సినిమా రివ్యూ : విడుదల పార్ట్ 1
రేటింగ్ : 3/5
నటీనటులు : సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో విజయ్ సేతుపతి
పాటలు : చైతన్య ప్రసాద్ (తెలుగులో)
సినిమాటోగ్రఫీ : ఆర్. వేల్ రాజ్ 
సంగీతం : ఇళయరాజా
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
రచన, దర్శకత్వం : వెట్రిమారన్
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్) 
విడుదల తేదీ: ఏప్రిల్ 15, 2022


తమిళ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran)కు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. ఆయన 'ఆడుకాలం' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయన తీసిన చిత్రాలకు జాతీయ పురస్కారాలొచ్చాయి. ధనుష్ హీరోగా ఆయన తీసిన 'అసురన్'ను తెలుగులో 'నారప్ప'గా రీమేక్ చేశారు. తమిళ  హాస్యనటుడు సూరి (Actor Soori) హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన సినిమా 'విడుదల పార్ట్ 1' (Viduthalai Part 1 Review In Telugu). విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళంలో మార్చి 31న విడుదలైంది. తెలుగులో ఈ రోజు విడుదలైంది.
 
కథ (Vidudhala Movie Story) : తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను 'ప్రజా దళం' వ్యతిరేకిస్తూ... ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఓ ప్రాంతంలో గనుల వెలికితీతను నిరసిస్తూ బాంబుల ద్వారా రైలును పేల్చేస్తుంది. ప్రజా దళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి 'ఆపరేషన్ గోస్ట్ హంట్' పేరుతో పోలీసులు ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ డ్రైవర్ కుమరేశన్ (సూరి)కు పోస్టింగ్ పడుతుంది. 


ఎన్ని శిక్షలు వేసినా, బాత్రూంలు కడగమన్నా కడుగుతాడు గానీ చేయని తప్పుకు ఉన్నతాధికారికి ఎందుకు క్షమాపణ చెప్పాలనే వ్యక్తిత్వం కుమరేశన్ ది. ప్రజాదళం నాయకులను పట్టుకోవడానికి పోలీసులు చేసే చర్యలు చూసి అతను ఏం చేశాడు? పాప అలియాస్ తమిళరసి (భవాని శ్రీ)తో అతని కథేంటి? చివరకు, పెరుమాళ్ దొరికాడా? లేదా? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Viduthalai Review Telugu) : మిగతా దర్శకులతో పోలిస్తే... వెట్రిమారన్ శైలి భిన్నమైనది. వర్ణ వివక్ష లేదా బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు... ఈ సమాజంలో అసమానతలను సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. 


'విడుదల'ను కేవలం కథగానో, పోలీస్ శాఖకు వ్యతిరేకంగానో తీయలేదు. దీనిని ఒక విజువల్ పోయెట్రీగా చూపే ప్రయత్నం చేశారు వెట్రిమారన్. అందులో పూర్తిస్థాయి విజయం సాధించారు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను 80వ దశకంలోకి తీసుకు వెళుతుంది. ముఖ్యంగా కొన్ని సింగిల్ షాట్స్ వచ్చినప్పుడు అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాం. ఇళయరాజా సంగీతం మరోసారి వీనుల విందుగా ఉంటుంది. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. రెండూ బావున్నాయి. నేపథ్య సంగీతాన్ని ఎవరూ గుర్తించలేరు. అంత సహజంగా కథతో పాటు ఇళయరాజా రీ రికార్డింగ్ సాగింది. పతాక సన్నివేశాల్లో యాక్షన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.


కథగా చూస్తే... ఒకటి, 'విడుదల'లో కొత్తదనం లేదు. రెండు, తమిళ నేటివిటీ మరీ ఎక్కువైంది. మూడు, వెట్రిమారన్ శైలి సాగదీత ఉంది. ప్రేక్షకులు ఎవరికైనా సూరి క్యారెక్టరైజేషన్, 'ఠాగూర్'లో ప్రకాష్ రాజ్ పాత్రను గుర్తు చేస్తే తప్పు లేదు. కథతో పాటు కథనం వేరు గానీ... రెండు పాత్రల మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సూరి పాత్రలో సంఘర్షణను బలంగా ఆవిష్కరించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. 


