Godzilla X Kong Movie Review
సినిమా రివ్యూ: గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్
రేటింగ్: 2.75/5
నటీనటులు: రెబెక్కా హాల్, బ్రయాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్ తదితరులు
ఛాయాగ్రహణం: బెన్ సెరెసిన్
స్క్రీన్‌ప్లే: టెరీ రోస్లో, సైమన్ బారెట్, జెరెమీ స్లేటర్
సంగీతం: టామ్ హాల్కెన్ బోర్గ్, ఆంటోనియో డీ అయోరియో
నిర్మాణ సంస్థ: లెజెండరీ పిక్చర్స్
దర్శకత్వం: ఆడం విన్‌గార్డ్
విడుదల తేదీ: మార్చి 29, 2024
2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ అనే సినిమాను లెజెండరీ పిక్చర్స్ నిర్మించింది. ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లను చూస్తే మొదటి భాగం కంటే అతి భారీగా ఈ సినిమాకు తెరకెక్కించినట్లు అర్థం అయింది. తెలుగు హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్లే గాడ్జిల్లా, కాంగ్‌లకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. టీమ్ గాడ్జిల్లా, టీమ్ కాంగ్ అంటూ ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ఎలా ఉంది? ఇంతకు ముందు భాగంలా ఆకట్టుకుందా?
కథ: ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ మొదటి భాగంలో గాడ్జిల్లా, కాంగ్ కలిసి మెకాగాడ్జిల్లాను ఓడించిన తర్వాత కాంగ్... హాలో ఎర్త్‌లో (భూమి లోపలిభాగంలో ఉన్న మరో ప్రపంచం) నివాసం ఏర్పరచుకుంటుంది. గాడ్జిల్లా మాత్రం భూమి మీదనే ఉంటూ మనుషులపై దాడి చేసే టైటాన్స్‌ను అంతం చేస్తూ ఉంటుంది. గాడ్జిల్లా, కాంగ్ వంటి టైటాన్స్‌ను గమనిస్తూ వాటిపై పరిశోధన చేసే సంస్థ మోనార్క్. ఒకసారి హాలో ఎర్త్‌లో ఉన్న మోనార్క్ అవుట్‌పోస్ట్‌కు ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని భూమి మీద ఉన్న మోనార్క్ సంస్థకు పంపిస్తారు.
ఐవి అనే తెగకు చెందిన చివరి బాలిక జియాను (కేలీ హాటిల్) కాంగ్ నివసించే స్కల్ ఐలాండ్ నుంచి రక్షించి మోనార్క్ కంపెనీకి చెందిన డాక్టర్ ఐలీన్ ఆండ్రూస్ (రెబెక్కా హాల్) చూసుకుంటూ ఉంటుంది. జియా కూడా ఇదే సిగ్నల్‌ను అందుకుంటుంది. ఈ సిగ్నల్ రావడం మొదలవగానే గాడ్జిల్లా తన శక్తిని పెంచుకోవడానికి ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరోవైపు కాంగ్ హాలో ఎర్త్‌లో తన జాతికి చెందిన వారు ఇంకెవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటుంది. గాడ్జిల్లా ఎందుకు పవర్ పెంచుకుంటుంది? కాంగ్ వెతుకులాటకు జవాబు దొరికిందా? ఈసారి గాడ్జిల్లా, కాంగ్‌ను ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: గాడ్జిల్లా, కాంగ్ లాంటి భారీ టైటాన్స్ ఉన్న సినిమాలకు కథతో పెద్దగా పని ఉండదు. యాక్షన్ సన్నివేశాలను కళ్లు చెదిరేలా తీసి, దానికి ముందు స్టేజింగ్ బాగా వచ్చేలా చూసుకుంటే చాలు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ రిజల్ట్ అందుకుంటాయి. ఇలాంటి సినిమాల్లో కథ అంచనా వేయడం కూడా పెద్ద కష్టం. భూమిని అంతం చేయడానికి వచ్చే ఒక టైటాన్‌ను గాడ్జిల్లా, కాంగ్ ఎలా ఆపాయి అన్నదే కథ. గాడ్జిల్లా సిరీస్, కాంగ్ సిరీస్‌ల్లో వచ్చిన ఇంతకుముందు సినిమాల్లో కూడా కథ ఇలానే ఉంటుంది.
కానీ ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’లో యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ అంతకు మించి అనేలా ఉంటాయి. ముఖ్యంగా బ్లూ గాడ్జిల్లా, పింక్ గాడ్జిల్లాగా మారడం, పోరాట సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ విషయంలో దొరక్కుండా చూసుకున్నారు. అది ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆడియన్స్ ఈ సినిమాలకు వచ్చేది అందుకేగా మరి. క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్ ఈ సినిమాకు మేజర్ హైలెట్. సినిమా చూసిన ప్రేక్షకుడు ఒక హై, ఒక ఎమోషన్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాడు. గాడ్జిల్లా, కాంగ్‌లతో మనుషులకు కాస్త ఎమోషనల్ బాండింగ్ చూపించే ప్రయత్నం కూడా ఈ సినిమాలో చేశారు. అది వర్కవుట్ అయింది కూడా.
