Jiiva and Arjun's horror thriller Aghathiyaa review in Telugu: 'యాత్ర' ఫేమ్, కోలీవుడ్ హీరో జీవా నటించిన హారర్ కామెడీ 'అగత్యా'. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. రాశీ ఖన్నా కథానాయిక. ఇషారి కే గణేష్‌, అనీష్ అర్జున్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పా. విజయ్‌ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి. 


కథ (Aghathiyaa Movie Story): అగస్త్య (జీవా) ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు పని చేసే అవకాశం రావడంతో సొంత డబ్బులు ఖర్చు చేసి పాండిచ్చేరిలోని ఓ పాత బంగ్లాలో సినిమా కోసం సెట్ వేస్తాడు. ఒకప్పుడు అందులో ఫ్రెంచ్ దొరలు ఉంటారు. అయితే, లాస్ట్ మినిట్‌లో షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయి వీణ (రాశీ ఖన్నా) ఇచ్చిన సలహా మేరకు ఆ సెట్‌ను స్కేరీ హౌస్ (దెయ్యాల కోట)గా మారుస్తారు. టికెట్ కొన్న ప్రజలకు ఆ హౌస్ చూసేందుకు అనుమతిస్తారు.


స్కేరీ హౌస్‌లో దెయ్యాలు ఉన్నాయని ప్రచారం మొదలవుతుంది. అగస్త్య, వీణ... ఫ్రెంచ్, ఇండియన్ దెయ్యాలు ఎదురవుతాయి. వాటి కథ ఏమిటి? సిద్ధ వైద్యం ద్వారా ఎన్నో రోగాలకు ఔషధాలు తయారు చేసిన డాక్టర్ సిద్ధార్థ్ (అర్జున్)కు, ఆ ఇంటికి సంబంధం ఏమిటి? తన తల్లి (రోహిణి) బోన్ క్యాన్సర్ చికిత్స కోసం సిద్ధార్థ్ రాసిన పుస్తకం, ఔషధం కోసం అగస్త్య వెతుకుతుంటే అతడిని అడ్డుకున్నది ఎవరు? ఆ మందు గురించి అగస్త్యకు ఎలా తెలిసింది? సిద్ధార్థ్‌ను చంపింది ఎవరు? అతనికి, అగస్త్యకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Aghathiyaa Review Telugu): 'అగత్యా' మొదలైన కాసేపటికి కామెడీనా?హారర్ సినిమానా? అనే సందేహం కలుగుతుంది. భయపెట్టే సన్నివేశాలు పడలేదు. కామెడీ కుదరలేదు. కొన్ని మాత్రమే నవ్వించాయి. మరికాసేపటికి ఇది హారర్ కామెడీనా? లేదంటే సిద్ధ వైద్యం గురించి తీసిన సినిమానా? స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో తీసిన సినిమానా? అనేది అర్థం కాదు. చివరకు దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడో ఎవ్వరికీ అంతు పట్టదు.


దర్శకుడు పా విజయ్ వైఫల్యం 'అగత్యా'లో అడుగడుగునా కనబడుతుంది. ఆయన ఏం చెప్పాలని కథ రాసుకున్నారో, సినిమా తీశారో అర్థం కాదు. హారర్, కామెడీ, సిద్ధ వైద్యం గొప్పదనం, తెల్లదొరల అహంకారం... ఏ విషయం ఎప్పుడు చెప్పాలో తెలియక చాలా గందరగోళానికి గురయ్యాడు. 'అగత్యా'లో కథ, స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసినట్లు కనిపించలేదు. ఒక ఫ్లో అసలు లేదు. ఒక సీన్ తర్వాత మరొకటి వచ్చి వెళుతుంటే... చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రేక్షకులది. మదర్ సెంటిమెంట్, డివోషనల్ పాయింట్ కూడా టచ్ చేశారు దర్శకుడు. ఏమాత్రం ఎఫెక్ట్ ఇవ్వని విధంగా వాటిని తీశారు.


కథతో సంబంధం లేకుండా తెరపై వచ్చినప్పుడు నవ్వించే కమెడియన్లు యోగి బాబు, వీటీవీ గణేష్. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని సన్నివేశంలో కాస్త స్టఫ్ ఇస్తే చాలు చెలరేగిపోయారు. అటువంటి ఆర్టిస్టులు స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కనీసం నవ్వు రాదు. అంత పేలవంగా సినిమా తీశారు. దర్శకుడికి, రచయితకు ఓ సన్నివేశానికి ఎప్పుడు కట్ చెప్పాలో తెలియడం ముఖ్యం. పా విజయ్ అది గుర్తించలేదు. చాలా సన్నివేశాలు నిడివికి మించి వెళుతూ ఉంటాయి. ఎందుకు సాగదీశారు? అనే ఫీల్ కలుగుతుంది. ఇక నిర్మాణ విలువలు మరీ పేలవంగా ఉన్నాయి. దాంతో ఆర్ట్ వర్క్, వీఎఫ్ఎక్స్ వంటివి సరిగా కుదరలేదు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు అది ఇబ్బందిగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ యానిమేషన్ ఫైట్ మరీ పేలవంగా ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా అంతంత్ర మాత్రమే.


Also Read: 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?


జీవాకు ఇటువంటి రోల్స్ చేయడం కొత్త కాదు. సన్నివేశాలకు తగ్గట్టు నటించారు. ఆ పాత్రలో అంతకు మించి ఆశించలేం. 'యాక్షన్ కింగ్' అర్జున్ నటించడం వల్ల డాక్టర్ సిద్ధార్థ్ పాత్రకు హుందాతనం వచ్చింది. రాశీ ఖన్నాది రెగ్యులర్ హీరోయిన్ రోల్. హీరోతో పాటు చాలా సన్నివేశాల్లో కనిపిస్తారు. కానీ, ఆవిడకు ఆ సీన్లలో అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. తల్లి పాత్రలో రోహిణి కనిపించారు. ఫ్రాన్స్ దేశస్తులుగా నటించిన ఫారిన్ ఆర్టిస్టులు ఓకే.


అగత్యా... కామెడీ కొంత, సిద్ధ వైద్యం గురించి చెప్పాలనే తాపత్రయం మరికొంత! పాయింట్ మంచిదే. కానీ, తెరపైకి తీసుకు రావడంలో దర్శక రచయితలు అసలు శ్రద్ధ చూపించలేదు. దాంతో అటు భయపెట్టలేక ఇటు నవ్వించలేక బోర్ కొట్టించింది. స్కిప్ చేయవచ్చు. క్లైమాక్స్‌కు గానీ క్లారిటీ రాదు... హీరో క్యారెక్టర్ ట్విస్ట్ గురించి! పాపం... అతనికీ ఆ విషయం తెలిసేది ఆ క్షణంలోనే! ప్రేక్షకులు అప్పటి వరకు థియేటర్లలో కూర్చుంటారా? అనేది చూడాలి.


Also Readదేవా రివ్యూ: సుధీర్ బాబుకు డిజాస్టర్ ఇచ్చిన మలయాళ సినిమా కథతో షాహిద్ కపూర్, పూజా హెగ్డే హిట్ కొట్టారా?