Chiranjeevi About Jagadeka Veerudu Athiloka Sundari Sequel: మెగాస్టార్ చిరంజీవి.. అప్పుడప్పుడు తన సినిమాల గురించి, మెగా ఫ్యామిలీలోని ఇతర హీరోల సినిమాల గురించి ముందస్తుగా అప్డేట్స్ ఇస్తుంటారు. అధికారికంగా ప్రకటన రాకముందే చిరు అప్డేట్స్ ఇస్తుండడంతో.. ఫ్యాన్స్ అంతా ఆయన ప్రత్యేకంగా ఇచ్చే అప్డేట్స్‌కు చిరు లీక్స్ అని పేరు పెట్టుకున్నారు. ఇక చిరు లీక్స్‌లో భాగంగా తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మెగాస్టార్. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను సాధించిన విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అయితే దాదాపు 34 ఏళ్ల క్రితం వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ రానుందా అనే విషయాన్ని చిరు బయటపెట్టారు.


ఎమోషనల్ అయ్యాను..


తాజాగా ఆహాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో తాను జాన్వీ కపూర్‌ను కలిసి ముచ్చటించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘‘నేను జాన్వీ కపూర్‌ను కలిశాను. తనను దగ్గర తీసుకున్నాను. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నాకు వాళ్ల అమ్మ శ్రీదేవి గుర్తొచ్చింది. తను లేకపోవడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే నష్టం. కానీ తను నిన్ను గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్లిపోయింది అని జాన్వీతో అన్నాను’’ అంటూ జాన్వీ కపూర్‌ను కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. శ్రీదేవితో కలిసి ఆయన పలు సినిమాల్లో నటించారు. అదే విషయాన్ని జాన్వీ చెప్పుకొచ్చిందని అన్నారు.


అదే నా కోరిక..


‘‘ఇక్కడికి వచ్చేముందు జగదేక వీరుడు అతిలోక సుందరి చూశానని జాన్వీ నాతో చెప్పింది. నా చిన్నప్పుడు ఎప్పుడో అది చూశాను కానీ అంత స్పష్టంగా చూడలేదు. అసలు ఏం సినిమా, ఏం పర్ఫార్మెన్స్‌లు, ఏం డ్యాన్సులు అంటూ పొగుడుతూనే ఉంది. నేను థాంక్యూ చెప్పాను. మీరు, చరణ్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరికి పార్ట్  2 చేస్తే చూడాలి అన్నది నా కోరిక, దానికోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పింది. త్వరలోనే అది జరగొచ్చేమో అని చెప్పాను’’ అంటూ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్..


రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990లో విడుదలయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలను ఇష్టంగా వినే మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో చిరు, శ్రీదేవి కలిసి చేసిన ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటను ఇప్పటికీ ఎంతోమంది హీరోలు అదే కాస్ట్యూమ్స్‌తో ఇమిటేట్ చేశారు కూడా. ఇక మరోసారి అదే మ్యాజిక్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి రీ క్రియేట్ చేస్తే రికార్డులు తిరగరాసినట్టే అని మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ఈ కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్ - ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?