Joruga Husharuga Review
సినిమా రివ్యూ: జోరుగా హుషారుగా
రేటింగ్: 2.5/5
నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ, సాయి కుమార్, రోహిణి, మధు నందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ తదితరులు
ఛాయాగ్రహణం: మహి రెడ్డి పండుగల
సంగీతం: ప్రణీత్ మ్యూజిక్
నిర్మాత: నిరీష్ తిరువీధుల
దర్శకత్వం: అను ప్రసాద్
విడుదల తేదీ: డిసెంబర్ 15, 2023
Joruga Husharuga Movie Review Telugu: 'బేబీ'తో యువ హీరో విరాజ్ అశ్విన్ ఈ ఏడాది భారీ విజయం అందుకున్నారు. నాని రీసెంట్ సినిమా 'హాయ్ నాన్న'లో ఓ కీలక పాత్రలో మెరిశారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'జోరుగా హుషారుగా'. ఇందులో పూజితా పొన్నాడ (Poojitha Ponnada) హీరోయిన్. ఇవాళ థియేటర్లలో విడుదలైందీ సినిమా.
కథ (Joruga Husharuga Movie Story): సూర్యం (సాయి కుమార్) చేనేత కార్మికుడు. జీవితంలో ఎదగడం అంటే సంపాదించుకునే ఆస్తులు కాదని, మనతో పాటు ఉండే మనుషులు అని అందరిలో గౌరవంగా బతికే వ్యక్తి. కొడుకు సంతోష్ (విరాజ్ అశ్విన్) కోరడంతో చేనేత సొసైటీలో రూ. 20 లక్షలు అప్పు తీసుకుంటాడు. ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చిన సంతోష్... కన్సల్టెన్సీ చేతిలో మోసపోతాడు. చివరకు యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే... వచ్చే జీతంతో అప్పు తీర్చడం పెద్ద కష్టంగా మారుతుంది. జీతం పెరగడం కోసం తన బాస్ ఆనంద్ (మధునందన్)ను బుట్టలో వేయాలని అతనికి పెళ్లి చేసే ప్రయత్నాలు మొదలు పెడతాడు. సరిగ్గా ఆ సమయంలో లవర్ నిత్య (పూజితా పొన్నాడ) ఆ ఆఫీసులో జాయిన్ అవుతుంది. ఆమెను ఆనంద్ ఇష్టపడతాడు. అప్పుడు ఆనంద్ ఏం చేశాడు? సంతోష్, నిత్య లవర్స్ అనేది ఆనంద్ తెలుసుకున్నాడా? లేదా? ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య దూరం ఎందుకు పెరిగింది? ఓవైపు ఇంటి దగ్గర అప్పు సమస్య... మరోవైపు ప్రేమలో సమస్య... సంతోష్ ఎలా పరిష్కరించాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Joruga Husharuga Telugu Movie Review): కథ కంటే కథనం, కామెడీకి ప్రేక్షకులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న రోజులు ఇవి. కథలో రెండున్నర గంటలు కాలక్షేపం చేసే అంశాలు ఉంటే చాలు... చూసేస్తున్నారు. కాసేపు హాయిగా నవ్వుకుని థియేటర్ల నుంచి బయటకు రావాలని కోరుకునే ప్రేక్షకుల కోసమే 'జోరుగా హుషారుగా'.
తండ్రి తమ కోసం ఏమీ సంపాదించలేదని అసంతృప్తి వ్యక్తం చేసే కుమారుడు... కన్న బిడ్డ కోసం పరువు పక్కన పెట్టే తండ్రి... డబ్బు కోసమో, మరొక అంశం కోసమో తప్పులు చేసిన ప్రియుడికి దూరంగా జరిగే ప్రేయసి... గతంలో కొన్ని సినిమాల్లో చూశాం. అందువల్ల, 'జోరుగా హుషారుగా' ఫస్టాఫ్ అంతా రొటీన్ వ్యవహారంగా ఉంటుంది. అయితే... చేనేత నేపథ్యం, హీరోని హీరోయిన్ టీజ్ చేసే అంశాలు వంటివి కథను పాస్ చేసేశాయి. కన్సల్టెన్సీ చేతిలో హీరో మోసపోవడం అనేది కొత్త కాకున్నా... కొందరు కనెక్ట్ అవుతారు.