పోలీసులలో మంచోళ్ళు, చెడ్డోళ్లు ఉంటారని చెప్పిన వెట్రిమారన్... సహజత్వాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో ఇంతకు ముందు కంటే ఓ అడుగు ముందుకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా దుస్తులు విప్పించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. ఆ స్థాయి సీన్లను తెలుగు ప్రేక్షకులు చూడలేరేమో అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో ట్రైన్ యాక్సిడెంట్ సన్నివేశాల్లోనూ గాయాలు పాలైన వ్యక్తులను చూసినప్పుడు మనకు తెలియకుండా ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమకథలో స్వచ్ఛత, సింప్లిసిటీ ఆకట్టుకుంటుంది. 


'విడుదల పార్ట్ 1' చూశాక... పార్ట్ 2 కోసం అసలు కథను వెట్రిమారన్ దాచేశారని అనిపిస్తుంది. పెద్ద నెట్వర్క్ కలిగిన ప్రజాదళం నాయకుడు అంత సులభంగా అరెస్ట్ కావడం వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? అనే సందేహం కలుగుతుంది. ట్రైన్ బ్లాస్ట్ గురించి పతాక సన్నివేశాల్లో విజయ్ సేతుపతి పదేపదే చెప్పడం వెనుక కూడా పార్ట్ 2లో ఏదో చూపించబోతున్నారని అర్థం అవుతుంది. ముఖ్యంగా... పత్రికల్లో వార్తల్లో వెనుక మరో కోణం ఉంటుందని, నిజాల్ని దాస్తారని సున్నితమైన విమర్శ చేశారు. ప్రతిదీ గుడ్డిగా నమ్మకూడదనే సందేశమూ ఇచ్చారు. 


నటీనటులు ఎలా చేశారు? : సూరిలో హాస్య నటుడిని చూసిన ప్రేక్షకులకు, కొత్త నటుడిని చూపించారు వెట్రిమారన్. సీరియస్ రోల్ బాగా చేశారు సూరి. పాత్రకు న్యాయం చేశారు. విజయ్ సేతుపతి కనిపించేది రెండు మూడు సన్నివేశాలే. ఆయన స్క్రీన్ మీదకు వచ్చిన ప్రతిసారీ ఒక హై వచ్చింది. పతాక సన్నివేశాల తర్వాత పార్ట్ 2 ఎలా ఉంటుందో చూపించినప్పుడు... విజయ్ సేతుపతి తప్ప మరొకరు ఆ సన్నివేశం చేయగలరా? అనే సందేహం వస్తుంది. హీరోయిన్ భవానీ శ్రీ నటన సహజంగా ఉంది. పాత్రకు సరిగ్గా సరిపోయింది. డీఎస్పీగా గౌతమ్ మీనన్ ఓకే.


Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?


చివరగా చెప్పేది ఏంటంటే? : వెట్రిమారన్ అభిమానులను 'విడుదల పార్ట్ 1' డిజప్పాయింట్ చేయదు. విజయ్ సేతుపతి నటనతో, చివరి సన్నివేశంతో ఆయన పార్ట్ 2 మీద అంచనాలు పెంచేశారు. మేకింగ్ పరంగా సినిమాలో హై  స్టాండర్డ్స్ ఆకట్టుకుంటాయి. హృదయ విదారకరమైన సీన్లు కొన్ని గుండెల్ని పిండేసే విధంగా ఉన్నాయి. తమిళ నేటివిటీ, రియలిస్టిక్ అప్రోచ్ టూమచ్ అనిపిస్తుంది.


డోంట్ మిస్ : సినిమా అంతా ఒక ఎత్తు, పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ ఒక ఎత్తు! విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మధ్య క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్ క్లాప్స్ కొట్టే విధంగా ఉంది. అటువంటి సీన్ చేసినందుకు విజయ్ సేతుపతిని అభినందించాలి. 'విడుదల పార్ట్ 2'కు ఇది జస్ట్ ట్రైలరే. 


Also Read : 'ఓ కల' రివ్యూ : డిప్రెషన్‌కు ఆత్మహత్యే పరిష్కారం కాదని చెప్పే సినిమా!