సినిమా రివ్యూ : ఐరావతం
రేటింగ్ : 1.25/5
నటీనటులు : అమర్‌దీప్ చౌదరి, తన్వి నేగి, ఎస్తేర్ నొరోన్హా, అరుణ్ కుమార్, సప్తగిరి, జయ వాహిని, సంజయ్ నాయర్ తదితరులు
ఛాయాగ్రహణం : ఆర్.కె. వల్లెపు
నేపథ్య సంగీతం: కార్తీక్ కొడకండ్ల
పాటలు : సత్య కశ్యప్
నిర్మాతలు : రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
రచన, దర్శకత్వం : సుహాస్ మీరా
విడుదల తేదీ: నవంబర్ 11, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
యూట్యూబ్ ఫిల్మ్స్, టీవీ సీరియళ్ళతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary). ఆయన హీరోగా నటించిన 'ఐరావతం' (Iravatham Movie). ఇందులో తన్వి నేగి హీరోయిన్. ఎస్తేర్ నొరోన్హా (Ester Noronha) ప్రధాన పాత్రలో నటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే (Iravatham Review)?
కథ (Iravatham Story) : శ్లోక (తన్వి నేగి) బ్యూటీషియన్. తాను పని చేసే బ్యూటీ పార్లర్ యజమాని కనకం ఆంటీ కుమారుడు (అమర్‌దీప్ చౌదరి)తో ఆమె ప్రేమలో ఉంటుంది. శ్లోక పుట్టినరోజుకు ఒక కెమెరా గిఫ్ట్ ఇస్తాడు. అందులో వీడియో రికార్డ్ చేసి చూస్తే... శ్లోక బదులు అచ్చంగా ఆమె పోలికలతో ఉన్న ప్రిన్సి వీడియో ప్లే అవుతాయి. ఎందుకలా జరుగుతోంది? శ్లోక, ప్రిన్సిలో ఎవరో ఒకరు మరణిస్తారని చెప్పిన ఫేస్ రీడర్ మాయ (ఎస్తేర్) ఎవరు? నగరంలో వరుస హత్యలతో కలకలం సృష్టిస్తున్న సైకో కిల్లర్ ఎవరు? శ్లోక మీద ఎటాక్ చేసిందెవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Iravatham Telugu Review) : 'విడిపోదామనే ఆడవాళ్ళ మాటకు బెంగపడొద్దు, కృంగిపోవద్దు. కలిసుందామని ముందుకు వచ్చే వాళ్ళ మాట పూర్తిగా నమ్మేయవద్దు' - తల్లి తమను విడిచి వెళ్ళిపోయిందని ఓ కుమారుడు బాధ పడుతుంటే... అతడికి తండ్రి చెప్పే మాట. ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఆ మాటల్లో అర్థమే లేదు. అలాగే, సినిమాలో కూడా! భార్య వదిలివెళ్ళిన బాధలో ఉన్న భర్త ఆత్మహత్య చేసుకుంటే... ఆ తర్వాత కుమారుడు సైకోగా మారి హత్యలు చేస్తే అనేది కథ.
జస్ట్ సైకో కిల్లర్ పాయింట్‌తో దర్శకుడు ఆగలేదు. హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేశాడు. ఆత్మలను తీసుకొచ్చాడు. కథగా చూస్తే... 'ఐరావతం'లో కాన్సెప్ట్ బావుంది. కానీ, తెరపైకి తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యాడు. పతాక సన్నివేశాల్లో వచ్చే టైటిల్ సాంగ్ మినహా ఏదీ ఆకట్టుకోదు. ప్రొడక్షన్ వేల్యూస్ సోసోగా ఉన్నాయి. కొంత మంది యాక్టింగ్ చేయలేదు. మరికొంత మంది ఓవర్ యాక్టింగ్ చేశారు. ఫ్లాష్‌బ్యాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
నటీనటులు ఎలా చేశారు? : సినిమాలో తన్వి నేగి డ్యూయల్ రోల్ చేశారు. కథలో ఆమెది కీలక పాత్ర. యాక్టింగ్‌లో ఆమె ఏబీసీడీ దగ్గర ఉన్నారు. స్క్రీన్ మీద బొమ్మ కనిపించినట్టు ఉంటుంది తప్ప... ఆమె బేసిక్ యాక్టింగ్ కూడా చేయలేదు. దాంతో ఏ సన్నివేశంలోనూ ఎమోషన్‌తో కనెక్ట్ కాలేం. అమర్‌దీప్ చౌదరి నటన ఓకే. ఎస్తేర్‌కు కొన్ని సినిమాల వల్ల గ్లామర్ ఇమేజ్ వచ్చింది. అయితే... అందుకు భిన్నమైన పాత్రను చేశారు. మిగతా ఆర్టిస్టుల్లో ఎవరూ చెప్పుకోదగ్గ యాక్టింగ్ చేయలేదు. ఆఖరికి సప్తగిరి కూడా నవ్వించలేకపోయారు.
Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ఐరావతం అంటే ఇంద్రుడి ఏనుగు. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమా చూసిన తర్వాత అసలు ఇందులో ఏముందో అర్థం కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ లేదంటే థ్రిల్ కోసం ఎవరైనా సినిమాలు చూస్తారు. ఈ సినిమాలో థ్రిల్స్ లేవు. కానీ, చూసిన వాళ్ళకు టార్చర్ ఉంటుంది. స్కిప్ కొట్టేయడం బెటర్. ఇందులో మిస్టరీ లేదు, థ్రిల్లు లేదు.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?