'జోరుగా హుషారుగా'లో ఇంటర్వెల్ తర్వాత అసలు మేజిక్ జరిగింది. ఆ కాన్‌ఫ్లిక్ట్స్ 'తర్వాత ఏం జరుగుతుంది?' అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాక, అమ్మాయిని ప్రేమలో పడేయడం రాక మధునందన్ పడే పాట్లు నవ్విస్తాయి. ఆ సన్నివేశాలతో కొందరు కనెక్ట్ కావచ్చు. పాస్టర్ పాత్రలో బ్రహ్మాజీ సీన్లు కూడా బావున్నాయి. 'జోరుగా హుషారుగా'లో కథ పెద్దగా లేదు. కానీ, కామెడీ నవ్విస్తుంది.
ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే. పాటలు థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుకు రావు. కథ విషయంలో అను ప్రసాద్ మరింత వర్క్ చేసి ఉంటే బావుండేది. కొత్త కథకు ఈ కామెడీ సీన్స్ పడితే నెక్స్ట్ లెవల్ ఉండేది.
నటీనటులు ఎలా చేశారంటే: న్యూ ఏజ్ లవర్ బాయ్ క్యారెక్టర్లకు విరాజ్ అశ్విన్ పర్ఫెక్ట్ యాప్ట్ అని 'జోరుగా హుషారుగా' మరోసారి ప్రూవ్ చేసింది. 'బేబీ'లో ఆయన పాత్రకు ప్రశంసలు వచ్చాయి. అయితే... అందులో డ్యాన్సులకు పెద్దగా స్కోప్ లేదు. ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కుర్రాడి క్యారెక్టర్ అయినప్పటికీ... స్క్రీన్ మీద రిచ్‌గా కనిపించారు. కామెడీ టైమింగ్ బావుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు. నటుడిగా విరాజ్ అశ్విన్ (Viraj Ashwin)ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది.
పూజితా పొన్నాడ కూల్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశారు. విరాజ్ అశ్విన్, ఆ అమ్మాయి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూజిత యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ వల్ల లవ్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రేమకథ కొత్త లేకున్నా... హీరో హీరోయిన్లు ఆ సీన్లను నిలబెట్టారు. 'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు మరోసారి రిజిస్టర్ అయ్యే రోల్ చేశారు. సోనూ ఠాకూర్ గ్లామర్ షో తప్ప ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ లభించలేదు.
మధునందన్, 'క్రేజీ' ఖన్నాతో విరాజ్ అశ్విన్ కామెడీ సీన్స్ నవ్విస్తాయి. అలాగే... 'చమ్మక్' చంద్ర, బ్రహ్మాజీ సీన్స్ కూడా! సాయి కుమార్, రోహిణి స్క్రీన్ ప్రజెన్స్ ఆయా పాత్రలకు హుందాతనం తెచ్చింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
చివరగా చెప్పేది ఏంటంటే: 'జోరుగా హుషారుగా' కథలో కొత్తదనం లేదు. రొటీన్ ప్రేమకథకు తండ్రి కొడుకుల సెంటిమెంట్ యాడ్ చేయడం కొత్తగా ఉంది. హీరో విరాజ్ అశ్విన్ నటన బావుంది. ముఖ్యంగా కామెడీ సీన్స్ చాలా ఈతరం యువత రిలేట్ అయ్యేలా ఉన్నాయి. క్లీన్ కామెడీ ఉండటంతో హాయిగా నవ్వుకోవచ్చు. ఇది సరదాగా కాలక్షేపం చేసే సినిమా. జస్ట్ ఫర్ కామెడీ!
Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?