Prathinidhi 2 Teaser Out Now: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా పరిచయం అవుతున్నారు. తాజాగా జర్నలిస్ట్ మూర్తి కూడా ‘ప్రతినిధి 2’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఒకప్పుడు ‘ప్రతినిధి’లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో అందరినీ ఆకట్టుకున్న నారా రోహిత్... సీక్వెల్‌లో కూడా హీరోగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత రోహిత్ ఈ మూవీతో రి-ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. శుక్రవారం విడుదలైన ‘ప్రతినిధి 2’ టీజర్‌ అంచనాలను మరింత పెంచేసింది.


టీజర్ ఎలా ఉంది?


‘‘జనం కోసం బతికితే.. చచ్చాక కూడా జనంలో ఉంటాం’’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీవీ జర్నలిస్ట్ పాత్రతో నారా రోహిత్ ఎంట్రీ ఇస్తారు. ఇంటర్వ్యూలో రాజకీయ నేతను ప్రశ్నలతో నిలదీస్తాడు. ‘‘మన రాష్ట్రం అప్పు ఎంత ఉంటుంది సార్?’’ అని అడుగుతాడు. ఇందుకు ఆ పొలిటీషియన్ ‘‘సుమారు రూ.5 లక్షల కోట్లు ఉండవచ్చు’’ అంటారు. ‘‘రూ.5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత టైమ్ పడుతుంది సార్? అని అడుగుతారు రోహిత్. ఇందుకు బదులిస్తూ.. ‘‘అభివృద్ధి ఉంటే అది ఎంతసేపు?’’ అంటారు. ‘‘అదెక్కడుంది సార్’’ అని రోహిత్ అంటాడు. చివర్లో.. ‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అదీ కుదరకపోతే చచ్చిపోండి’’ అనే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. ఏప్రిల్ నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఎలక్షన్స్ టైమ్ కావడంతో ‘ప్రతినిధి 2’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ ఏడాది పొలిటికల్ అజెండాతో విడుదలైన సినిమాలేవీ హిట్ కొట్టలేదు. అయితే, ఈ మూవీ వాటికి భిన్నంగా ఉంది. ప్రజాసమస్యలనే ప్రధాన పాయింట్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


జర్నలిస్ట్ పాత్రలో..


‘ప్రతినిధి 2’ చిత్రం ప్రకటించిన రోజు నుంచి హాట్ టాపిక్‌గా మారింది. ఇక టీజర్ విషయానికి వస్తే.. నారా రోహిత్ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నారు. ‘ప్రతినిధి 2’ కాన్సెప్ట్ పోస్టర్ నుంచి ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ‘ప్రతినిధి’ కూడా పొలిటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2014లో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రశాంత్ మండవ తెరకెక్కించగా.. ఇప్పుడు ఈ సీక్వెల్‌ను జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు డైరెక్ట్ చేశారు.



అండర్ రేటెడ్ సినిమా..


కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా ‘ప్రతినిధి 2’ను నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అప్పట్లో ‘ప్రతినిధి’కి ప్రేక్షకుల దగ్గర నుంచి భారీగా ఆదరణ లభించినా కూడా కమర్షియల్‌గా మాత్రం మూవీ హిట్ అవ్వలేకపోయింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో అలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ చిత్రం రాలేదని కొందరు ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. కాగా తెలుగులోని అండర్ రేటెడ్ చిత్రాల్లో ‘ప్రతినిధి’ కూడా ఒకటి. దాని సీక్వెల్ అనగానే ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది.


ఆరేళ్ల తర్వాత..


‘ప్రతినిధి’లాగా కాకుండా దాని సీక్వెల్ అయినా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వాలని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. ‘ప్రతినిధి 2’ టీజర్ చివర్లో నారా రోహిత్ చెప్పే డైలాగ్‌ను బట్టి సినిమాలో ఓటు అంశానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నారా ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రోహిత్.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడరు. ఇప్పటివరకు ఆయన నటించిన దాదాపు ప్రతీ సినిమాలో ఏదో ఒక సామాజిక అంశం దాగి ఉంటుంది. 2018లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో హీరోగా నటించిన తర్వాత వెండితెరపై కనుమరుగయిపోయారు. మళ్లీ ‘ప్రతినిధి 2’తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సినిమా.. ఆయన రీ ఎంట్రీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.


Also Read: సినిమా రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే: బాలకృష్ణ