సినిమా అక్కడక్కడా తెలుగు సినిమాలను తలపిస్తుంది. గాడ్జిల్లాకు, కాంగ్‌కు ప్రత్యేకంగా ఎంట్రీ సీన్ ఫైట్లు, మొదట అవి రెండూ కొట్టుకున్నా చివరికి కలిసి ఒకే ప్రత్యర్థితో పోరాడతాయి. గట్టిగా ఆలోచిస్తే ‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ కూడా ఇదే కదా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కాంగ్ మెయిన్ విలన్ రాజ్యంలోకి ఎంటర్ అయ్యే సీన్ చూస్తే ‘బాహుబలి 1’ ఇంటర్వెల్ సీన్, కేజీయఫ్ సినిమా సీన్లు గుర్తొస్తాయి. ఇండియన్ సినిమాలను చూసి ఇన్‌స్పైర్ అయి రాశారా లేక అక్కడి వారికి స్వతహాగా వచ్చిన ఆలోచనా అన్నది చెప్పలేం కానీ ఇండియన్ ఆడియన్స్‌కి మాత్రం ఇక్కడి సినిమాల ఫ్లేవర్ గట్టిగా తగులుతుంది.
గాడ్జిల్లా, కాంగ్ పాత్రలకు మార్కెట్లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు పాత్రలతో ఒక పాత్రని పెట్టి సినిమా తీస్తేనే విలన్ చాలా బలంగా ఉండేలా చూసుకోవాలి. మరి రెండూ కలిసి పోరాటం చేస్తున్నాయంటే ఎదుర్కొనే టైటాన్ ఏ రేంజ్‌లో ఉండాలి? ఈ విషయంలో గాడ్జిల్లా వర్సెల్ కాంగ్ ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విలన్‌గా కనిపించిన టైటాన్ ఏ దశలోనూ బలంగా కనిపించదు. కాంగ్‌తో మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లోనే దాదాపు చచ్చినంత పని అవుతుంది. వేరే పవర్‌ఫుల్ టైటాన్‌ను విలన్‌గా చూపించి ఉంటే బాగుండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... గాడ్జిల్లా, కాంగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు చీమల్లా కనిపించే ఆర్టిస్టులపై చూపు వెళ్లడం కష్టమే. కానీ కొన్ని పాత్రలు తమ నటనతో ఆకట్టుకుంటాయి. ఐవి తెగకు చెందిన అమ్మాయి జియాగా కనిపించిన కేలీ హాటిల్, మోనార్క్ కంపెనీ డాక్టర్ ఐలీన్ ఆండ్రూస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటారు. బెర్నీ పాత్రలో కనిపించిన బ్రయాన్ టైరీ హెన్రీ సినిమాకు మంచి ప్లస్ అయ్యాడు. స్క్రీన్‌పై తను కనిపించినప్పుడల్లా వన్ లైనర్ డైలాగులతో నవ్వులు పూయిస్తాడు.
Also Read: టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ మేజిక్ రిపీట్ చేశాడా? టిల్లన్న సీక్వెల్ హిట్టా? ఫట్టా?
ఓవరాల్‌గా చెప్పాలంటే... స్టోరీ కొంచెం అటూ ఇటుగా స్క్రీన్‌పై గాడ్జిల్లా, కాంగ్ మ్యాజిక్ కనిపిస్తే చాలు అనుకునే వారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’. ఈ వీకెండ్‌కు మంచి యాక్షన్ సినిమాతో టైమ్‌పాస్ అవ్వాలనుకున్నా సరదాగా థియేటర్లో చూసేయచ్చు. అయితే ఇది కచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే బిగ్ స్క్రీన్‌పై టైటాన్స్ ఫైట్‌ను చూసిన ఫీల్ రాకపోవచ్చు.
పీఎస్: ఈ శుక్రవారం ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’తో పాటు ‘టిల్లు స్క్వేర్’ కూడా రిలీజ్ అయింది. దానికి, దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? గాడ్జిల్లా, కాంగ్‌లకే కాదు టిల్లు అన్నకి కూడా కథ, కాకరకాయలతో పెద్దగా పని ఉండదు. స్క్రీన్‌పై గాడ్జిల్లా, కాంగ్, టిల్లు కనిపిస్తే చాలు మ్యాజిక్ జరిగిపోతుందంతే.
Also Read: ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?