సినిమా రివ్యూ : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
రేటింగ్ : 2/5
నటీనటులు : 'అల్లరి' నరేష్, ఆనంది, 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్, కామాక్షి భాస్కర్ల, కుమనన్ సేతురామన్ తదితరులు
మాటలు : అబ్బూరి రవి 
ఛాయాగ్రహణం : రామ్‌ రెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత : రాజేష్ దండా
రచన, దర్శకత్వం : ఏఆర్ మోహన్
విడుదల తేదీ: నవంబర్ 25, 2022


'అల్లరి' నరేష్ (Allari Naresh) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam). ఎన్నికల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. 'నాంది'తో గతేడాది 'అల్లరి' నరేష్ ఖాతాలో మంచి విజయం చేరింది. ఆ విజయం కొనసాగించేలా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam Review) ఉందా?


కథ (Itlu Maredumilli Prajaneekam Story) : శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) తెలుగు టీచర్. నలుగురికి సాయం చేసే గుణం ఉన్న మనిషి. ఎన్నికల డ్యూటీ నిమిత్తం రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి వెళతాడు. పురిటి నొప్పులు పడుతున్న మహిళలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలంటే నది దాటాలి. చదువు సంధ్యలకు అయినా అంతే! గిరిజన గ్రామాల ప్రజలు తమ కష్టాలు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... అందుకని ఓటు వేయడానికి నిరాకరిస్తారు. శ్రీపాద శ్రీనివాస్ చేసిన ఓ పని వల్ల అందరూ ఓటు వేస్తారు. అయితే... బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను గిరిజన గ్రామంలోని కండా (శ్రీతేజ) కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు? కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు ఏం అయ్యింది? లక్ష్మి (ఆనంది) ఎవరు? అనేది మిగతా సినిమా.
   
విశ్లేషణ (Itlu Maredumilli Prajaneekam Review In Telugu) : ఎన్నికల నేపథ్యంలో సినిమాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తుకు వస్తారని... ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకునే నాథుడు ఉండదని పలు సినిమాల్లో డైలాగులూ ఉన్నాయి. ఒకవేళ తమ సమస్యలు తీర్చమని ఎన్నికల సమయంలో ఓ ఊరు ఊరు మొత్తం ఎదురు తిరిగితే? 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. 


సినిమాలో కొత్తదనం లేదు. కొత్తగా చెప్పిన విషయమూ లేదు. సినిమా ప్రారంభంలో ముగింపు ఎలా ఉండబోతుందనేది తెలుస్తుంది. ముగింపు తెలిసినప్పుడు కథను మరింత చిక్కగా రాసుకోవాలి. అందులో రెగ్యులర్ రొటీన్ సీన్స్ ఉండకూడదు. కొత్త విషయం కాకపోయినా... ప్రజల సమస్యలను ప్రేక్షకులకు చెప్పేటప్పుడు ఎమోషన్ మిస్ కాకూడదు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'లో కొన్ని మెరుపులు ఉన్నాయి. ఓ ప్రేక్షకుడు చివరి వరకూ కూర్చునేనంత ఆసక్తిగా కథనం సాగలేదు. ప్రసవం కోసం మహిళలు, ప్రమాదాలతో పురుషులు చికిత్స కోసం వాగులు, వంకలు దాటడం... వంటి సన్నివేశాలు వార్తల్లో చూస్తున్నాం. అవే మళ్ళీ తెరపై చూపించారు. అసలు, హీరో పాత్ర గిరిజనుల సమస్యలు చూసి హీరో చలించిపోయే సన్నివేశాల్లో మరింత భావోద్వేగం, బలం ఉండుంటే సినిమా ఫలితం మరోలా ఉంటుంది. హీరోని అతి మంచోడిగా చూపించారు. ఇటువంటి క్యారెక్టరైజేషన్లు కొత్త ఏమీ కాదు. కానీ, అంత మంచితనం ఉండటానికి గల కారణం చూపించి ఉంటే బావుండేది. క్లైమాక్స్ రొటీన్ అని చెప్పాలి. ఫోర్స్డ్ సీన్స్ ఎక్కువ అయ్యాయి. సినిమాటిక్‌గా ఉంది తప్ప... సహజత్వం ఎక్కడా కనిపించలేదు. లాజిక్స్ మర్చిపోతే మంచిది. 


తెరపై తర్వాత ఏం జరుగుతుందో ఒక్కోసారి మనకు తెలుస్తున్నా... అబ్బూరి రవి  రాసిన సంభాషణలు మనసును మీటేలా ఉన్నాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', 'సాయం చేస్తే మనిషి... దాడి చేస్తే మృగం', 'మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' వంటి అర్థవంతమైన సంభాషణలు రాశారు. ఆయన మాటలు కొన్ని సన్నివేశాలను బలంగా మార్చాయి. సినిమాటోగ్రఫీ ఓకే. మ్యూజిక్ పరంగా మెరుపులు లేవు.  


నటీనటులు ఎలా చేశారు? : 'అల్లరి' నరేష్‌కు ఇది సవాల్ విసిరే క్యారెక్టర్ కాదు. కానీ, శ్రీపాద శ్రీనివాస్ పాత్రకు ఎంత కావాలో, అంత వరకు చేశారు. నటుడిగా మరోసారి సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ప్రూవ్ చేశారు. సీరియస్ సినిమాలో 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్ కాసేపు నవ్వించారు. రఘుబాబు కూడా! ఆనంది, శ్రీతేజ్, కుమనన్ సేతురామన్, 'జెమినీ' సురేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. సంపత్ రాజ్ మరోసారి టైప్ కాస్ట్ రోల్ చేశారు. కలెక్టర్‌గా కనిపించారు. కామాక్షి భాస్కర్ల భావోద్వేగ భరిత పాత్రలో మెరిశారు.  


Also Read : 'తోడేలు' రివ్యూ : తెలుగులో వరుణ్ ధావన్, కృతి సనన్ 'భేడియా' సినిమా హిట్టా? ఫట్టా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : నరేష్ చేసిన మరో ప్రయోగంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మిగులుతుంది. కొన్ని నవ్వులు, కొన్ని అర్థవంతమైన సంభాషణలు ఉన్నాయి. నరేష్‌కు 'నాంది' తరహా విజయం, ప్రేక్షకులకు అటువంటి అనుభూతి ఇచ్చే సినిమా అయితే కాదు.


Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?