సినిమా రివ్యూ : లాఠీ 
రేటింగ్ : 2/5
నటీనటులు : విశాల్, సునైనా, ప్రభు, మాస్టర్ లిరిష్ రాఘవ్, రమణ, సన్నీ పీఎన్, ఏ వెంకటేష్, తలైవాసల్ విజయ్, మునీష్ కాంత్ తదితరులు
మాటలు : రాజేష్ ఎ. మూర్తి (తెలుగులో)
కూర్పు : ఎన్.బి. శ్రీకాంత్! 
ఛాయాగ్రహణం : బాలసుబ్రమణియమ్, బాలకృష్ణ తోట  
సంగీతం : యువన్ శంకర్ రాజా
నిర్మాతలు : రమణ, నందా దురైరాజ్!
రచన, దర్శకత్వం : ఎ. వినోద్ కుమార్ 
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2022


జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరో విశాల్ (Vishal). యాక్షన్ జానర్‌లో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుంటారు. ఆయన నటించిన తాజా సినిమా 'లాఠీ'. సాధారణంగా పోలీస్ కథలు అంటే హీరోలను ఐఏఎస్, మరీ తక్కువ అంటే ఎస్ఐగా చూపిస్తారు. కానీ, ఈ సినిమాలో హీరో ఓ కానిస్టేబుల్. ఈ కథ ఎలా ఉంది? సినిమాను ఎలా తీశారు (Laththi Telugu Review)? అనేది చూస్తే..   


కథ (Laththi Movie Story) :  కథ : జి. మురళీ కృష్ణ (విశాల్) కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడం కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతాడు. గతంలో నిజాయతీగా పని చేసినందుకు ప్రతిఫలంగా ఓ అధికారి సాయం చేస్తాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరతాడు. భార్య కవి (సునైన), కుమారుడు రాజు (మాస్టర్ లిరిష్ రాఘవ్)తో హ్యాపీగా జీవిస్తున్న మురళీ కృష్ణ ముందు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చీకటి ప్రపంచానికి దాదా శూర (సన్నీ పీఎన్), అతని కొడుకు వీర (నటుడు రమణ) అటాక్ చేస్తారు. ఓ సాధారణ కానిస్టేబుల్ కోసం సిటీలో రౌడీలు, పోకిరీలు అందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నారు? ఆ తర్వాత ఏమైంది? కరుడుగట్టిన కూనీకొరులతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Laatti Review In Telugu ) : 'లాఠీ' టైటిల్ వింటే, ట్రైలర్ చూస్తే... అవుట్ & అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా అనుకుంటారు. అలాగని, థియేటర్లలో అడుగు పెడితే పప్పులో కాలు వేసినట్టే. సినిమా ఫస్టాఫ్ అంతా యాక్షన్ కంటే రెగ్యులర్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. 


'లాఠీ'లో జస్ట్ యాక్షన్ మాత్రమే కాదు... తండ్రీ కొడుకుల అనుబంధం ఉంది. కన్న కొడుకు కోసం తండ్రి పడే తపన ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంది. ఓ నిజాయతీపరుడు కానిస్టేబుల్ అయితే ఎలా ఉంటుందో చూపించారు. వీటన్నిటి కంటే ముఖ్యంగా సమాజంలో మహిళలపై నిత్యం జరిగే అఘాయిత్యాన్ని, సభ్య సమాజంలో ఆ తప్పు చేసి దర్జాగా తిరిగే మానవ మృగాలకు ఎటువంటి శిక్ష పడాలని జనాలు కోరుకుంటారో... అటువంటి శిక్ష ఉంటుంది. అయితే... ఎక్కడా ఎప్పుడూ ఆ ఎమోషన్స్ ప్రేక్షకులను టచ్ చేసేలా లేవు. ఏదో రెగ్యులర్, రొటీన్ సినిమా చూసినట్టు ఉంటుంది. 


'లాఠీ'లో చివరి అరగంట యాక్షన్ బావుంది. ఒక దశలో ఆ యాక్షన్ కూడా సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. సుదీర్ఘంగా సాగుతుంది. పాత సినిమాలు చూసినట్టే ఉంటుంది. ఆ యాక్షన్ ఎఫెక్టివ్‌గా ఉండటానికి కారణం అంతకు ముందు సన్నివేశాలు. క్లుప్తంగా చెప్పాల్సిన సన్నివేశాలను చాలా సాగదీశారు. అందువల్ల, ఏదో చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మనం ఎంజాయ్ చేయలేము. లాజిక్స్‌కు సుదూరంగా కథ, కథనాలు ఉంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడా ఉండదు. మంచి పాయింట్ తీసుకుని కథ స్టార్ట్ చేసినప్పటికీ... దానిని ఒక రివేంజ్ ఫార్ములా కథగా మార్చేశారు. టెక్నికల్ పరంగా సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు లేవు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారంటే నమ్మేలా లేదు. ట్విస్టులు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. 


నటీనటులు ఎలా చేశారంటే? : విశాల్‌కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. ఫైట్స్ బాగా చేస్తారు. ఆయన సినిమాల్లో ఎక్కువ యాక్షన్ డామినేట్ చేస్తూ ఉంటుంది. అయితే, 'లాఠీ'లో ఎమోషనల్ సన్నివేశాల్లో నటనకు విశాల్‌కు పేరు వస్తుంది. సినిమా చివరి అరగంటలో యాక్షన్ అండ్ ఎమోషన్‌తో నటించిన తీరు బావుంటుంది. సునైనకు స్క్రీన్ మీద తక్కువ స్పేస్ లభించింది. పాత్ర వరకు ఆమె బాగా చేశారు. హీరో కుమారుడిగా మాస్టర్ లిరిష్ రాఘవ్ బావున్నాడు. ప్రభు, తలైవాసన్ విజయ్ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. శూర, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ ఓకే. వాళ్ళిద్దరి బదులు పేరున్న నటులను తీసుకుని ఉంటే ఇంపాక్ట్ బావుండేది.     


Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : సినిమాలో చివరి అరగంట యాక్షన్  సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం బావుంది. ఆ ఎపిసోడ్ కోసం అంతకు ముందు సుమారు రెండు గంటలు థియేటర్లలో కూర్చుకోవడం చాలా కష్టం. ఆ ఎపిసోడ్‌లో సాగదీతను భరించడం కూడా ఒక దశ దాటిన తర్వాత కష్టమే. 'లాఠీ'లో అటు ఉత్కంఠ లేదు, ఇటు హార్ట్ టచ్ చేసే ఎమోషన్ లేదు. ఉన్నదంతా జస్ట్ యాక్షన్. సినిమా స్టార్టింగ్‌లో కొన్ని సీన్లు బావున్నాయి. 'అభిమన్యుడు' చేసిన విశాల్... మధ్యలో ఇటువంటి యాక్షన్ రొటీన్ సినిమాలు చేయడం ఆశ్చర్యం అనిపిస్తోంది. 'లాఠీ' క్లైమాక్స్ ఫైట్ సాగుతూ ఉంటే ప్రేక్షకులపై లాఠీ ఛార్జ్ చేసినట్లు ఉంటుంది. రౌడీలతో పాటు ప్రేక్షకులను కుమ్మేసినట్టు ఉంటుంది.    


Also Read : 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