Manjummel Boys movie Telugu dubbed release date review: మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. రూ. 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. సౌబిన్ షాహిర్ ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించారు. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ఇతర ప్రధాన తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి ఏప్రిల్ 6న విడుదల చేసింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Manjummel Boys Story): కేరళలోని మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్ ట్రిప్‌కు వెళుతుంది. దేవాలయం దర్శనం తర్వాత గుణ కేవ్స్ (కమల్ హాసన్ హీరోగా సంతాన భారతి దర్శకత్వం వహించిన 'గుణ' సినిమాలో చూపించిన గుహలు) దగ్గరకు వెళతారు. అక్కడ ఓ స్నేహితుడు గుహల్లోని ఇరుకైన లోయలో పడిపోతాడు. అందులో పడిన మనుషులు ఎవరూ ప్రాణాలతో తిరిగి పైకి రాలేదు సరికదా శవాలు సైతం దొరకలేదని, స్నేహితుడి మీద ఆశలు వదులుకోమని మిగతా వాళ్లకు అక్కడి ప్రజలు చెబుతారు. అయితే, గుణ కేవ్స్ నుంచి వాళ్లు కదలరు. చివరకు గుహలో పడిన వ్యక్తి బతికి ఉన్నాడని తెలుస్తుంది. అతని ప్రాణాలతో బయటకు తీసుకు రావడం కుదిరిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Manjummel Boys Review): మలయాళ పరిశ్రమలో, ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమాల్లో సర్వైవల్ థ్రిల్లర్ జానర్ సినిమాలు చాలా తక్కువ. హాలీవుడ్ సినిమాల్లో ఇటువంటి ఫిలిమ్స్ ఎక్కువ. రీసెంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' కూడా ఈ జానర్ సినిమాయే. హాలీవుడ్ సినిమాలతో పాటు 'ది గోట్ లైఫ్' చిత్రానికి, 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రానికి డిఫరెన్స్ ఏమిటంటే... నేటివ్ థ్రిల్లర్ టచ్!
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా ప్రారంభం అంత గొప్పగా ఏమీ లేదు. సాధారణంగా ప్రారంభమైంది. ఊరిలో రెండు గ్యాంగ్స్, వాళ్ల మధ్య గొడవలు, స్నేహితుల మధ్య సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవు. అంతా రొటీన్. గుణ కేవ్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. గుహలోని లోయలో మనిషి పడిన తర్వాత ఉత్కంఠ, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి కలుగుతుంది.
'మంజుమ్మెల్ బాయ్స్' పూర్తిగా డైరెక్టర్స్ మూవీ. ఇందులో ఫలానా వ్యక్తి హీరో అని చెప్పలేం. సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్కరు హీరోగా కనబడతారు. గుహలోకి మనిషి పడిన తర్వాత వచ్చే ప్రతి కళ్ల ముందు జరిగినట్టు ఫీలయ్యేలా తెరకెక్కించారు దర్శకుడు చిదంబరం. రాళ్లు రప్పల మధ్య కొట్టుకుని కింద పడిన స్నేహితుడిని పైనుంచి వచ్చిన వ్యక్తి కలిసినప్పుడు వచ్చే ఓ సీన్ గుండెలు అదిరేలా చేస్తుంది. స్టార్టింగ్ కొన్ని సీన్లు గొప్పగా అనిపించవు. కానీ, ఎండింగ్ సీన్లకు కనెక్ట్ చేసిన విధానం, గుణ'లో పాటను వాడుకున్న తీరు సింప్లీ సూపర్బ్.
Also Read: ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్... ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పాత్రకు తగ్గట్టు చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ ఎక్స్‌ట్రాడినరీగా ఉన్నాయి. చిదంబరం దర్శకత్వంలో, ముఖ్యంగా విశ్రాంతి తర్వాత సన్నివేశాల్లో మెరుపులు ఉన్నాయి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్లలో 'మంజుమ్మెల్ బాయ్స్' ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఫస్టాఫ్ కొంత సాదాసీదాగా ఉంటుంది. ఒక్కసారి గుహలోకి వెళ్లిన తర్వాత క్యూరియాసిటీ పెరుగుతుంది. అది కంటిన్యూ అవుతుంది. టికెట్ రేటుకు సరిపడా థ్రిల్ ప్రేక్షకులకు గ్యారంటీ. గో అండ్ వాచ్.