. కథగా చూస్తే... కొత్త కాన్సెప్ట్ కాదు. స్నేహితుడి కుమారుడిని మరొకరు చేరదీసి సొంత కొడుకులా పెంచడం, వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు సిటీని గుప్పెట్లో పెట్టుకోవడం, ఓ సామాన్యుడు క్రికెట్ బెట్టింగ్ వంటివి బలి కావడం వంటివి ఆల్రెడీ చూసినవే. వీటిని కమర్షియల్ ప్యాకేజీ చేశారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. కథ, కథలో క్యారెక్టర్లు, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నారు. మెల్లగా ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ... ఇంటర్వెల్ దగ్గర ఆసక్తి పెంచారు.
ఇంటర్వెల్ తర్వాత నుంచి 'భజే వాయు వేగం'లో వేగం పెరిగింది. నెక్స్ట్ ఏంటి? అని ప్రేక్షకుడు ఆలోచించేలా కథనం ముందుకు సాగింది. తనికెళ్ల భరణి, శరత్ లోహితస్వ, రవిశంకర్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో డ్రామా పడింది. కపిల్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచాయి. యాక్షన్ సీక్వెన్సులు అన్నీ బావున్నాయి. ముఖ్యంగా కార్ ఛేజ్ సీక్వెన్స్ బావుంది. సాధారణ కథను తీసుకుని ట్విస్టులు, టర్నులతో ప్రశాంత్ రెడ్డి డీసెంట్ ఫిల్మ్ తీశారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
Also Read: 'గం గం గణేశా' మూవీ రివ్యూ: బ్లాక్ బస్టర్ 'బేబీ' సక్సెస్ కంటిన్యూ చేస్తుందా? దేవరకొండకు హిట్టేనా?
వెంకట్ పాత్రకు కార్తికేయ (Hero Karthikeya Role In Bhaje Vayu Vegam) పర్ఫెక్ట్ ఛాయిస్. క్రికెటర్ అనగానే నమ్మే అథ్లెటిక్ బాడీ అతనికి ఉంది. అలాగే, ఆ పాత్రకు అవసరమైన ఎమోషన్లు చూపించాడు. బ్యాట్ పట్టుకుని యాక్షన్ సీన్ ఇరగదీశాడు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర కథలో పరిమితమే. పాటల్లో, కీలక మలుపుల్లో ఉంది తప్ప ఆమెకు పెద్దగా యాక్టింగ్ చేసే స్కోప్ లేదు. ఐశ్వర్య కంటే రాహుల్ టైసన్, కార్తికేయ మధ్య ఎక్కువ సీన్లు ఉన్నాయి.
రాజు పాత్రలో రాహుల్ టైసన్ (Rahul Tyson)ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లో బాగా చేశాడు. ఆయన నటన, ఆ డైలాగ్ డెలివరీ సన్నివేశాల్లో ఎమోషన్ ఆడియన్స్ ఫీలయ్యేలా చేశాయి. తనికెళ్ళ భరణి, రవిశంకర్, టెంపర్ వంశీ, ఛత్రపతి శేఖర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సింపుల్ స్టోరీతో తీసిన కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ 'భజే వాయు వేగం'. కథ కంటే కథనం ఇంప్రెస్ చేస్తుంది. ట్విస్టులు, టర్నులు ఆకట్టుకుంటాయి. కార్తికేయ, రాహుల్ టైసన్, తనికెళ్ళ భరణి డిజప్పాయింట్ చేయలేదు. పక్కా మాస్ మసాలా ఫిలిమ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ హ్యాపీగా థియేటర్లకు వెళ్లవచ్చు.
Also Read: ఫ్యూరియోసా రివ్యూ: ‘మ్యాడ్ మ్యాక్స్’ ప్రీక్వెల్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఆకట్టుకుందా?